Famous Temple: అంతా రామమయం అన్నట్టు రాముడి గుడి లేని గ్రామం ఉండదు. అలాగే, రామయ్య ఉన్న చోట హనుమంతుడు ఉండకుండా ఉండడు. చిరంజీవిగా భక్తులతో పూజలందుకునే హనుమయ్యకు విశిష్టమైన ఎన్నో ఆలయాలు ఉన్నాయి. వాటిలో ఒకటే పొన్నూరు వీరాంజనేయ స్వామి గుడి. ఈ ఆలయంలో విగ్రహం మొదలు ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. వెండితెర మెగాస్టార్ చిరంజీవి ఇదే ఆలయంలో చాలాకాలం ధ్యానం చేసి పూజలు చేశారు.
ఆలయం ఎక్కడ ఉన్నది.. ఎలా వెళ్లాలి?
గుంటూరు జిల్లాలోని మండలాల్లో పొన్నూరు ఒకటి. పూర్వం దీనిని స్వర్ణపురి(బంగారు భూమి) అని పిలిచేవాళ్లు. తమిళ రాజుల కాలంలో ‘పొన్ను ఊరు’గా పిలవబడింది. పొన్ను అంటే బంగారం అని అర్థం. కాలక్రమంలో అదే పొన్నూరుగా మారింది. ఇది గుంటూరు నుంచి 31 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 55 నిమిషాల్లో చేరుకోవచ్చు. అమరావతి ప్రాంతానికి 68 కిలోమీటర్ల దూరం. ఆలయానికి చేరుకోవాలంటే గుంటూరు నుంచి చీరాల వెళ్లే రోడ్డు మార్గంలో వెళ్లాలి. ముందుగా సిటీ నుంచి బయటకు వచ్చాక నేషనల్ హైవే 45 వస్తుంది. దాన్ని దాటి ముందుకు వెళ్తే బుడంపాడు తర్వాత నారాకోడూరు గ్రామాలు వస్తాయి. నారాకోడూరు నుంచి కుడివైపు వెళ్లాలి. తర్వాత 5 కిలోమీటర్ల దూరంలో చేబ్రోలు మండలం వస్తుంది. దాన్ని దాటి ముందుకు వెళ్లాక మంచాల, వెల్లలూరు, మునిపల్లె, తాటిపర్రు గ్రామాలు వస్తాయి. చుట్టూ పచ్చని పొలాల మధ్య రోడ్డుమార్గం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇంకా ముందుకు వెళ్లాక కట్టెంపూడి గ్రామం వస్తుంది. దాన్ని దాటి 3 కిలోమీటర్లు ముందుకు వెళ్తే పొన్నూరు వచ్చేస్తుంది. పట్టణంలోకి ఎంటర్ అయిన కొద్ది దూరంలోనే మెయిన్ రోడ్డుకు ఆనుకుని భారీ గోపురాలతో వీరాంజనేయ స్వామి ఆలయం ఉంటుంది.
ఆలయ ప్రత్యేకతలు ఎన్నో..
ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ గుడికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 24 అడుగుల ఏకశిలా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తిలకించేందుకు భక్తులు నిత్యం భారీగా తరలివస్తుంటారు. 1940లో తయారు చేసిన ఈ ఏకశిలా విగ్రహాన్ని పొన్నూరు తీసుకురావడానికి పదేళ్లు పట్టింది. 1950లో పట్టణానికి తీసుకువచ్చారు. కానీ, ప్రతిష్ఠించేందుకు ఆనాటికి అవసరమైన ద్రవ్యం లేకపోవడంతో 1969 దాకా బయటే బల్లపైనే ఉంచారు. అదే ఏడాది ప్రతిష్ఠ జరిగింది. అప్పటి నుంచి భక్తుల కోర్కెలు తీర్చే హనుమయ్యగా ప్రసిద్ధిచెందాడు. స్వామివారికి నిత్యం మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్లి పూజారులు పూజలు చేస్తుంటారు. భక్తులు విగ్రహం ముందు నిలబడి పూజిస్తారు.
Read Also- Samantha and Raj Nidimoru: సమంత రెండో పెళ్లి ఫిక్స్? రాజ్ నిడిమోరు భార్య పెట్టిన పోస్ట్ తో కన్ఫర్మ్?
తమలపాకుల పూజ విశిష్టత
అశోకవనంలో ఉన్న సీతమ్మ జాడ తెలుసుకునేందుకు వెళ్లిన హనుమంతుడు తిరిగి రాముడి దగ్గరకు వస్తాడు. ఆ సమయంలో ఆగ్రహంతో ఉన్న అంజనీపుత్రుడిని చూసిన రాముడు తమలపాకుల దండతో సత్కరించి శాంతింపజేశాడు. అలా ఆంజేనేయుడికి తమలపాకుల పూజ చేస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. తమలపాకులను నాగవల్లీ దళాలు అని కూడా అంటారు. వీటితో పూజించడం వల్ల నాగదోష శాంతి కూడా జరుగుతుందని భావిస్తారు. అదీగాక పొన్నూరులో ఉన్న స్వామి వీరాంజనేయుడు. అందుకే, ఆయన్ను శాంతింపజేసేందుకు తమలపాకులతో పూజలు చేస్తారు. అలాగే, తులసీదళాలతోనూ ముక్కులు చెల్లించుకుంటూ ఉంటారు.
ఆరు ఉప ఆలయాలు
వీరాంజనేయ స్వామి గుడి ప్రాంగణంలోనే ఆరు ఉప ఆలయాలు ఉన్నాయి. సహస్ర లింగేశ్వర స్వామి ఆలయం, దశావతారాల విష్ణుమూర్తి, కాలభైరవుడు, స్వర్ణ వేంకటేశ్వర స్వామి, గరుత్మంతుడి గుడి కనిపిస్తాయి. హనుమంతుడిని చూసేందుకు వచ్చిన భక్తులు ఈ ఆలయాలను కూడా దర్శించుకుని తరిస్తుంటారు. ఆంజనేయుడి ఆలయంలో 11 ప్రదక్షిణలు చేస్తే తమ కోర్కెలు నెరవేరతాయని భక్తులు నమ్ముతారు. అలా నిజంగా జరిగిన వారు ఇక్కడకు మళ్లీ వచ్చి 108 ప్రదక్షిణలు చేస్తుంటారు. భక్తుల కోర్కెలు తీర్చే ఈ పవన సుతుడిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు కూడా వస్తుంటారు.
మెగాస్టార్ చిరంజీవి పూజలు
మెగాస్టార్ చిరంజీవికి పొన్నూరు ఆంజనేయ స్వామి ఆలయానికి విడదీయరాని అనుబంధం ఉన్నది. ఆయన తండ్రి కానిస్టేబుల్ కావడంతో తరచూ ఏదో ఒక ప్రాంతానికి బదిలీ అవుతూ ఉండేది. అలా చిరు బాల్యంలో నిడదవోలు, బాపట్ల, పొన్నూరు, గురజాల, మంగళగిరి ప్రాంతాల్లో చదువుకున్నారు. చిన్నప్పటి నుంచి మెగాస్టార్ ఆంజనేయుడి భక్తుడు. అలా పొన్నూరులో ఉన్న సమయంలో నిత్యం ఆంజయనేయ స్వామి ఆలయానికి వెళ్లి ధ్యానం చేసేవారు. హనుమాన్ మనకు ఆశీస్సులు అందిస్తే జీవితాంతం వదలడని చిరంజీవి తరచూ చెబుతుంటారు. ఇక, పొన్నూరు ఆంజనేయ స్వామి ఆలయంలో సినిమా షూటింగులు కూడా జరుగుతుంటాయి. 1999 నవంబర్ 26 విడుదలైన శ్రీహరి చిత్రం ‘సాంబయ్య’లో భద్రాద్రి రామయ్య పాటను ఇక్కడే చిత్రీకరించారు. ఇందులో 24 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని, ఇతర ఆలయాలను కూడా చూపించారు.
Read Also- Peddi: ‘పెద్ది’లో రామ్ బుజ్జిగా ‘మీర్జాపూర్’ నటుడు.. ఫస్ట్ లుక్ చూశారా?