India US Trade Deal: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ (Donald Trump) బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ప్రతీకార పన్నుల పేర్లతో దుందుడుకుగా వ్యవహరిస్తున్నారు. మిత్ర దేశమైన భారత్ ను సైతం అధిక ట్యాక్స్ విధిస్తూ సమస్యల్లోకి నెడుతున్నారు. ఈ క్రమంలో భారత్ నుంచి అమెరికా (America) లోకి దిగుమతి అయ్యే వాహనాలపై సుంకాన్ని 26% పెంచడాన్ని భారత్ లోని మోదీ (Prime Minister Narendra Modi) సర్కార్ సీరియస్ గా తీసుకుంది. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) నిబంధనల కింద అమెరికాపై ప్రతీకార సుంకాలు విధించేందుకు సిద్ధమైంది.
అసలేం జరిగిందంటే?
భారతదేశం నుండి దిగుమతి చేసుకునే ప్యాసింజర్ వాహనాలు, తేలికపాటి ట్రక్కులు, వాహనాల విడి భాగాలపై 26% సుంకాన్ని విధించనున్నట్లు మార్చి 26, 2025న అమెరికాలోని ట్రంప్ సర్కార్ ప్రకటించింది. సాధారణంగా ఏదైనా దేశం అకస్మాత్తుగా లేదా సుదీర్ఘ కాలానికి పన్ను పెంచాల్సి వచ్చినప్పుడు నిబంధనల ప్రకారం ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO)కి నివేదించాల్సి ఉంటుంది. అయితే ట్రంప్ సర్కార్ అలా చేయలేదు. దీంతో అమెరికా తన చర్యలతో WTO నిబంధనలను ఉల్లంఘించిందని భారత్ ఆరోపించింది. జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ అండ్ టారిఫ్స్ (GATT) 1994, సేఫ్‌గార్డ్స్‌పై అగ్రిమెంట్‌ను అతి క్రమించిందని WTOకు ఫిర్యాదు చేసింది.
భారత్ ప్రతిపాదన
అమెరికా విధించిన 26 శాతం సుంకం.. భారత్ నుంచి వెళ్లే 2.89 బిలియన్ డాలర్ల ఎగుమతులను ప్రభావితం చేయనుంది. సుంకాల పెంపు ద్వారా అమెరికాకు ఏడాదికి 723.75 మిలియన్ డాలర్లు అదనంగా లభించనున్నట్లు భారత్ అంచనా వేసింది. దీంతో తమకు జరిగే నష్టాన్ని అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై సుంకాలు పెంచడం ద్వారా భర్తీ చేసుకోవాలని భావిస్తున్నట్లు WTOకు భారత్ తెలిపింది. అధిక సుంకాల నుంచి తమను తాము కాపాడుకునే క్రమంలో సుంకాల రేట్లలో సర్దుబాటు చేసే హక్కులను భారత్ కలిగి ఉందని డబ్ల్యూటీవోకు స్పష్టం చేసింది. అమెరికా నుంచి దిగుమతయ్యే ఉక్కు, అల్యూమినియంపై అమెరికా టారిఫ్ లకు స్పందనగా ప్రతీకార సుంకాలు విధించే హక్కు తమకు ఉందని WTOకు భారత్ సమాచారం ఇచ్చింది.
గతంలోనూ భారత్ చర్యలు!
అమెరికాపై ప్రతీకార సుంకాలను ప్రతిపాదించడం భారత్ కు ఇదే తొలిసారి కాదు. గతంలోనూ అమెరికాపై భారత్ ప్రతీకార సుంకాలు విధించింది. 2018లో భారత్ నుంచి ఎగుమతయ్యే స్టీల్‌పై 25%, అల్యూమినియంపై 10% సుంకాలను అమెరికా విధించినప్పుడు.. సరైన రీతిలో భారత్ కౌంటర్ ఇచ్చింది. అమెరికా నుంచి దిగుమతయ్యే బాదం, ఆపిల్స్, లెంటిల్స్, వాల్ నట్స్ తదితర 21 ఉత్పత్తులపై ప్రతీకార పన్నులను విధించింది. తాజాగా ట్రంప్ సర్కార్ మరోమారు టారిఫ్స్ యుద్ధానికి తెరలేపడంతో భారత్ సైతం ప్రతీదాడి చేసేందుకు సిద్ధమవుతోంది.
Also Read: Fish Venkat Wife on Prabhas: ప్రభాస్ పైసా ఇవ్వలే.. అంతా ఫేక్ న్యూస్.. ఫిష్ వెంకట్ భార్య!
ట్రేడ్ డీల్ కుదిరేనా?
ప్రతీకార సుంకాలను ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. వాటి అమలుకు 90 రోజుల డెడ్ లైన్ విధించారు. అది జులై 9తో గడువు ముగియనుంది. అయిటే ట్రంప్ విధించిన ప్రతీకార చర్యల నేపథ్యంలో ట్రేడ్ డీల్ కుదుర్చుకునేందుకు భారత్ – అమెరికా ఉన్నతస్థాయిలో చర్చలు జరుపుతున్నాయి. అయితే కీలకమైన వ్యవసాయ, పాడి పరిశ్రమలకు సంబంధించిన అంశాల్లో ఇరు దేశాల మధ్య సఖ్యత కుదరడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికా కొన్నిరకాల గూడ్స్‌కు, ఆటోమొబైల్ రంగాలకు సంబంధించి డిస్కౌంట్లను కోరుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చర్చలు చివరి దశలో ఉండగా.. డబ్ల్యూటీఓ వద్దకు భారత్ వెళ్లడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ట్రేడ్ డీల్ కుదరదన్న సంకేతాల నేపథ్యంలోనే భారత్ అలా చేసిందా? అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.