Baby Skin Care Tips: శిశువుల చర్మం ఎంత కోమలంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా మృదువుగా, కాంతివంతంగా చిన్నారుల చర్మం నిగనిగలాడుతుంటుంది. అయితే వర్షాకాలంలో శిశువుల చర్మాన్ని అనేక సమస్యలు వెంటాడుతుంటాయి. గాలిలో ఉండే తేమ.. సూక్ష్మజీవులు, చర్మంలో చొచ్చుకుపోయే ఇతర పదార్థాలకు అనుకూలంగా ఉండి.. శిశువుల స్కిన్ కు ఇబ్బందులు సృష్టిస్తాయి. వాటిని త్వరగా గుర్తించి పరిష్కరించకపోతే అవి తీవ్రమైన ఇన్ ఫెక్షన్లకు దారితీయవచ్చు. ఈ నేపథ్యంలో వర్షాకాలంలో శిశువు చర్మానికి ఎదురయ్యే 5 ప్రధాన సమస్యలు.. వాటిని నివారించే మార్గాలను ఈ కథనంలో పరిశీలిద్దాం.
డైపర్ వల్ల దద్దుర్లు
తేమతో కూడిన వాతావరణం డైపర్ రాష్‌ను తీవ్రతరం చేస్తుంది. ఇది శిశువు చర్మంపై ఎరుపుగా కనిపించడంతో పాటు చిరాకు తెప్పిస్తాయి. అయితే డైపర్‌ను తరచూ మార్చడం, రోజులో చిన్నారి డైపర్ తో ఉన్న కాలాన్ని గణనీయంగా తగ్గించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. డైపర్ స్థానంలో శిశువుకు మెత్తటి వస్త్రాలను ఉపయోగించవచ్చు.
ఫంగల్ ఇన్ఫెక్షన్స్
గాలిలో తేమ, వెచ్చదనం ఫంగల్ ఇన్ఫెక్షన్లకు అనువైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. ముఖ్యంగా చిన్నారుల చంకలు, తొడలు, కాళ్లల్లో ఈ ఇన్ఫెక్షన్ అధికంగా కనిపిస్తుంటుంది. ఈ సమస్యకు పరిశుభ్రత ద్వారా చెక్ పెట్టవచ్చు. స్నానం తర్వాత శిశువుల శరీరాన్ని నీటి తడి లేకుండా తుడవాలి. ముఖ్యంగా శరీరంపై ఉండే మడతల వద్ద తడిని తుడిచి.. గాలి తగిలేలా చేయాలి. మడతల వద్ద చర్మ డ్రైగా మారిన వెంటనే ఆ ప్రాంతంలో యాంటీ ఫంగల్ పౌడర్లు, స్ప్రేలు వాడాలి.
ప్రిక్లీ హీట్ (మిలియారియా)
చెమట గ్రంథులు అడ్డుపడినప్పుడు శిశువు వీపు, ఛాతీపై ఎర్రగా దురద గల బంప్స్ లేదా బొబ్బలు కనిపిస్తాయి. దీనిని ప్రిక్లిహీట్ అంటారు. అది ఉన్నప్పుడు శిశువును తేలికైన, గాలి ఆడే కాటన్ దుస్తుల్లో ఉంచాలి. స్నానం తర్వాత చర్మాన్ని పూర్తిగా ఆరబెట్టాలి. పీడియాట్రిషియన్ లేదా డెర్మటాలజిస్ట్ సిఫార్సు చేసిన సున్నితమైన సోప్ ఉపయోగించండి.
ఎగ్జిమా (అటోపిక్ డెర్మటైటిస్)
తేమ వాతావరణం ఎగ్జిమాను తీవ్రతరం చేస్తుంది. ఇది శిశువు చర్మంపై వాపు గల పాచెస్‌గా కనిపిస్తాయి. వీటి నివారణలో భాగంగా శిశువుకు తేలికైన వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. పీడియాట్రిషియన్ సిఫార్సు చేసిన మాయిశ్చరైజర్లను వాడాలి. బలమైన సుగంధాలతో కూడిన డిటర్జెంట్లను నివారించాలి.
Also Read: NASA Engineers: అంతరిక్షంలో నాసా అద్భుతం.. తెలిస్తే కచ్చితంగా షాకవుతారు..!
స్కిన్ అలెర్జీలు, దురద
శిశువుల సున్నితమైన చర్మం.. తేమ, ఇతర పర్యావరణ కారకాల కారణంగా అలెర్జీలు, దురదకు గురవుతాయి. వీటి నివారణకు హైపోఅలెర్జెనిక్, సమతుల్య pH విలువ కలిగిన బేబీ సోప్స్, సుగంధ రహిత మాయిశ్చరైజర్ ను ఉపయోగించాలి. అలాగే చర్మం మడతలను బాగా ఆరబెట్టడం ద్వారా తేమ నిల్వ ఉండకుండా చూడాలి.
Also Read This: Human Bridge: రియల్ హీరోస్.. ఈ యువకులు చేసిన పనికి సెల్యూట్ చేయాల్సిందే!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘స్వేచ్ఛ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.