Mohammed Siraj: ఆతిథ్య ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానం వేదికగా జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) సత్తా చాటుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఏకంగా ఆరు వికెట్లు తీసి విమర్శకుల నోళ్లు మూయించాడు. హైదరాబాదీ చేసిన ఈ అద్భుత ప్రదర్శన కారణంగానే తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌పై టీమిండియా ఆధిక్యాన్ని సాధించడానికి దోహదపడింది. నిజానికి, తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఆడిన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోవడంతో భారత పేస్ బౌలింగ్ దళాన్ని సిరాజ్ నడిపించగలడా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే, అందరి సందేహాలను సిరాజ్ పటాపంచెలు చేశాడు. శభాష్ అనిపించుకున్నాడు.
Read Also- India US Trade Deal: ట్రంప్ టెంపరితనం.. చావుదెబ్బ కొట్టేందుకు సిద్ధమైన భారత్.. ఎలాగంటే?
బాధ్యతలను ఇష్టపడతా..
రెండవ టెస్ట్ మ్యాచ్ మూడవ రోజు ఆట ముగిసిన తర్వాత సిరాజ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. జీవితంలో అనేక సవాళ్లను చవిచూసిన తాను బాధ్యతలను ఇష్టపడతానని పేర్కొన్నాడు. ‘‘బాధ్యత అంటే నాకు ఇష్టం. కారణం ఏంటంటే జీవితంలో నేను చాలా అవరోధాలు చూశాను. సవాళ్లతో సావాసం చేసే ఈ స్థాయికి వచ్చాను. అందుకే, నాకు సవాళ్లు అంటే ఇష్టం. బాధ్యత నా దగ్గరకు వస్తే ఆ విషయాన్ని చాలా శ్రద్ధగా తీసుకుంటాను. అందుకే, బాధ్యత నా వద్దకు రావడం నాకు ఇష్టం’’ అని సిరాజ్ వ్యాఖ్యానించాడు.
Read Also- Amarnath Yatra buses collide: అమర్‌నాథ్ యాత్రలో షాకింగ్ ఘటన.. భక్తులకు గాయాలు.. ఏమైందంటే?
యువ పేసర్లపై ఏమన్నాడంటే..
యువ పేసర్లు ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ వంటి జట్టులోని ఇతర యువ పేసర్లపై మహ్మద్ సిరాజ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. “ఆకాశ్ దీప్ అతడి కెరియర్‌లో ఇది 3వ లేదా 4వ టెస్ట్ మ్యాచ్ మాత్రమే. ప్రసిద్ కృష్ణ కూడా దాదాపు ఇంతే. నేను టీమిండియా తరపున 38 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాను. స్థిరంగా లైన్ అండ్ లెంగ్త్ బంతులు సంధిస్తూ బౌలింగ్ చేయడమే నా ఏకైక లక్ష్యం. మన బ్యాటర్లు దాదాపు 600 పరుగులు సాధించారు. కాబట్టి, చక్కగా లైన్ అండ్ లెంగ్త్ బంతులు ప్రయత్నించాలని అనుకున్నాను. అయితే, వీలు కుదిరినప్పుడల్లా వికెట్లు తీయడమే నా ఏకైక లక్ష్యం. ప్రత్యర్థి ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగితే మనకు చాలా అనుకూలంగా ఉంటుంది’’ అని సిరాజ్ చెప్పాడు. ఈ మేరకు టెస్ట్ మ్యాచ్ 3వ రోజు ఆట ముగిశాక మాట్లాడాడు.
4వ రోజు ఏం జరగనుంది?ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్‌లో నాలుగవ రోజైన శనివారం ఆట చాలా కీలకం కానుంది. భారత్ రెండవ ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించడంతో ఆట ఎటువైపు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే భారతదేశం తమ ఆధిక్యాన్ని పెంచుకుని ఇంగ్లాండ్‌ను ఆట నుండి బయటకు తీసుకురావాలని చూస్తుంది. మూడవ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఇప్పటికే 244 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇక, మూడవ రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండవ ఇన్నింగ్స్ స్కోరు 64/1గా ఉంది. క్రీజులో కేఎల్ రాహుల్ 28 (బ్యాటింగ్), కరుణ్ నాయర్ (బ్యాటింగ్) ఉన్నాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ 28 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద టంగ్ బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు.