NASA: ఖగోళ దృగ్విషయాలంటే నిజంగా అద్భుతాల కొత్త ప్రపంచమే. ఎన్నో మిస్టరీలు, మరెన్నో రహస్యాలు. అంతులేని ఈ విశ్వంలో ప్రతి ఒక్కటీ ఎంతో అబ్బురపరిచే నిగూఢ అంశమే. వీటిని గుర్తించేందుకు ఖగోళ శాస్త్రవేత్తలు నిత్యం పరిశోధనలు, ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయత్నాల్లో భాగంగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఫండింగ్‌తో చిలీలోని రియో హుర్టాడో ప్రాంతంలో ఏర్పాటు చేసిన అట్లాస్ (Asteroid Terrestrial-impact Last Alert System) టెలిస్కోప్ కొత్త విషయాన్ని గుర్తించింది. మన సౌరవ్యవస్థలోకి ప్రవేశించిన ఒక కొత్త తోకచుక్కను (Comet) గుర్తించింది. ఈ తోకచుక్క విశ్వాంతరాలలోని వేరే నక్షత్రాల నుంచి సౌరవ్యవస్థలోకి వచ్చి ఉండొచ్చని ఖగోళ నిపుణులు చెబుతున్నారు.
జూలై 1న అట్టాస్ టెలిస్కోప్ దీనిని తొలిసారి గమనించింది. ఈ తోకచుక్కకు ‘3I/ATLAS’ అని శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. ఈ తోకచుక్క ప్రస్తుతం భూమికి సుమారుగా 420 మిలియన్ మైళ్ల దూరంలో ఉన్నట్టు గుర్తించారు. ధనుస్సు నక్షత్రరాశి (Sagittarius) దిశ నుంచి ఈ తోకచుక్క వస్తున్నట్టుగా తేల్చారు.
Read Also- Saif Ali Khan: కీలక పరిణామం.. సైఫ్ అలీఖాన్ వారసత్వ ఆస్తులన్నీ ప్రభుత్వ ఆధీనంలోకే!
తోకచుక్క గుర్తించిన వెంటనే శాస్త్రవేత్తలు దాని గమనాన్ని ట్రాక్ చేసే ప్రయత్నం చేశారు. గత రికార్డులను పరిశీలించగా, జూన్ 14న తీసిన ఫొటోల్లో ఇది కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూడు అట్లాస్ టెలిస్కోపులు, కాలిఫోర్నియాలోని పాలోమార్ ఆబ్జర్వేటరీలో ఉన్న ‘జ్వికీ ట్రాన్సియెంట్ ఫెసిలిటీ’ ద్వారా ఈ ఫొటోలను తీశారు.
ఈ తోకచుక్కతో భూమికి ఎలాంటి ప్రమాదమూ ఉండదని ఖగోళశాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమికి కనీసం 1.6 ఆస్ట్రానామికల్ యూనిట్లు (AU), అంటే దగ్గరదగ్గరగా 240 మిలియన్ కిలోమీటర్లు దూరం నుంచి వెళుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం సూర్యుడికి దాదాపు 4.5 ఏయూ (సుమారు 670 మిలియన్ కిలోమీటర్లు) దూరంలో ఉన్నట్టు నిర్ధారించారు. అక్టోబర్ 30న ఈ తోకచుక్క సూర్యుడికి అత్యంత సమీపానికి వస్తుంది. అప్పుడు సూర్యుడి నుంచి దూరం సుమారు 1.4 ఏయూగా ఉంటుంది. ఈ దూరం అంగారక గ్రహం కక్ష్య పరిధిలో ఉంటుందని శాస్త్రవేత్తలు వివివరించారు.
Read Also- Shubman Gill: చరిత్ర తిరగరాసిన గిల్.. 148 ఏళ్ల చరిత్రలో తొలిసారి
కాగా, ఈ తోకచుక్క పరిమాణం, భౌతిక లక్షణాల గుర్తించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖగోళ శాస్త్రవేత్తలు అధ్యయనం మొదలుపెట్టారు. సెప్టెంబర్ నెల వరకు భూమిపై ఉన్న టెలిస్కోపుల ద్వారా దీనిని చూడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ తర్వాత క్రమంగా సూర్యుడి వైపు పయనించనుండడంతో కనిపించదని చెబుతున్నారు. ఆ తర్వాత, డిసెంబర్ మొదటి వారంలో సూర్యుడికి ఒక నుంచి ఈ తోకచుక్క మళ్లీ కనిపించే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా శాస్త్రవేత్తలు దీనిని మరింత శ్రద్ధగా పరిశీలించనున్నారు. అంతరిక్ష అధ్యయనాల్లో తోకచుక్కలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. విశ్వం చరిత్రను తెలియజేయడానికి ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.