Nimisha Priya: యెమెన్ పౌరుడి హత్య కేసులో ఆ దేశంలో మరణశిక్ష ఖరారైన కేరళ నర్సు నిమిషా ప్రియా (36) (Nimisha Priya) కేసు వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం గురువారం మరోసారి స్పందించింది. ఇది చాలా సున్నితమైన అంశమని, ఈ వ్యవహారంలో స్నేహపూర్వక దేశాలతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. ప్రతివారం నిర్వహించే మీడియా సమావేశంలో భాగంగా గురువారం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ, ప్రియా కుటుంబానికి న్యాయ సహాయం అందిస్తు్న్నామని, నిమిషా ప్రియా తరఫున న్యాయవాదిని నియమించామని, రోజువారీగా దౌత్య పరామర్శలు చేస్తున్నట్టు వివరించారు.
“ఇది చాలా సున్నితమైన కేసు. భారత ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయసహకారాలు అందిస్తోంది. న్యాయ సహాయంతో పాటు దౌత్య పరామర్శలు కూడా జరుగుతున్నాయి. నిమిషా కుటుంబానికి మరింత అవకాశం లభించేలా యెమెన్ అధికారులు ఇటీవలే మరణ శిక్షను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఎప్పటికప్పుడు మేము ఈ కేసును సమీక్షిస్తున్నాం” అని రణధీర్ జైస్వాల్ వివరించారు.
అసలు ఏంటీ కేసు?
2008లో నిమిషా ప్రియా ఉద్యోగం కోసం యెమెన్ వెళ్లింది. నిమిషా ప్రియా యెమెన్‌లోని పలు ఆసుపత్రుల్లో పని చేసింది. ఆ తర్వాత, సొంతంగా క్లినిక్ ప్రారంభించింది. స్థానిక చట్టాల ప్రకారం, యెమెన్ పౌరుడు ఒకర్ని ఆమె క్లినిక్ నిర్వహణలో భాగస్వామిగా చేసుకోవాల్సి వచ్చింది. ఆ వ్యాపార భాగస్వామి పేరు తలాల్ అబ్దో మెహ్దీ (37). ఇతను నిమిషా ప్రియాను వేధింపులకు గురిచేశాడు. డబ్బులు తీసుకోవడమే కాదు, నిమిషా పాస్‌పోర్టును కూడా బలవంతంగా లాక్కొని అతడి వద్ద పెట్టుకున్నాడు. పాస్‌పోర్టు ఎలాగైన వెనక్కి తీసుకోవాలని భావించిన నిమిషా 2017లో తలాల్ అబ్దో మెహ్దీకి ఇంజెక్షన్ రూపంలో మత్తుమందు ఇచ్చింది. అతడు మత్తులోకి జారుకున్నాక పాస్‌పోర్టు తీసుకెళ్లాలని భావించింది. కానీ, దురదృష్టవశాత్తూ అతడు చనిపోయాడు. దీంతో, యెమెన్ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తూ నిమిషా ప్రియా అరెస్ట్ అయింది. స్థానిక చట్టాల ప్రకారం నిమిషాకు మరణశిక్ష పడింది. యెమెన్ సుప్రీంకోర్టు కూడా మరణ శిక్షను సమర్థించింది. ఆ తర్వాత, యెమెన్ అధ్యక్షుడు కూడా మరణశిక్షకు ఆమోదముద్ర వేశారు. మరణశిక్షను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లు అన్నీ తిరస్కరణకు గురయ్యాయి. జూలై 16న (బుధవారం) ఆమెను ఉరి తీసేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. మరొక్క రోజు సమయం మాత్రమే మిగిలింది. చివరి ప్రయత్నంగా బాధిత కుటుంబం ‘బ్లడ్ మనీ’ స్వీకరించడానికి అంగీకరిస్తే మాత్రమే నిమిషా ప్రియా ప్రాణాలు బయటపడుతుంది. లేదంటే, ఉరిశిక్షను ఎదుర్కోవాల్సిందే.
Read Also- Viral News: తండ్రి చనిపోయి వర్క్‌ఫ్రమ్ హోం అడిగితే.. మేనేజర్ ఏమన్నాడంటే?
బ్లడ్ మనీకి అంగీకరించబోం: బాధిత కుటుంబం
నిమిషా ప్రియా చేతిలో హత్యకు గురైన యెమెన్ బాధిత కుటుంబంతో ప్రియా కుటుంబ సభ్యులు సంప్రదింపులు జరుపుతున్నారు. బ్లడ్ మనీ (నష్టపరిహారం) చెల్లిస్తామంటూ బతిమాలుతున్నారు. విరాళాల ద్వారా సేకరించిన 1 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 8.5 కోట్లు) ఇస్తామని ఆఫర్ చేసినా బాధిత కుటుంబం అంగీకరించలేదు. నష్టపరిహారాన్ని తిరస్కరించారు. ఇది గౌరవానికి సంబంధించిన అంశమని, నేరం నేరమే శిక్ష అనుభవించాలని వారు చెబుతున్నారు. అయినప్పటికీ బతిమాలేందుకు నిమిషా కుటుంబ సభ్యులు, మధ్యవర్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బ్లడ్ మనీపై చర్చలు జరుగుతున్నాయంటూ భారతీయ మీడియాలో వస్తున్న వార్తలపై బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ, దారితీసుకొచ్చేందుకు భారతీయ ప్రతినిధులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, ఈ నెల 16న ఉరితీయాల్సి ఉన్నప్పటికీ మరణశిక్షణు తాత్కాలికంగా వాయిదా వేశారు. తిరిగి ఎప్పుడు అమలు చేస్తారన్నది ఇంకా తెలియరాలేదు.
Read Also- Viral News: నల్లతాచును మెడకు చుట్టుకున్నాడు.. ఆ తర్వాత..