Viral Video: అమెరికాలో జీవించడమంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నదని చాలా అభిప్రాయపడుతుంటారు. అక్కడ రోజుకు లక్షల్లో ఖర్చు అవుతుందని.. సామాన్యులు అస్సలు తట్టుకోలేరని పలువురు అభిప్రాయపడుతుంటారు. అయితే ఓ ఇండియన్ ఇందులో నిజానిజాలను తేల్చాలని నిర్ణయించుకున్నాడు. న్యూయార్క్ లో సామాన్యులు బతకడం అంత కష్టంగా ఉంటుందా? అని తెలుసుకోవాలని భావించాడు. ఆ ఆలోచన వచ్చిందే తడువుగా రంగంలోకి దిగాడు. తద్వారా కేవలం 20 డాలర్లు మాత్రమే ఖర్చు పెట్టి న్యూయార్క్ లో ఒక రోజు గడిపి చూపించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే..
ఇండియన్ యూట్యూబర్ (Indian YouTuber) ఆబీర్ వ్యాస్ (Aabir Vyas) కేవలం 20 డాలర్లతో న్యూయార్క్ సిటీలో ఒక రోజు గడిపి చూపించాడు. ఈ ఛాలెంజ్ ను తాను ఏ విధంగా పూర్తి చేశాడో తెలియజేస్తూ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. తన అనుభవాలు, తిన్న ఆహారాన్ని వీడియోలో పంచుకున్నారు. వ్యాస్ మాట్లాడుతూ..
‘సింపుల్ ఛాలెంజ్ – బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ బయటే చేసి మొత్తం ఖర్చు 20 డాలర్లలోపే ఉండాలి’ అని వ్యాస్ తన టాస్క్ ను తెలియజేశాడు.
20 డాలర్లు ఎలా ఖర్చు చేశాడంటే?
వ్యాస్ మెుదట అయిదు అరటిపండ్లు ఒక డాలర్‌కి కొనుగోలు చేసి తర్వాత బేగల్, గుడ్లతో కూడిన అల్పాహారం 3 డాలర్లకు తిన్నాడు. ‘అదే నా మొదటి భోజనం. కొంచెం హెల్తీగా ఉంచాలని చూశాను. ప్రోటీన్ తక్కువే అయినా కార్బ్స్ సరిపడా ఎనర్జీ ఇస్తాయి’ అని వ్యాస్ చెప్పుకొచ్చాడు. తర్వాత 2.29 డాలర్లకు ఒక ప్రోటీన్ బార్, 6.17 డాలర్లకు కాఫీ కొనుగోలు చేశాడు. కాఫీ షాప్‌లో కూర్చొని పనిచేయడానికి కూడా ఆయన ఇష్టపడ్డాడు. అలాగే ఆకలిని తగ్గించుకోవడానికి 0.48 డాలర్లకు స్పార్క్లింగ్ వాటర్ కూడా కొనుగోలు చేశాడు.
ఖర్చు 19.94 డాలర్లలోపే
‘నాకు మంచి కాఫీ కావాలి, అలాగే కూర్చొని సౌకర్యంగా పని చేసే ప్రదేశం కావాలి. ప్రోటీన్ బార్‌తో 20 గ్రాముల ప్రోటీన్ దొరికింది’ అని వ్యాస్ చెప్పారు. ఇక డిన్నర్ కోసం వీధిలోని ఓ ఫుడ్ కోర్ట్ వద్ద 7 డాలర్లు పెట్టి చికెన్ రైస్ తీసుకున్నారు. బడ్జెట్ దాటకుండా సాస్‌లు తగ్గించారు. తద్వారా మొత్తం రోజు ఖర్చు 19.94 డాలర్లలోపే అయ్యింది. ప్రయాణ ఖర్చు తగ్గించుకోవడానికి ప్రీపెయిడ్ సబ్‌వే కార్డ్ ఉపయోగించాడు. మెుత్తంగా వ్యాస్ న్యూయార్క్ లో 20 డాలర్ల లోపు ఖర్చుతో బతికి ఛాలెంజ్ ను పూర్తి చేశాడు.
View this post on Instagram
Also Read: Hydraa: నిబంధనలు ఉల్లంఘించి నిర్మాణాలు.. ప్రజావాణికి 48 ఫిర్యాదులు
నెటిజన్ల రియాక్షన్..
వ్యాస్ న్యూయార్క్ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. కొందరు ఆయన ప్రయత్నాన్ని ప్రశంసించగా.. మరికొందరు 20 డాలర్ల బడ్జెట్‌లో 7 డాలర్ల కాఫీ కొనడాన్ని ప్రశ్నించారు. ఒక నెటిజన్ స్పందిస్తూ.. ‘కాఫీ చాలా ఖరీదైనది’ అని పేర్కొన్నారు. మరొకరు ’20 డాలర్లలో బతకడం నిజంగా కష్టమే’ అంటూ అభిప్రాయపడ్డారు. మరొకరు ‘ఆ కార్ట్ చికెన్ రైస్ నేను న్యూయార్క్‌లో తిన్న బెస్ట్ ఫుడ్’ అని అన్నారు. అయితే న్యూయార్క్ చాలా ఖరీదైన నగరమని అంతా భావించామని.. హైదరాబాద్ తో పోలిస్తే.. అక్కడ జీవించడం చాలా తేలిక అని ఓ నెటిజన్ ఫన్నీగా కామెంట్ చేశాడు.