Congress MLA Resign: కేరళ కాంగ్రెస్‌లో గురువారం అనూహ్యమైన పరిణామం జరిగింది. కేరళ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, పాలక్కడ్ ఎమ్మెల్యే రాహుల్ మామ్‌కూటతిల్ ఆ పార్టీకి రాజీనామా (Congress MLA Resign) చేశారు. మలయాళ నటి, మాజీ జర్నలిస్ట్ అయిన రిని జార్జ్ ఆయనపై చేసిన తీవ్ర ఆరోపణలే ఇందుకు దారితీశాయి. రాహుల్ గత మూడేళ్లుగా తనకు అసభ్యకరమైన మెసేజులు పంపిస్తున్నాడని, ఫైవ్-స్టార్ హోటల్‌కు రావాలంటూ ఆహ్వానించాడంటూ ఆమె ఆరోపించారు. రాహుల్ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ నేతలకు అనేకసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ, ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఆమె చెప్పారు.
Read Also- Modi on Rahul Gandhi: రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ పదునైన విమర్శలు
నాయకుడి పేరు, ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ పేరు చెప్పకుండానే నటి రిని ఈ సంచలన ఆరోపణలు చేశారు. అయితే, ఈ వ్యవహారంపై స్పందించిన కేరళ బీజేపీ.. నటిని వేధించిన ఆ నేత కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాహుల్ మామ్‌కూటతిల్ అని, ఈ వ్యవహారంలో అతడి ప్రమేయం ఉందని ఆరోపించింది. పాలక్కడ్ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యే ఆఫీస్ ముందు నిరసన కూడా తెలిపింది.
నటి రిని, బీజేపీ నేతలు చేసిన ఈ ఆరోపణలను రాహుల్ మామ్‌కూటతిల్ ఖండించారు. అయితే, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తనపై ఆరోపణ చేసిన వ్యక్తి.. కోర్టులో నిరూపించాలంటూ రాహుల్ సవాలు విసిరారు. ఇప్పటివరకు కచ్చితమైన ఆధారాలతో తనపై ఫిర్యాదు చేయలేదని ఆయన పేర్కొన్నారు.
ఓ ఇంటర్వ్యూలో నటి ఆరోపణలు
నటి రిని జార్జ్ ఓ ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో ఎమ్మెల్యే రాహుల్‌పై ఈ ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘‘ సోషల్ మీడియా ద్వారా ఆ నాయకుడికి నేను పరిచయం అయ్యాను. మూడేళ్లక్రితమే ఆ ఎమ్మెల్యే వేధింపులు మొదలయ్యాయి. పరిచయమైన కొద్ది రోజుల తర్వాత ఆయన నుంచి అసభ్యకరమైన మెసేజులు రావడం మొదలైంది’’ అని నటి రిని ఆరోపణలు చేసింది. ఫైవ్ స్టార్ హోటల్‌లో గది బుక్ చేస్తానని, అక్కడికి రావాలంటూ కూడా మెసేజులు చేశాడని ఆమె తెలిపింది.
నా ఫిర్యాదులు పట్టించుకోలేదు
ఆ రాజకీయ పార్టీకి చెందిన సీనియర్ నేతలకు ఎమ్మెల్యే వేధింపులపై ఫిర్యాదులు చేశానని, అయినా ఎవరూ పట్టించుకోలేదని నటి రిని ఆరోపించింది. తాను ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసినా ఆ యువ నాయకుడికి పార్టీలో అంతర్గతంగా కీలక పదవులు వరుసగా కల్పించారని ఆమె అన్నారు. ‘‘నేను ఒకసారి హెచ్చరించినప్పుడు, ఏదైనా చెప్పాలనుకుంటే వెళ్లి చెప్పు. ఎవ్వరు పట్టించుకుంటారు?. అని అన్నారు. దాంతో వాళ్లపై (కాంగ్రెస్ నాయకులపై) నాకు ఉన్న గౌరవం పూర్తిగా పోయింది. నేను ఫిర్యాదు చేసిన తర్వాత కూడా ఆ యువ నాయకుడికి పార్టీలో చాలా ముఖ్యమైన పదవులు కట్టబెట్టారు’’ అంటూ ఇంటర్వ్యూలో ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. భద్రతా కారణాల వల్ల తాను పోలీసులకు ఫిర్యాదు చేయలేదని, వ్యవస్థలపై అంతగా నమ్మకం లేదని ఆమె చెప్పారు. సంబంధిత రాజకీయ పార్టీ పరువు పోగొట్టాలని కూడా తాను భావించడం లేదని, అయతే, ఆ నేత చేతిలో వేధింపులకు గురైన ఇతర మహిళలకు మద్దతుగా మాత్రమే తాను మాట్లాడుతున్నానని నటి రిని పేర్కొన్నారు.
తనపై శారీరకంగా ఎలాంటి దాడి జరగలేదని, అసభ్యకరమైన మెసేజులు పంపాడని ఆమె క్లారిటీ ఇచ్చారు. ఆయన ఇతరులను కూడా వేధింపులకు గురిచేసినట్టుగా స్నేహితుల ద్వారా తెలుసుకున్నానని ఆమె పేర్కొన్నారు.