Rapido: యువతిపై రాపిడో బైక్ డ్రైవర్ దాడి చేశాడు.. చెంప దెబ్బ కొట్టడంతో ఒక్కసారిగా ఆ యువతి నేలపై పడిపోయింది. ర్యాష్ డ్రైవింగ్ కారణంగా డ్రైవర్‌తో (Rapido Driver) యువతి గొడవకు దిగింది. దీంతో బైక్ దిగిన యువతి.. డబ్బులు చెల్లించేందుకు నిరాకరించింది. ఆగ్రహంతో ఊగిపోయిన ఆ డ్రైవర్.. మహిళ అని కూడా చూడకుండా యువతిపై దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనను చుట్టుపక్కలున్న స్థానికులంతా ఏమాత్రం అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. అంతమంది మగవాళ్లు ఉన్నా కళ్లు అప్పగించి చూస్తూ.. ఇంకొందరూ వీడియోలు చూస్తున్నారే తప్ప కనీసం అడ్డుకోకపోవడం గమనార్హం. ఈ ఘటన బెంగళూరులోని జయనగర్‌లో చోటుచేసుకున్నది. పూర్తి వివరాల్లోకెళితే.. బెంగళూరులో (Bengaluru) రాపిడో డ్రైవర్లపై మహిళలపై దాడులు, అసభ్యకర ప్రవర్తనకు సంబంధించిన పలు సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువే చోటుచేసుకున్న సందర్భాలు చూశాం. కానీ, ఇప్పుడు అందుకు భిన్నంగా ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఎందుకిలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నావ్..? జరగకూడనిది జరిగితే ఎవరికి బాధ్యులు ఎవరు? అని ఆ డ్రైవర్‌ను ప్రశ్నించడమే ఆ యువతి చేసిన తప్పు. ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతున్నది. కాగా, ఈ ఘటన రెండ్రోజుల కిందట జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై మొదట నాన్ కాగ్నిజబుల్ రిపోర్ట్ (NCR) గా నమోదు చేయబడినప్పటికీ, వీడియో బయటపడటంతో దాన్ని ఎఫ్‌ఐఆర్‌గా మార్చే అవకాశం ఉంది. దీనిపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు కురిపిస్తున్నారు.
Read Also- Viral Video: కోతి చేష్టలు అనేది ఊరికే కాదబ్బా.. ఇందుకేనేమో!
ర్యాపిడో డ్రైవర్లు.. దారుణాలు
ఈ మధ్య ర్యాపిడో డ్రైవర్లు చేస్తున్న దారుణాలు పెరిగిపోతున్నాయి. గత నాలుగైదేళ్లుగా జరిగిన దారుణ ఘటనలు ఇప్పుడు ఓ లుక్కేద్దాం. నవంబర్ 2022న కేరళ యువతి రాపిడో బైక్ బుక్ చేసుకోగా, డ్రైవర్ ఆమెను చెప్పిన ప్రదేశానికి కాకుండా వేరే చోటికి తీసుకెళ్లి, తన స్నేహితుడితో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. జులై 2023న రాపిడో డ్రైవర్ బైక్‌పై వెళ్తుండగా హస్తప్రయోగానికి పాల్పడి, ఆ తర్వాత మహిళను అసభ్యకర సందేశాలతో వేధించాడు. ఏప్రిల్ 2023లో యువతిని డ్రైవర్ వేరే మార్గంలో తీసుకెళ్తుండగా, ఆమె వేధింపుల నుంచి తప్పించుకోవడానికి కదులుతున్న బైక్‌పై నుంచి దూకేసింది. ఆగస్టు 2024లో లిఫ్ట్ ఇస్తానని చెప్పి ర్యాపిడో డ్రైవర్.. యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన అస్సాంలో చోటుచేసుకున్నది. ఉపాధి కోసం గౌహతికి వచ్చిన యువతి ఉద్యోగం కోసం మాలిగావ్‌లో ప్రయత్నిస్తుండగా.. ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఫకీర్‌ఖాన్ ఆమె దగ్గరకు వెళ్లి లిఫ్ట్ ఇస్తానని, ఉద్యోగం ఇప్పించడంలో సాయం చేస్తానని నమ్మబలికాడు. అనంతరం ఆమెను కామాఖ్య రైల్వేస్టేషన్ దగ్గరలోని నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఇంటర్‌స్టేట్ బస్ టెర్మినల్ వద్ద వదిలిపెట్టి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.
Read Also- Viral Video: 56 ఏళ్ల తర్వాత పుట్టిన ఆడబిడ్డ.. ఈ రాయల్ వెల్కమ్ చూస్తే మైండ్ పోతుందంతే..!
ఎందుకిలా.. ఏం చేయాలి?
ఇలాంటి ఘటనలను అరికట్టాలంటే ర్యాపిడో పలు కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నది. రాపిడో.. బైక్, టాక్సీ డ్రైవర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు తనిఖీలు, బ్యాగ్రౌండ్ పట్ల పారదర్శకత లేకపోవడమే ఈ ఘటనలకు ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. డ్రైవర్ల పూర్తి వివరాలు, వారి నేర చరిత్ర (ఏదైనా ఉంటే) తనిఖీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. యాప్‌లలో ఎస్‌వోఎస్ (SOS) బటన్లు, లైవ్ లొకేషన్ షేరింగ్ వంటి ఫీచర్లు ఉన్నప్పటికీ, అత్యవసర పరిస్థితుల్లో అవి ఎంతవరకు ఉపయోగపడతాయి అనే దానిపైనా పలు సందేహాలు ఉన్నాయి. బైక్ టాక్సీ సేవలకు సంబంధించి స్పష్టమైన నియంత్రణ ఫ్రేమ్ వర్క్ లేకపోవడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయని వినియోగదారులు చెబుతున్నారు. ముఖ్యంగా.. కర్ణాటకలో బైక్ టాక్సీ సేవలను నియంత్రించే చట్టపరమైన ఫ్రేమ్ వర్క్‌ను ఏర్పాటు చేసే వరకు వాటిని నిషేధించాలని హైకోర్టు తీర్పు కూడా ఇచ్చిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. కొందరు డ్రైవర్లు.. ప్రయాణీకులతో అనుచితంగా ప్రవర్తించడం, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వంటివి మహిళల భద్రతను ప్రమాదంలో పడేస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ సంఘటనలు బెంగళూరులో బైక్ టాక్సీల ద్వారా ప్రయాణించే మహిళల భద్రతపై తీవ్ర ఆందోళనను పెంచుతున్నాయి. రాపిడో వంటి సంస్థలు తమ డ్రైవర్ల నేపథ్య తనిఖీలను కఠినతరం చేయాలని, ప్రయాణీకుల భద్రతకు మరిన్ని చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు సర్వత్రా వస్తున్నాయి. పోలీసులు కూడా ఇలాంటి కేసులను సీరియస్‌గా తీసుకుని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.
Read Also- Air India: ఢిల్లీ వస్తున్న విమానంలో లోపం.. టెన్షన్ టెన్షన్
వీడియో ఇక్కడ చూడొచ్చు..
బెంగళూరులో యువతిపై రాపిడో డ్రైవర్ దాడి
చెంప దెబ్బ కొట్టడంతో నేలపై పడిపోయిన యువతి
రాపిడో బైకును బుక్ చేసుకున్న ఓ యువతి
ర్యాష్ డ్రైవింగ్ కారణంగా డ్రైవర్‌తో గొడవకు దిగిన యువతి
బైక్ దిగిన అనంతరం డబ్బులు చెల్లించేందుకు నిరాకరించడంతో యువతిపై దాడికి దిగిన డ్రైవర్ https://t.co/dXC0imqXov pic.twitter.com/l9NCDqrXuD
— Telugu Scribe (@TeluguScribe) June 16, 2025