Viral News: ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యం, వ్యవస్థల వైఫల్యానికి పరాకాష్ట లాంటి షాకింగ్ ఘటన ఒకటి మధ్యప్రదేశ్‌లో వెలుగుచూసింది. విదిష జిల్లాకు చెందిన ఒక పోలీసు కానిస్టేబుల్ 12 ఏళ్లుగా క్రియాశీలకంగా డ్యూటీ చేయకపోయినా ప్రతినెలా అతడి అకౌంట్‌లో జీతం జమవుతోంది. 12 ఏళ్ల వ్యవధిలో అక్షరాలా రూ.28 లక్షలు జీతంగా పొందాడు. 2011లో జరిగిన రిక్రూట్‌మెంట్‌లో నిందిత వ్యక్తి కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. తొలి పోస్టింగ్ భోపాల్ పోలీస్ లైన్స్‌లో ఇచ్చారు. చేరిన కొద్దికాలానికే ప్రాథమిక పోలీసు ట్రైనింగ్‌లో భాగంగా సాగర్ పోలీస్ శిక్షణ కేంద్రానికి పంపించారు. అతడి బ్యాచ్‌లో సెలక్ట్ అయిన ఇతర కానిస్టేబుల్స్ మాదిరిగానే పంపించారు. కానీ, నిందిత కానిస్టేబుల్ అక్కడికి వెళ్లి రిపోర్ట్ చేయలేదు. ఎవరికీ చెప్పకుండానే తన ఇంటికి వెళ్లిపోయాడు.
ఇంటికి వెళ్లిన విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయలేదు. కనీసం, సెలవు కూడా అడగలేదు. పైగా, తన సర్వీస్ రికార్డును స్పీడ్ పోస్ట్ ద్వారా భోపాల్ పోలీస్ లైన్స్‌కు పంపించాడు. భౌతికంగా వెళ్లకపోయినా, ట్రైనింగ్ తీసుకున్నట్టు ధృవీకరణ జరగకపోయినా పోస్టు ద్వారా అతడు పంపించిన పత్రాలను అధికారులు పరిగణనలోకి తీసుకొని ఆమోదముద్ర వేశారు. శిక్షణా కేంద్రంలో గైర్హాజరు అయినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. భోపాల్ పోలీస్ లైన్స్‌లో కూడా అధికారులు ఎవరూ ప్రశ్నించలేదు.
ఆ విధంగా నెలలు, సంవత్సరాలు గడిచినా ఆ కానిస్టేబుల్ విధులకు హాజరు కాలేదు. అయినప్పటికీ, అతడి పేరు రికార్డుల్లో భద్రంగా ఉంది. దీంతో, నెలవారీ జీతం తప్పకుండా అతడి అకౌంట్‌లో జమ అవుతూ వచ్చింది. మొత్తంగా పోలీస్ స్టేషన్ విధుల్లో, శిక్షణా కేంద్రంలో ఎక్కడా అడుగు పెట్టకుండానే సైలంట్‌గా రూ.28 లక్షలకు పైగా జీతాన్ని సంపాదించాడు. ఇంత జరిగినా అధికారులు ఎవరూ కానిస్టేబుల్ బాగోతాన్ని గుర్తించలేకపోయారు. డిపార్ట్‌మెంట్‌లోని ఎవరూ పేరుని, ముఖాన్ని గుర్తించలేదు. అంతర్గత పరిశీలనలో ఉన్నతాధికారులు కానిస్టేబుల్ గత రికార్డులు, సర్వీస్ రిటర్న్‌లను తెలుసుకునేందుకు ప్రయత్నించినప్పుడు అసలు విషయం బయటపడింది. అతడికి సంబంధించిన రికార్డులు ఏమీ దొరకలేదు.
Read Also- F-35B Jet: కేరళలో నిలిచిన బ్రిటన్ ఎఫ్-35బీ విషయంలో కీలక పరిణామం
ఏకంగా12 ఏళ్లు విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌కు ఒక్క కేసు కూడా అప్పగించకపోవడం, ఏ అధికారిక పనుల్లోనూ పాల్గొనకపోవడంపై అధికారులకు సందేహం వచ్చింది. చివరకు, సదరు కానిస్టేబుల్‌ను విచారణకు పిలిపించి ప్రశ్నించగా అసలు విషయాలు బయటపడ్డాయి. తాను మానసిక సమస్యలతో బాధపడుతున్నట్టు సదరు వ్యక్తి చెప్పాడని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP) అంకితా ఖతేర్కర్ వెల్లడించారు. తన పరిస్థితి కారణంగానే ఇన్నేళ్లు విధులకు హాజరుకాలేదంటూ, తన వాదనను బలపరిచేలా మెడికల్ ధ్రువీకరణ పత్రాలను కూడా సమర్పించాడని వివరించారు. ఈ విషయం తెలిసి మధ్యప్రదేశ్ సీనియర్ పోలీసు అధికారులు షాక్‌కు గురయ్యారు. ఈ అంశంపై దర్యాప్తును భోపాల్‌లోని టీటీ నగర్ ఏసీపీ ఖతేర్కర్‌కు అప్పగించారు.
కాగా, ‘‘ఆ కానిస్టేబుల్ 2011లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. నిజానికి తన బ్యాచ్‌లో మిగిలిన వారితో పాటు అతడిని శిక్షణకు పంపాల్సి ఉంది. అయితే, వ్యక్తిగత కారణాలను చూపి విడిగా వెళ్లేందుకు అనుమతించారు. మిగతావారంతా ట్రైనింగ్‌ను పూర్తి చేసుకుని తిరిగి వచ్చారు. కానీ, నిందిత కానిస్టేబుల్ ఇంతవరకూ రిపోర్ట్ చేయలేదు. ట్రైనింగ్ తీసుకొని తిరిగి రావాల్సింది ఒక్కడే కాబట్టి రిటర్న్ రికార్డును నమోదు చేయలేదు. ట్రైనింగ్ పూర్తి చేసుకోకపోయినా, డ్యూటీలో చేరకపోయినా కొత్తగా నియమితుడైన కానిస్టేబుల్‌గా అతడి పేరు పోలీసు రికార్డులలో కొనసాగింది. అందుకే, క్రమం తప్పకుండా జీతం జమ అయ్యింది. 12 సంవత్సరాల తర్వాత ‘పే గ్రేడ్’ పరిశీలనలో భాగంగా సమీక్షించినప్పుడు అసలు విషయం బయటపడింది’’ అని ఏసీపీ ఖతేర్కర్ తెలిపారు.
Read Also- NASA: సౌరవ్యవస్థలో వింత.. విశ్వంతరాల నుంచి ప్రవేశించిన కొత్త వస్తువు
పోలీసు డిపార్ట్‌మెంట్‌లో మారిన నిబంధనల గురించి తనకు తెలియదని నిందిత కానిస్టేబుల్ పేర్కొన్నాడు. అధికారులు, సహచరులు ఎవరితోనూ కమ్యూనికేషన్ లేకపోవడం, అనారోగ్య సమస్యల కారణంగా సమాచారం ఇవ్వలేదని చెప్పినట్టు అధికారులు పేర్కొన్నారు. నిందిత కానిస్టేబుల్ ఇప్పటివరకు రూ. 1.5 లక్షలు పోలీసు డిపార్ట్‌మెంట్‌కు తిరిగిచ్చాడని వివరించారు. మిగిలిన మొత్తాన్ని పీఎఫ్ అకౌంట్ ద్వారా చెల్లింపునకు అంగీకరించాడు. కాగా, ప్రస్తుతం భోపాల్ పోలీస్ లైన్స్‌లో ప్రస్తుతం అతడికి పోస్టింగ్ ఇచ్చారు. అతడిని పర్యవేక్షిస్తున్నట్టు ఖతేర్కర్ చెప్పారు. విచారణ ఇంకా కొనసాగుతోందని, మరికొందరు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేస్తామని అధికారులు తెలిపారు. బాధ్యతులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.