No New Aadhaar: ఆధార్ కార్డుల జారీ ప్రక్రియలో అవకతవకలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు పటిష్టమైన విధానాలను అమల్లోకి తీసుకొచ్చింది. విదేశీయులు మన దేశంలోకి అక్రమంగా చొరబడి ఆధార్ కార్డులు పొందకుండా కఠినమైన నిబంధనలు అమలు చేస్తోంది. అయినప్పటికీ, సరిహద్దు రాష్ట్రాల్లో ఆధార్ కార్డు జారీలో అవకతవకలకు అవకాశం ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అసోం ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది.
తోటమాలి పనిచేసేవారు (టీ తోటల కార్మికులు), ఎస్సీ, ఎస్టీలు మినహా.. 18 ఏళ్లు పైబడిన ఎవరికీ కొత్తగా ఆధార్ కార్డులు జారీ చేయబోమని (No New Aadhaar) అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. వయోజనులైన ఎస్సీలు, ఎస్టీలు, తోటలకు కాపలా ఉండే కార్మికులకు మాత్రమే కొత్త ఆధార్ కార్డులు జారీ చేస్తామని చెప్పారు. మరో ఏడాదిపాటు ఇతరులు ఎవరికీ ఆధార్ కార్డులు జారీ చేయబోమన్నారు. అయితే, ఆధార్ కార్డు పొందని ఇతర వర్గాల కోసం సెప్టెంబర్ నెలలో ప్రత్యేక విధానం ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు.
Read Also- Ind vs Pak: పాక్‌తో క్రికెట్ సంబంధాలపై కేంద్రం కీలక నిర్ణయం
సెప్టెంబర్‌లో ఇచ్చే గడువు ముగిసిపోయిన తర్వాత, అవసరమైతే అత్యంత అరుదైన పరిస్థితుల్లో మాత్రమే ఆధార్ కార్డును జారీ చేసే అధికారం జిల్లా కలెక్టర్‌కు ఉంటుందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ చెప్పారు. అయితే, జారీకి ముందు స్పెషల్ బ్రాంచ్ రిపోర్ట్, ఫారినర్స్ ట్రైబ్యునల్ రిపోర్టులను కలెక్టర్ సమగ్రంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని, ఈ మేరకు నిబంధన విధించినట్టు ఆయన వివరించారు.
బంగ్లాదేశ్ వలసలకు అడ్డుకట్టే లక్ష్యం..
బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన విదేశీయులు ఆధార్ కార్డు పొందకుండా నిరోధించడమే అసోం ప్రభుత్వ చర్యల వెనుక ఉద్దేశంగా ఉంది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన విదేశీయులు అస్సాంలో ఆధార్ పొంది, తద్వారా భారత పౌరసత్వాన్ని పొందే ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటివారిని అడ్డుకోవడమే ప్రభుత్వ ఉద్దేశమని హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. అసోం ప్రభుత్వం ఎప్పటికప్పుడు విదేశీ వలసలను నిరోధిస్తోందన్నారు. విదేశీయులకు ఆధార్ కార్డు జారీ అయ్యే అవకాశాలను ఇప్పటికే చాలావాటిని తిప్పికొట్టినట్లు సీఎం బిశ్వశర్మ వెల్లడించారు.
Read Also- Shreyas Iyer Father: ఆసియా కప్‌లో అయ్యర్‌కు చోటు దక్కకపోవడంపై అతడి తండ్రి సంచలన వ్యాఖ్యలు
కాగా, ఆధార్ జారీ విషయంలో పటిష్టమైన పౌరసత్వ ధ్రువీకరణ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోంది. ఆధార్‌ను జారీకి పౌరసత్వ ధృవీకరణ కోసం స్పష్టమైన మార్గదర్శకాలు నిర్దేశించింది. ప్రభుత్వ రికార్డులు, బర్త్ సర్టిఫికెట్లు, పాత గుర్తింపు పత్రాలను తప్పనిసరి చేసింది. దీంతో, అక్రమంగా విదేశీ పౌరులను గుర్తిస్తున్నారు. ఇక, అసోం లాంటి సరిహద్దు రాష్ట్రాల్లో పోలీసు, ఇంటెలిజెన్స్ విభాగాల రిపోర్టులు, అనుమతి ఆధారంగా ఆధార్ జారీపై నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ విధానం అక్రమ వలసదారులకు ఆధార్ కార్డు మంజూరు కాకుండా నిరోధిస్తోంది. బయోమెట్రిక్ డేటాను కూడా తప్పనిసరి చేస్తున్నారు. గ్రామ / వార్డు స్థాయిలో సమీక్షా కమిటీలు రిపోర్టులను కూడా పరిశీలిస్తున్నారు.