Viral News: నేటి కార్పొరేట్ వర్క్ కల్చర్‌లో జాలి, దయ, మానవీయత వంటి విలువలకు (Viral News) సంబంధించిన పదాలకు పెద్దగా చోటులేదు. ఉద్యోగుల బాధలు, వ్యక్తిగత పరిస్థితులు, కుటుంబ బరువు, బాధ్యతలు లాంటి అంశాలను యాజమాన్యాల దృష్టికి తీసుకెళ్లినా, చాలా చోట్ల ప్రతికూల స్పందన ఎదురవుతుంది. ఇటీవల ఓ భారతీయ ఐటీ ఉద్యోగికి ఇలాంటి ఆవేదనకరమైన పరిస్థితే ఎదురైంది. ఇటీవల తన తండ్రి చనిపోయిన సందర్భంలో అతడు ఎదుర్కొన్న బాధాకర పరిస్థితిని సోషల్ మీడియా మాధ్యమం ‘రెడిట్’ (Reddit) వేదికగా వ్యక్తపరిచాడు.
తన ఉద్యోగ స్థలంలో ఎదురైన అనురాగం లేని వ్యవహారాన్ని రెడిట్‌లో పంచుకున్నారు. తండ్రి అనారోగ్యంతో హాస్పిటల్‌లో ఉన్న సమయంలో 5 రోజులు సెలవు తీసుకున్నానని, దురదృష్టవశాత్తూ నాన్న చనిపోవడంతో ఇంటి దగ్గర నుంచి (Work From Home) పనిచేస్తూ అంతిమ సంస్కారాలను నిర్వహించానని చెప్పాడు. అయితే, నాన్న మృతితో ఒంటరిగా మారిపోయిన తన తల్లికి ఈ దుఃఖ సమయంలో తోడుగా ఉండేందుకు మరో నెల రోజులు వర్క్ ఫ్రమ్ హోం (WFH) ఇవ్వాలని కోరితే సంస్థ తిరస్కరించిందని బాధిత వ్యక్తి విచారం వ్యక్తం చేశాడు.
Read Also- American Woman: అమెరికా అమ్మాయి.. పాక్ అబ్బాయి.. ఇది మామూలు లవ్ స్టోరీ కాదు భయ్యో!
‘‘ మా అమ్మ సొంత ఊరిలో ఒంటరిగా ఉండటంతో, మరో నెల రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అనుమతి ఇవ్వండి అంటూ క్లయింట్ మేనేజర్‌ను కోరాను. ‘‘దయచేసి కర్మకాండలు పూర్తి చేసి.. ముందుకు సాగేలా ప్లాన్ చేసుకోండి’’ అంటూ మేనేజర్ నుంచి రిప్లై వచ్చింది. దీనర్థం, ఆఫీసుకు రావాలి అన్నమాట. ఫోన్ కాల్ మాట్లాడతానని కోరినా స్పందించలేదు’’ అని సదరు ఐటీ ఉద్యోగి పోస్ట్‌లో ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ పరిణామం తనను దిగ్ర్భాంతికి గురి చేసిందని వివరించాడు. పని ప్రదేశంలో జాలి, దయలేని వాతావరణానికి ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలిచింది.
నెటిజన్ల ఆగ్రహం
తమ పరిస్థితి చాలా దారుణంగా మారిందని, కాల్ చేసి వివరిస్తానని కోరినా మేనేజర్ పట్టించుకోలేదని, బాధకరమైన ఈ స్థితిలో రెడిట్‌లో సలహా కోరుతున్నానంటూ అతడు బాధను వ్యక్తపరిచాడు. కుటుంబ బాధ్యతలు ఒకపక్క, ఉద్యోగం మరోపక్క ఈ రెండింటిలో ఏది ఎంచుకోవాలో అర్థం కావడంలేదని ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ పోస్ట్‌పై చాలామంది నెటిజన్లు స్పందించారు. కంపెనీ చూపిన కఠిన వైఖరిపై చాలామంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగి పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. కార్పొరేట్ కంపెనీల విధానాలు స్పష్టంగా ఉండవని మరికొందరు పేర్కొన్నారు.
Read Also- Air India Crash: ఎయిరిండియా క్రాష్‌పై వెలుగులోకి పెనుసంచలనం!
ఒక నెటిజన్ స్పందిస్తూ… ‘‘వ్యక్తిగతంగా మీకు నష్టానికి చింతిస్తున్నాను. వర్క్ ఫ్రమ్ హోం కోసం అనుమతి అడగవద్దు. లీవ్ తీసుకుంటున్నట్టు సమాచారం ఇవ్వండి చాలు. తర్వాత ఏం జరిగినా జరగనివ్వండి. ఈ పరిస్థితుల్లో కుటుంబానికే ప్రాధాన్యత ఇవ్వాలి’’ అని సూచించారు. మరొకరు స్పందిస్తూ, ‘‘ఇది మానవత్వానికి పూర్తి విరుద్ధం. మీరు తండ్రిని కోల్పోవడం పట్ల విచారిస్తున్నాను. ఫిబ్రవరిలో నన్ను ఉద్యోగం నుంచి తీసేసిన కంపెనీ కూడా నా సెలవులే కారణమని చెప్పింది. అమ్మానాన్నల్ని చూడడానికి చివరిసారిగా లీవ్స్ తీసుకున్నాను. ఈ కంపెనీలు ఎప్పటికీ మారవు’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. మొత్తంగా కార్పొరేట్ ఉద్యోగాల్లో మానవీయ విలువలు మరుగునపడుతున్నాయి. కుటుంబ పరిస్థితులు, వ్యక్తిగత బాధలను పరిగణనలోకి తీసుకోకుండా కేవలం పనిపైనే ఒత్తిడి తెచ్చే ధోరణి కొనసాగుతున్నట్టు స్పష్టమవుతోంది.