Diwali Special Trains: ప్రత్యేక సందర్భాల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇండియన్ రైల్వేస్ ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తుంటుంది. ఈ ఏడాది దీపావళి సమీపిస్తున్న వేళ గుడ్‌న్యూస్ చెప్పింది. అక్టోబర్ నెలలో దీపావళి, ఛఠ్ పూజ సందర్భంగా స్వస్థలాలకు వెళ్లేవారి తీవ్ర రద్దీకి అనుగుణంగా ఈసారి దేశవ్యాప్తంగా ఏకంగా 12,000 ప్రత్యేక రైళ్లు నడపబోతున్నట్టు భారతీయ రైల్వేస్ (Diwali Special Trains) ప్రకటించింది. దీంతో, ప్యాసింజర్లలో గందరగోళం తగ్గుతుందని, ఎక్కువ బెర్తులు అందుబాటులో ఉండి, ప్రయాణికులు సురక్షితంగా, సకాలంలో గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా రైల్వేస్ తెలిపింది.
ఎక్కువ మంది ప్రయాణించే ఢిల్లీ నుంచి గయా, ముజఫర్‌పూర్ నుంచి హైదరాబాద్, సహస్రా – అమృత్‌సర్, ఛప్రా-ఢిల్లీ రూట్లలో ఎక్కువ రైళ్లు అందుబాటులో ఉంటాయని రైల్వేస్ తెలిపింది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, యాప్‌లలో బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తామని, రిటర్న్ బుకింగ్స్‌పై డిస్కౌంట్లు కూడా లభిస్తాయని తెలిపింది. పండగల సమయాల్లో ప్రయాణికుల రద్దీ తీవ్రంగా ఉంటుంది. రెగ్యులర్‌గా నడిచే రైళ్లలో సీట్లు చాలా ముందుగానే బుకింగ్ అయిపోతుంటాయి. దీంతో, చాలామంది స్వస్థలాలకు చేరుకోవాలంటే నరకయాతన పడాల్సి వస్తోంది. ముఖ్యంగా, మధ్యతరగతి జీవులు భారీ టికెట్ రేట్లు చెల్లించి బస్సు ప్రయాణాలు చేయడం కష్టంగా మారింది. దీంతో, ప్రయాణికుల అసౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని రైల్వేస్ ఈ నిర్ణయం తీసుకుంది.
Read Also- TVK Vijay: ఎన్నికల్లో పొత్తుపై టీవీకే అధినేత, హీరో విజయ్ కీలక ప్రకటన
ప్రత్యేక రైళ్ల ద్వారా ప్రయాణికులకు అదనపు బెర్తులు అందుబాటులో ఉంటాయి. దీంతో, రద్దీ రోజుల్లో కూడా సులభంగా ప్రయాణం చేసే వీలుచిక్కుతుంది. తద్వారా పండగ వేళ ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా సురక్షితంగా, సకాలంలో గమ్యస్థానానికి చేరుకుంటారు. ఎక్కువ దూరంలో ప్రయాణించే మార్గాల్లో భద్రతా చర్యలు కూడా తీసుకుంటామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. పండగల వేళ ప్రతి ఒక్కరూ సులభంగా, తక్కువ ఖర్చుతో, సమయానుగుణంగా ప్రయాణించేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు.
ప్రత్యేక రైళ్లు మాత్రమే కాదు, కొత్త మార్గాల్లో కూడా రైళ్లు నడపనున్నట్టు ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. దీపావళి, ఛఠ్ పూజ పండగల రద్దీ ఎక్కువగా ఉండే ఉత్తర భారతం, తూర్పు భారతదేశంలో కొత్త మార్గాల్లో రైళ్లు నడుపుతామని తెలిపింది.
Read Also- No New Aadhaar: 18 ఏళ్లు పైబడినవారికి కొత్త ఆధార్ ఇవ్వబోం.. ఆ రాష్ట్ర సీఎం ప్రకటన
ప్యాకేజీలు కూడా
పండగల వేళ ప్రయాణికుల జర్నీని తక్కువ ఖర్చుతో పూర్తి చేసేందుకు వీలుగా ఇండియన్ రైల్వేస్ ఇటీవల ఒక కొత్త స్కీమ్‌ను ప్రారంభించింది. ఆ స్కీమ్ పేరు ‘రౌండ్-ట్రిప్ ప్యాకేజీ’. ఒకేసారి రాను, పోను (onward + return) టికెట్లు బుక్ చేసుకునే ప్యాసింజర్లకు రిటర్న్ టికెట్‌పై 20 శాతం తగ్గింపు లభిస్తుంది. టికెట్లు అన్నీ ఒక్కటే రిజర్వేషన్ (PNR) కింద ఉండాలి. విడివిడిగా బుక్ చేసుకుంటే డిస్కౌంట్ వర్తించదు. ఇంకో విషయం ఏంటంటే, రిటర్న్ ప్రయాణం కూడా అదే మార్గంలో (same route) ఉండాలి.
ఆఫర్ వర్తించే తేదీలివే
గమ్యస్థానానికి వెళ్లే ప్రయాణం (Onward Journey) 13 – 26 అక్టోబర్ 2025 మధ్య ఉండాలి. తిరుగు ప్రయాణం (Return Journey) 17 – 1 డిసెంబర్ 2025 మధ్యలో ఉండాలి. ఈ తేదీల మధ్య బుకింగ్ చేసుకున్నవారికి మాత్రమే డిస్కౌంట్ ఆఫర్ల వర్తిస్తాయి.