TVK Vijay: తమిళ సూపర్‌స్టార్, తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ (TVK Vijay) వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీతోనైనా జట్టు కడతారా?, సింగిల్‌గా పోటీ చేస్తారా?.. అనే సందేహాలపై మరోసారి క్లారిటీ వచ్చింది. సింహం.. సింహమేనని, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ ఇతర ఏ పార్టీతోనూ కలవబోదని విజయ్ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు ఉండబోదని ఆయన కుండబద్దలుకొట్టినట్టు చెప్పారు. టీవీకే పార్టీ రాష్ట్రంలోని అత్యధిక సీట్లలో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే పార్టీ, టీవీకే పార్టీల మధ్యే పోటీ ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం మధురైలో జరిగిన పార్టీ రాష్ట్రస్థాయి రెండవ కాన్ఫరెన్స్ వేదికగా ఆయన వెల్లడించారు. ఈ సభకు వేలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. కాగా, తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలతో టీవీకే పార్టీ రాజకీయ ప్రయాణం మొదలుకానుంది.
Read Also- No New Aadhaar: 18 ఏళ్లు పైబడినవారికి కొత్త ఆధార్ ఇవ్వబోం.. ఆ రాష్ట్ర సీఎం ప్రకటన
బీజేపీ సిద్ధాంతపరమైన శత్రువు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయబోతున్నామని టీవీకే అధినేత విజయ్ స్పష్టం చేశారు. ‘‘మేము ఒంటరిగా పోటీ చేస్తాం. మా పార్టీకి ఉన్న ఏకైక సిద్ధాంతపరమైన శత్రువు బీజేపీ, మా పార్టీకి ఉన్న ఏకైక రాజకీయ శత్రువు డీఎంకే. నేనొక సింహం. నా ఆధిపత్యాన్ని ప్రకటిస్తున్నాను. టీవీకే ఎవరూ అడ్డుకోలేని ఓ శక్తి. ఆధిపత్యం చెలాయించడానికి ఇక్కడకు వచ్చింది. పొత్తులు ఏవీ ఉండవు’’ అని విజయ్ పేర్కొన్నాడు. 2026 తమిళనాడు ఎన్నికల్లో ప్రధాన పోటీ డీఎంకే, టీవీకే పార్టీల మధ్యనే ఉంటుందని ధీమా వ్యక్తం చేశాడు.
Read Also- Shreyas Iyer Father: ఆసియా కప్‌లో అయ్యర్‌కు చోటు దక్కకపోవడంపై అతడి తండ్రి సంచలన వ్యాఖ్యలు
నిజాయితీగా రాజకీయాలు..
టీవీకే పార్టీ రాజకీయాలు నిజాయితీ, భావోద్వేగంతో నిండి ఉంటాయని విజయ్ వ్యాఖ్యానించారు. ప్రజల మెరుగైన జీవనం కోసం పోతాడతామని తెలిపాడు. మహిళలు, వృద్ధులు, పిల్లల భద్రతే టీవీకే తొలి ప్రాధాన్యం అని తెలిపారు. రైతులు, యువత, ట్రాన్స్‌జెండర్‌లు, నిరాదరణకు గురైన వృద్ధులు, దివ్యాంగులు వంటి ప్రత్యేక శ్రద్ధ అవసరం ఉన్న వారికి టీవీకే ప్రభుత్వం అనుకూలంగా ఉంటుందని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రజల్లో చర్చనీయాంశంగా ఉన్న తమిళనాడు మత్స్యకారుల హక్కులు, భద్రత, నీట్ పరీక్షను రద్దు వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని విజయ్ ప్రశ్నించారు.
శ్రీలంక నేవీ చేతిలో దాదాపు 800 మంది తమిళనాడు మత్స్యకారులు దాడికి గురయ్యారని, మత్స్యకారుల భద్రత కోసం కచ్చతీవును (ద్వీపాలు) తిరిగి తీసుకొని రాష్ట్రానికి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నీట్‌ను రద్దు చేయాలి, ఇది చేయగలరా? ప్రధాని మోదీకి ఆయన సవాలు విసిరారు. టీవీకే అధినేత విజయ్ ప్రసంగానికి అభిమానులు, పార్టీ కార్యకర్తలు హర్షధ్వానాలు చేశారు.