Blood Moon 2025: అంతరిక్షంలో ఆవిష్కృతమయ్యే ఖగోళ ఘట్టాలు ఎప్పటికీ ఆశ్చర్యకరమే!. వినీలాకాశంలో చోటుచేసుకునే అరుదైన ఘట్టాలను వీక్షించేందుకు చాలామంది ఔత్సాహికులు ఎదురుచూస్తుంటారు. అలాంటివారికి ఈ ఆదివారం నాడు ఆకాశంలో అరుదైన అద్భుతం కనిపించబోతోంది. సెప్టెంబర్ 7న ‘బ్లడ్ మూన్’ (Blood Moon 2025) ఆకాశంలో కనువిందు చేయనుంది. ఈ ఖగోళ ఘట్టాన్ని సాధారణ ప్రజలు, ఔత్సాహికులు ఎలాంటి ప్రత్యేక పరికరాలు అవసరం లేకుండానే తిలకించవచ్చు. హైదరాబాద్ నగరవాసులు ‘బ్లడ్ మూన్’ను స్పష్టంగా వీక్షింవచ్చు.
వాతావరణం అనుకూలంగా ఉండి, ఆకాశం మేఘావృతం కాకపోతే మాత్రం ఈ అరుదైన దృశ్యం అందరికీ కనిపిస్తుంది. చంద్రుడు ఎరుపు-నారింజ రంగుల్లోకి మారే దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తాయి. సంపూర్ణ చంద్ర గ్రహణం (Total Lunar Eclipse) కారణంగా చంద్రుడి రంగు మారుతుంది. ఈ ఘట్టం ఆదివారం రాత్రి 8:58 గంటల నుంచి సోమవారం ఉదయం 2:25 గంటల వరకు కొనసాగనుంది. నిజానికి గతంలో కూడా బ్లడ్ మూన్ గ్రహణాలు ఏర్పడ్డాయి. కానీ, ఇదివరకు ఏర్పడిన బ్లడ్ మూన్ గ్రహణాల సమయంలో, పూర్తిగా కనిపించకపోవడంతో చాలామంది వాటిని వీక్షించలేకపోయారు. అయితే, ఈసారి, పూర్తిచంద్ర గ్రహణం భారతదేశంలోని అన్ని నగరాల్లో స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎరుపు రంగ వర్ణంలో చంద్రుడు కనిపించే దశ దాదాపు 80 నిమిషాలపాటు కొనసాగుతుందని శాస్త్రవేత్తల వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Read Also- Ganesh immersion: గణేష్ నిమజ్జనం దృష్ట్యా హైదరాబాద్ ట్రాఫిక్ ఆంక్షలు.. రూట్ మ్యాప్ ఇదే
బ్లడ్ మూన్ ఎలా ఏర్పడింది?
బ్లడ్ మూన్ అంటే చంద్రుడు ఎర్రగా మారే ఖగోళ ఘట్టం. ఈ ప్రక్రియ సంపూర్ణ చంద్ర గ్రహణం (Total Lunar Eclipse) సమయంలో ఆవిష్కృతం అవుతుంది. సాధారణంగా చంద్రగ్రహణం సమయంలో భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సరళి రేఖలో ఉంటాయి. సూర్యుడు, చంద్రుడి మధ్యలోకి భూమి వస్తుంది. అప్పుడు భూమి నీడ చంద్రుడిని కప్పేస్తుంది. కాబట్టి, భూమిపైకి కనిపించే అవకాశం ఉండదు. అయితే, బ్లడ్ మూన్ సమయంలో భూవాతావరణంలోని సూర్యకాంతి వంపు తిరిగి చంద్రుడిపై పడుతుంది. అయితే, ఆ వెలుతురు ఎరుపు రంగులో ఉంటుంది. ఎరుపు కాంతికి తరంగదైర్ఘ్యం ఎక్కువ కాబట్టి భూమి వాతావరణాన్ని దాటి చంద్రుడిని తాకుతుంది. అందుకే, చంద్రుడు నెత్తురు మాదిరిగా ఎర్రటి వర్ణంలో కనిపిస్తాడు. దానిని బ్లడ్ మూన్ అని పిలుస్తారు.
Read Also- Financial Struggles: లక్షా 30 వేల జీతం చాలడం లేదంటున్న 26 ఏళ్ల యువకుడు.. ఖర్చులు ఏంటంటే
ఆదివారం రాత్రి 8:58 గంటలకు గ్రహణం ప్రారంభమవుతుంది. రాత్రి 11:00 గంటలకు బ్లడ్ మూన్ దశ ప్రారంభవుతుంది. సోమవారంలోకి ప్రవేశించిన 22 నిమిషాల వరకు, అంటే 12.22 గంటల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ముగుస్తుంది. ఇక, గ్రహణ ప్రభావం 2.25 గంటలకు పూర్తిగా వీడిపోతుంది. ఇలాంటి అరుదైన ఘట్టాలను బయటకు వచ్చి, సహజసిద్ధంగా వీక్షించడం మర్చిపోలేని అనుభూతి అనుభూతి కలిగిస్తుందని ఔత్సాహికులు చెబుతున్నారు.