Case against RCB: బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియం వద్ద బుధవారం జరిగిన తొక్కిసలాటలో (RCB Stampede) 11 మంది ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటనపై దర్యాప్తు మొదలైంది. ఐపీఎల్-2025 ట్రోఫీని (IPL 2025) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గెలిచిన సందర్భంగా, ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమం నిర్వహణలో నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించిన ఆర్సీబీ (RCB) ఫ్రాంచైజీ , కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (KSCA), డీఎన్ఏ ఎంటర్‌టైన్‌మెంట్స్ (DNA Network), పలు ఇతర సంస్థలపై బెంగళూరు నగర పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. కబ్బన్ పార్క్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. సెంట్రల్ డిప్యూటీ కమిషనర్ శేఖర్ హెచ్ టెక్కన్నవర్ కేసును ధృవీకరించారు. తొక్కిసలాట ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేశామని, నేరపూరిత నిర్లక్ష్యం కింద పలు సంస్థలను నిందితులుగా చేర్చామని ఆయన వివరించారు.
Read this- Manchu Vishnu: మంచు విష్ణు ఫోన్‌లో హాట్ లేడీ ఫోన్ నంబర్.. ఎవరో తెలిస్తే?
సెక్షన్లు ఇవే
భారతీయ న్యాయ సంహితలోని (BNS) వివిధ సెక్షన్ల కింద ఫిర్యాదులు కూడా అందాయని పోలీసు అధికారులు వెల్లడించారు. బీఎన్ఎస్‌లోని సెక్షన్ 105 (హత్యకు సమానం కాని నేరపూరిత ప్రాణనష్టం), సెక్షన్ 125(12) (ఇతరుల ప్రాణాలు లేదా వ్యక్తిగత భద్రతకు ముప్పు కలిగించే చర్యలు), సెక్షన్ 142 (చట్టవిరుద్ధంగా గుమిగూడడం), సెక్షన్ 121 (నేరాన్ని ప్రేరేపించడం), సెక్షన్ 190 వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని సెంట్రల్ డిప్యూటీ కమిషనర్ శేఖర్ వివరించారు. కాగా, ఉద్యోగులకు సెలవు రోజైన ఆదివారం నాడు ఐపీఎల్ విజయోత్సవం, సన్మాన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసులు సూచించినా పెడచెవిన పెట్టినట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారమైతే ట్రాఫిక్ నియంత్రణ, తగిన ఏర్పాట్లు చేసేందుకు అవకాశం ఉంటుందని పోలీసులు కోరినట్టు సమాచారం. జూన్ 3న రాత్రి ఆర్సీబీ టైటిల్ గెలవడంతో అభిమానుల సంబరాల మునిగిపోయారని, రోడ్లపై రద్దీని నియంత్రించేందుకు, మరుసటి రోజు (జూన్ 4) ఉదయం 4 గంటల వరకు పోలీసులు విధుల్లోనే కొనసాగాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మరుసటి రోజే విజయోత్సవాన్ని నిర్వహించాలని ప్రభుత్వం పట్టుబట్టినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Read this- Nagma: నగ్మా పెళ్లి ఎందుకు చేసుకోలేదు.. ఆమె లైఫ్‌లోని షాకింగ్ విషయాలు!
పోలీసు కమిషనర్ సస్పెండ్: సీఎం ఆదేశాలు
తొక్కిసలాట ఘటనపై విపక్ష బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో, కీలకమైన పోలీసు అధికారులను కర్ణాటక ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పోలీసు కమిషనర్, డిప్యూటీ పోలీసు కమిషనర్‌లను సస్పెండ్ చేయాలంటూ సీఎం సిద్ధరామయ్య ఆదేశాలు జారీ చేశారు. తదుపరి చర్యలు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), కర్ణాటక క్రికెట్ అసోసియేషన్‌పై ఉంటాయని ఆయన మీడియా ముఖంగా స్పష్టం చేశారు. రాష్ట్ర క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ తొక్కిసలాట దర్యాప్తు బాధ్యతలు చేపడుతుందని ఆయన ప్రకటించారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ మైఖేల్ కున్హా ఏకసభ్య కమిషన్ పర్యవేక్షలో దర్యాప్తు జరుగుతుందని ఇప్పటికే సిద్ధరామయ్య ప్రకటించారు. కాగా, 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆర్సీబీ జట్టు ఐపీఎల్ 2025 ట్రోఫీని ముద్దాడింది. ఈ సందర్భంగా చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ప్లేయర్లకు బుధవారం సన్మానం కార్యక్రమం తలపెట్టగా, అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో, స్టేడియం వద్ద భారీ తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ఏకంగా 11 మంది ప్రాణాలు కోల్పోగా, 47 మంది గాయపడ్డారు.