Viral Video: రీల్స్ పిచ్చి అనేది ప్రస్తుత డిజిటల్ యుగంలో రోజురోజుకూ ఎక్కువవుతోంది. ముఖ్యంగా యువతలో సోషల్ మీడియా (Social Media) ప్లాట్‌ఫామ్‌లైన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్ వీడియోలను సృష్టించడం, వాటిని పోస్ట్ చేయడం పట్ల విపరీతమైన ఆసక్తిని అంతకుమించిన కొన్నిసార్లు వ్యసనాన్ని సూచిస్తుంది. కొద్ది నిమిషాల వీడియోతో లక్షలాది మందికి చేరువ కావచ్చని, తద్వారా త్వరగా పాపులర్ కావచ్చని చాలా మంది భావిస్తున్నారు. ఆ వీడియోలకు వచ్చే లైక్స్, కామెంట్స్, షేర్స్ ఒక రకమైన సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తాయి. ఆ సంతోషంతో మరిన్ని ఎక్కువగా రీల్స్ చేయాలనే కోరికను పెంచుతోంది. ఇవన్నీ ఒకెత్తయితే కొంతమంది రీల్స్ ద్వారా ప్రకటనలు, స్పాన్సర్‌షిప్‌ల ద్వారా డబ్బు సంపాదించవచ్చని ఆశిస్తున్నారు. మరికొందరు తమ సృజనాత్మకతను, నృత్య నైపుణ్యాలను, హాస్యాన్ని లేదా విజ్ఞానాన్ని ప్రదర్శించడానికి రీల్స్‌ను ఇలా చూపిస్తున్నారు. ఎప్పటికప్పుడు మారుతున్న ట్రెండ్స్, ఛాలెంజ్‌లు రీల్స్ చేయడానికి యువత వెనుకాడట్లేదు. ఇతరులు చేసే రీల్స్‌ను చూసి, తామూ చేయాలనే కోరిక కలగడం ఇలా చిత్ర విచిత్రాలుగా చేస్తున్న పరిస్థితి. తాజాగా జరిగిన ఈ షాకింగ్ ఘటనను చూస్తే రీల్స్ కోసం.. వ్యూస్ కోసం ఎంతగా తెగిస్తారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
Read Also- America: అమెరికాలో ఘోరాతి ఘోరం.. హైదరాబాద్ ఫ్యామిలీ సజీవ దహనం
వీడేం తండ్రి బాబోయ్!
రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ (Instagram Reels) కోసం ఓ తండ్రి తన ఏడేళ్ల కుమార్తె ప్రాణాలను ప్రమాదంలో పడేసిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. ఉమాశంకర్ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఆదివారం షేర్ చేయబడిన వీడియోలో.. ఉమాశంకర్ దంపతులు తన చిన్నారి కుమార్తెను బంద్ బరైతా రిజర్వాయర్‌పై ప్రమాద స్థాయిలో ఉన్న ఇనుప ఫ్రేమ్‌పై రీల్స్ కోసం కూర్చోబెట్టారు. రెయిలింగ్ పక్కనున్న ‘గేజ్ బాక్స్’పై కూర్చోబెట్టడం కనబడుతుంది. ఈ బాక్స్ తుప్పు పట్టిన యాంగిల్ ఐరన్ సపోర్ట్‌తో అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉంది. చిన్నారిని అక్కడ ఉంచిన తర్వాత, తండ్రి ఆమె చేతులు వదిలేశాడు. ఆ చిన్నారి భయపడుతున్నా కూడా బెదిరించి మరీ ఇనుప ఫ్రేమ్ పై కూర్చోబెట్టడం గమనార్హం. బాలిక ముఖంలో భయం స్పష్టంగా వీడియోలో చూడొచ్చు. ఏ మాత్రం అడుగు అటు లేదా ఇటు పెట్టినా డ్యామ్‌లో పడిపోతుంది చిన్నారి. షాకింగ్ విషయం ఏమిటంటే.. ఈ ప్రమాదకరమైన రీల్స్ చేస్తున్నప్పుడు బాలిక తల్లి కూడా అక్కడే ఉంది. ఆమె కనీసం తమ కుమార్తెను ఆపాల్సింది పోయి.. మరింత ప్రోత్సహిస్తూ కనిపించింది. పక్కనే ఉన్న ఒకరిద్దరు మహిళలు కూడా ఇదంతా ఎంకరేజ్ చేశారే కానీ.. చిన్నారి ప్రాణాల గురించి ఆలోచించిన నాథుడే లేడు. ఈ వీడియో త్వరగానే వైరల్‌గా మారింది. అయితే అంతే రీతిలో జనాలు, నెటిజన్లు నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. సోషల్ మీడియా కోసం ప్రాణాలకు తెగించి ప్రమాదకరమైన స్టంట్స్ చేయడంపై ప్రజల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. లైక్స్, వ్యూస్ కోసం పిల్లల ప్రాణాలు పణంగా పెట్టడం ఏంటి? అని నెటిజన్లు నిలదీశారు. ఇక పక్కనే ఉన్న తల్లిపై కొందరు బూతుల వర్షం కురిపించారు. ఇంకొందరైతే వీడియో డిలీట్ చేయకపోతే తాటతీస్తామని బెదిరించారు కూడా. నెటిజన్ల నుంచి వస్తున్న విమర్శలు చూసి దెబ్బకు వీడియో డిలీట్ చేసేశాడు ఉమాశంకర్.
పోలీసులు ఏమంటున్నారు..?
ఈ సంఘటనపై భరత్‌పూర్ ఏఎస్ఐ భరత్ లాల్ మాట్లాడుతూ.. ఈ వీడియో తమ దృష్టికి వచ్చింది కానీ, ఆ దంపతులను ఇంకా గుర్తించలేదని తెలిపారు. వారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. ఈ వీడియోను ఆ దంపతులతో ఉన్న మూడో వ్యక్తి చిత్రీకరించారని, అయితే అది ఎప్పుడు తీశారో ఇంకా నిర్ధారించలేదన్నారు. మరోవైపు.. ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ ఏఈ దశరథ్ కుమార్ మాట్లాడుతూ.. ఆ బాలిక గేజ్ బాక్స్ నుంచి పడితే 30 అడుగుల కిందపడే అవకాశం ఉందన్నారు. బంధ్ బరైతాలో పెరిగిన నీటిమట్టాల కారణంగా పర్యాటకుల సందడి పెరిగినప్పటికీ, కేవలం మూడు రోజుల క్రితమే భరత్‌పూర్ కలెక్టర్ కమర్ చౌదరి ప్రజలు డ్యామ్‌లు, నీటిపారుదల ప్రాంతాలు, నదులు, చెరువులకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. పర్యాటకుల భద్రతకు ఏర్పాట్లు చేసినప్పటికీ, ప్రజలు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారని మండిపడుతున్నారు. ఈ ఘటన సోషల్ మీడియా ట్రెండ్స్‌కు ప్రాధాన్యతనిస్తూ వ్యక్తుల భద్రతను, ముఖ్యంగా పిల్లల ప్రాణాలను ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారో తెలియజేస్తోంది. ఇలాంటి ప్రమాదకరమైన చర్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తల్లిదండ్రులలో అవగాహన పెంచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Read Also- Bhairavam OTT: ‘భైరవం’ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?
విచక్షణ కోల్పోతే ఎలా?
ఈ ఘటన సోషల్ మీడియా మోజులో పడి మనుషులు ఎంతగా విచక్షణ కోల్పోతున్నారో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. పిల్లల భద్రతకు కనీసం ప్రాధాన్యత ఇవ్వకుండా, కేవలం పాపులారిటీ కోసం వారి ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం తీవ్రమైన నేరం. ఇలాంటి ఘటనలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తల్లిదండ్రులలో అవగాహన పెంపొందించాలని అనేక మంది డిమాండ్ చేస్తున్నారు. ఈ రకమైన ప్రవర్తనను సమాజం తీవ్రంగా ఖండించాలని పిల్లల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. ఇలాంటి సందర్భాల్లో ఎవరైనా పోలీసులకు ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. బాలల హక్కుల ఉల్లంఘన, నిర్లక్ష్యం లేదా ప్రాణాలకు ప్రమాదం కలిగించినందుకు సెక్షన్ల కింద కేసులు నమోదు కావచ్చు. అయితే.. ఈ సంఘటనపై పోలీసులు స్వతహాగా కేసు నమోదు చేశారా? తల్లిదండ్రులపై ఏవైనా సెక్షన్ల కింద కేసులు పెట్టారా? వారిని అరెస్టు చేశారా? బాలల సంక్షేమ కమిటీ లేదా ఇతర ఏజెన్సీలు జోక్యం చేసుకున్నాయా? అనే వివరాలు తెలియాల్సి ఉంది. అయితే పోలీసులు, ఇరిగేషన్ అధికారులు మాత్రం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని.. అవగాహనా కార్యక్రమాలు చేపడుతామని వెల్లడించారు.
Read Also- Viral News: చాక్లెట్ తీసుకోలేదని మహిళను చంపేశాడు.. సీన్ కట్ చేస్తే..!