Shreyas Iyer Father: ఇటీవలే ప్రకటించిన ఆసియా కప్-2025లో (Asia Cup 2025) టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌కు (Shreyas Iyer) చోటుదక్కలేదు. కనీసం స్టాండ్‌బై ఆటగాళ్ల జాబితాలో కూడా అతడి పేరు కనిపించలేదు. ఈ పరిణామంపై శ్రేయస్ అయ్యర్ తండ్రి సంతోష్ అయ్యర్ (Shreyas Iyer Father) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శ్రేయస్‌ను టీ20 జట్టులోకి తీసుకోవాలంటే ఇంకేం చెయ్యాలో చెప్పండి? అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రతిఏడాది ఐపీఎల్‌లో చక్కగా ఆడుతున్నాడని, కెప్టెన్‌గా ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ఈ ఏడాది పంజాబ్ కింగ్స్ జట్లను ఫైనల్‌కు తీసుకెళ్లాడని గుర్తుచేశారు. 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుతో టైటిల్ కొట్టించాడని సంతోష్ అయ్యర్ ప్రస్తావించారు. ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కెప్టెన్ చేయమంటున్నామా?
శ్రేయస్ అయ్యర్‌ను టీమిండియా కెప్టెన్‌గా ఎంపిక చేయాలని తాను అనడం లేదని, కనీసం జట్టులో చాలు కదా అని సంతోష్ అయ్యర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నిజానికి నా కొడుకు టీమ్‌లోకి ఎంపిక కాకపోయినా అసహనం వ్యక్తం చేయడు. ‘నా రాత’ అని అంటాడు. ఏ నిర్ణయం విషయంలోనైనా చాలా కూల్‌గా ఉంటాడు. ఎవర్నీ నిందించడు. కానీ, ఎంతైనా నా కొడుకు కూడా మనిషే కదా, సహజంగానే లోపల బాధ ఉంటుంది’’ అని సంతోష్ అయ్యర్ వాపోయారు.
Read Also- Congress MLA Resign: కేరళ కాంగ్రెస్‌లో నటి కలకలం.. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడి రాజీనామా
అయ్యర్‌కు అన్యాయం చేశారు: కైఫ్
శ్రేయస్ అయ్యర్‌ను ఆసియా కప్‌కు ఎంపిక చేయకపోవడంపై టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ తన అభిప్రాయాన్ని కుండబద్ధలుకొట్టినట్టు చెప్పాడు. శ్రేయస్ అయ్యర్‌కు టీమిండియా సెలక్టర్లు, మేనేజ్‌మెంట్ అన్యాయం చేశారని వ్యాఖ్యానించాడు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న శ్రేయస్‌పై తీసుకున్న నిర్ణయం న్యాయంగా లేదని కైఫ్ అభిప్రాయపడ్డాడు.
‘‘శ్రేయర్ స్ అయ్యర్ పేరు పరిగణనలోకి తీసుకోలేదని సెలక్టర్లు చెప్పారు. కేవలం 15 మందినే ఎంపిక చేయాల్సి ఉంటుందన్నారు, అది కూడా నేను అర్థం చేసుకోగలను. మరి, స్టాండ్‌బై ఆటగాళ్ల జాబితాలో కూడా అయ్యర్ పేరు ఎందుకు చేర్చలేదు?’’ అని మహ్మద్ కైఫ్ ప్రశ్నించారు. అంత మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ జట్టులో చోటు ఎందుకు దక్కలేదో అర్థం కాలేదని కైఫ్ మండిపడ్డాడు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానెల్‌లో కైఫ్ మాట్లాడాడు.
Read Also- Modi on Rahul Gandhi: రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ పదునైన విమర్శలు
చీఫ్ సెలక్టర్ ఏమన్నారంటే?
శ్రేయస్ అయ్యర్‌ను ఆసియా కప్ 2025 టీమ్‌లోకి ఎంపిక చేయకపోవడంపై టీమ్ అనౌన్స్‌మెంట్ సమయంలో బీసీసీఢ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ స్పందించారు. ‘‘ఇది శ్రేయస్ తప్పు కాదు. అలాగని, మా తప్పు కూడా ఏమీలేదు. ఎవరి స్థానంలో అతడిని తీసుకోవాలి?. 15 మందినే తీసుకోవాలి. ఆ ప్రకారమే ఎంపిక చేశాం. కాబట్, శ్రేయస్ అయ్యర్ అవకాశం కోసం ఇంకాస్త ఎదురుచూడాలి ఉంటుంది’’ అని అగార్కర్ చెప్పారు. కాగా, శ్రేయస్ అయ్యర్‌కు టీమ్‌లో చోటు ఇవ్వాల్సిందేనని చాలా మంది క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
కాగా, ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన శ్రేయర్ అయ్యర్ అద్భుతంగా రాణించాడు. ఆ జట్టుని ఏకంగా ఫైనల్‌కు కూడా తీసుకెళ్లాడు. అయినప్పటికీ, టీ20 ఫార్మాట్‌లో జరిగే ఆసియా కప్‌లో అతడికి చోటు దక్కకపోవడంపై భారత క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సెలక్టర్లపై మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగానైతే ఏకీపారేస్తున్నారు.