Viral Video: కర్ణాటకలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పులిని పట్టుకోవడంలో విఫలమైన ఫారెస్ట్ అధికారులను కొందరు గ్రామస్తులు బంధించారు. పులికి ఎరవేసే బోనులో 10 మంది అధికారులను పెట్టి బయట తాళం వేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. ఘటనకు పాల్పడ్డ గ్రామస్తులపై కేసులు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళ్తే..
చామరాజనగర్ జిల్లా గుండ్లుపేట తాలూకా బొమ్మలపుర గ్రామంలో గత కొన్ని రోజులుగా పులి సంచరిస్తోంది. పశువులను చంపి ఆపై సమీపంలోని అడవిలోకి పారిపోతోంది. అయితే ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారుల దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లారు. కానీ వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై గ్రామస్తులు అసహనానికి లోనయ్యారు. ఈ క్రమంలోనే మంగళవారం మరోమారు పులి కనిపించడంతో వారి కోపం కట్టలు తెచ్చుకుంది.
పులి బోనులో బంధించి..
దీంతో పులిని పట్టుకునేందుకు వచ్చిన 10మంది అటవీశాఖ అధికారులను గ్రామస్తులంతా కలిసి బంధించారు. పులిని పట్టుకోవడానికి పెట్టిన పంజరంలో వారందరినీ తోసి బయట తాళం వేశారు. కొన్ని గంటల పాటు అధికారులు లోపలే ఉండిపోవాల్సి వచ్చింది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవడంతో చివరికి వారిని విడిచి పెట్టారు. వన్యప్రాణి అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు అదనపు ఎస్పీ ఎం. ఎన్. శశిధర్ తెలిపారు.
పులికి ఎరగా ఫారెస్ట్ అధికారులు
కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా బొమ్మలపుర గ్రామంలో పులికి ఎరగా బోనులో అటవీ అధికారులను బంధించిన స్థానికులు. గత కొన్ని రోజులుగా పులి సంచరిస్తున్నా ఫారెస్ట్ అధికారులు బంధించకపోవడంతో స్థానికుల ఆగ్రహం. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో. pic.twitter.com/jOnokEHpgp
— ChotaNews App (@ChotaNewsApp) September 10, 2025
Also Read: YS Jagan: అట్టర్ ఫ్లాప్ సినిమాకు.. బలవంతపు విజయోత్సవాలా.. సూపర్ సిక్స్‌పై జగన్ సెటైర్లు
ఆఫీసును ముట్టడిస్తామని వార్నింగ్
ఇటీవల స్థానిక రైతు గంగప్ప తన పొలంలో పులిని గమనించాడు. ఆ తర్వాతి నుంచి పశువులు వరుసగా చనిపోవడం ప్రారంభమైంది. అయితే పశువులు చనిపోతున్నా ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించారని గ్రామస్తులు ఆరోపించారు. ‘మేము పలుమార్లు ఫిర్యాదు చేశాం. కానీ పులి కోసం ఎలాంటి కూంబింగ్ జరగలేదు. పంజరం ఒక్కటి పెట్టి ఊరుకుంటే సరిపోదు కదా’ అని ఒక రైతు అన్నారు. ఇకపై పులిని పట్టుకోకపోతే వన్యప్రాణి విభాగం కార్యాలయాన్ని ముట్టడిస్తామని రైతులు హెచ్చరించారు.
Also Read: CM Chandrababu: కొత్త పథకం ప్రకటించిన చంద్రబాబు.. దసరా నుంచే అమలు.. ఖాతాల్లోకి రూ.15 వేలు!
పులికి విషం పెట్టిన రైతు!
చామరాజనగర్ జిల్లా రెండు టైగర్ రిజర్వులు, ఒక వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి నిలయం. జనావాసాల్లోకి క్రూర మృగాలు వస్తున్న ఘటనలో గత కొంతకాలంగా పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది జూలైలో పులి.. తన పశువులను చంపడంతో ఓ రైతు విషం పెట్టాడు. దాంతో పులితో పాటు దాని నాలుగు పిల్లలు చనిపోయాయి. మహదేశ్వర హిల్స్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.