Chicken Dosa Video: దక్షిణాదిలో దోశకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. టిఫిన్ గా దోశను తినేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తుంటారు. అందుకు తగ్గట్లే చాలా రకాల ఫ్లేవర్స్ తో దోశలు అందుబాటులో ఉన్నాయి. కారం, ఉల్లి, నెయ్యి, ఉప్మా, మసాలా ఇలా చాలా రకాల వెరైటీ దోశలు బయట దొరుకుతూనే ఉంటాయి. అయితే వీటికి భిన్నంగా నాన్ వెజ్ దోశ అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది చూసిన నెటిజన్లు రెండు వర్గాలు విడిపోయి.. దానిపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
వీడియోలో ఏముందంటే?
ఇన్ స్టాగ్రామ్ లో ‘ది గ్రేట్ ఇండియన్ ఫుడీ’ (@thegreatindianfoodie) ఖాతా నుంచి షేర్ చేయబడ్డ వీడియోలో ఓ స్ట్రీట్ ఫుడ్ వెండర్.. చికెన్ దోశ వేస్తూ కనిపించాడు. రొటీన్ కు భిన్నంగా వివిధ రకాల మిశ్రమాలను దోశపై చల్లాడు. ముందుగా బకెట్ లోని పిండిని తీసుకొని దానిని పెనంపై వేయడాన్ని వీడియోలో గమనించవచ్చు. అనంతరం దానిపై మసాలాతో ఉన్న చికెన్ ముక్కలను వేశాడు. దానిని దోశ అంత అట్ల కాడతో వ్యాపించేలా చేశాడు. ఆపై దోశపై సాంబార్ పోశాడు. కొద్దిసేపటి తర్వాత దోశను వెనక్కి తిప్పి రెండు వైపులా కాలేలా చేశాడు. దోశ రెడీ అయిన తర్వాత దానిని ప్లేటులో వేశాడు. ఈ వీడియో పోస్ట్ చేసిన క్షణాల్లోనే నెట్టింట వైరల్ గా మారింది.
View this post on Instagram
Also Read: Viral Video: ఏనుగులనే హడలెత్తించిన.. డాడీ లిటిల్ ప్రిన్సెస్.. మీకో దండం తల్లి!
నెటిజన్ల రియాక్షన్లు
రొటిన్ కు భిన్నంగా ఉన్న ఈ చికెన్ దోశను చూసి నెటిజన్లు తమదైన శైలిలో సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. ‘ఇది దోసె లా కనిపించడం లేదు. దీని కి వేరే పేరు పెట్టకూడదా?’ అని ఒక యూజర్ కామెంట్ చేశాడు. ‘ఈ దోశ తిన్నవెంటనే కడుపు నొప్పి రావడం పక్కా’ అని మరొకరు రాసుకొచ్చారు. ‘ఇది హైజీనిక్ ఫుడ్‌లో బెస్ట్’ అని ఇంకొకరు అభిప్రాయపడ్డారు. ‘అసలైన దోసెని తినండి. ఇలాంటి వాటిని ప్రోత్సహించవద్దు’ అని మరొకరు పిలుపునిచ్చారు. అయితే ఇది చూడటానికి దోశలా లేదని.. చికెన్ ఆమ్లెట్ లా ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. తన లాంటి దోశ లవర్స్ కు ఈ వీడియో పీడకలలా ఉందంటూ ఓ నెటిజన్ పోస్ట్ పెట్టాడు. మెుత్తంగా ఈ దోశ సోషల్ మీడియాలో కొత్త చర్చకు దారి తీసిందని చెప్పవచ్చు.