NASA Engineers: అమెరికా అంతరిక్ష సంస్థ నాసా (National Aeronautics and Space Administration – NASA) కు చెందిన జూనో ఉపగ్రహం.. బృహస్పతి (Jupiter) గ్రహం చుట్టూ పరిభ్రమిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దానిలోని జూనోకామ్ ఇమేజర్ లో సమస్యలు తలెత్తడంతో దానిని రిమోట్ థర్మల్ పద్దతిలో నాసా సరిచేసింది. రేడియేషన్ బెల్ట్ లలో పాడేన కెమెరాను తిరిగి పునరుద్ధరించింది. ఎంతో విజయవంతంగా సాగిన ఈ పునరుద్ధరణ ప్రక్రియ గురించి నాసా శాస్త్రవేత్తలు.. నాష్విల్ లో జరిగిన ఐఈఈఈ న్యూక్లియల్ అండ్ స్పేస్ రేడియేషన్ ఎఫెక్ట్స్ కాన్ఫరెన్స్ లో వివరించారు. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
సమస్య ఎలా వచ్చిందంటే?
నాసా చెప్పిన వివరాల ప్రకారం..జూనో అంతరిక్ష నౌకలోని రేడియేషన్ రక్షిత లోపలి భాగం వెలుపల జూనో కామ్ ఉంది. ఇది ఒక కలర్ విజిబుల్ లైట్ కెమెరాగా పనిచేస్తూ బృహస్పతి చిత్రాలను తీసి నాసాకు అందిస్తోంది. అయితే ఈ కెమెరా తొలి 8 కక్ష్యల వరకు మాత్రమే పనిచేస్తుందని శాస్త్రవేత్తలు తొలుత భావించారు. కానీ అనూహ్యంగా 34 కక్ష్యల వరకూ స్పష్టమైన చిత్రాలను అందిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే బ్రహస్పతి నుంచి వెలువడే రేడియేషన్ కారణంగా ఆ తర్వాత నుంచి అది అందించే చిత్రాల్లో నాణ్యత తగ్గుతూ వచ్చిందని నాసా తెలిపింది. 47వ కక్ష్య నాటికి చిత్రాలు అస్పష్టంగా మారాయని.. 55వ కక్ష్యలోకి వచ్చేసరికి చిత్రాలు దాదాపుగా చదవలేని స్థితిలోకి చేరుకున్నాయని తెలిపింది.
ఎలా పరిష్కరించారంటే?
జూనో కామ్ లో తలెత్తిన సమస్యను ఎలాగైన పరిష్కరించాలని నాసా శాస్త్రవేత్తలు నిర్ణయించారు. కెమెరాలోని వోల్టేజ్ రెగ్యులేటర్ లో సమస్య ఉన్నట్లు ఇంజనీర్లు గుర్తించారు. ఉపగ్రహం వద్దకు వ్యక్తిని పంపించి రిపేర్ చేయడం అసాధ్యం కాబట్టి.. నాసా కేంద్రం నుంచే ‘అన్నీలింగ్’ (Annealing) అనే ప్రక్రియను ఉపయోగించి పునరుద్దరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సమస్య తలెత్తిన కెమెరాను 77 డిగ్రీల ఫారెన్ హీట్ (25 డిగ్రీల సెల్సియస్) వరకూ వేడి చేసి ఆపై నెమ్మదిగా చల్లబరిచారు. ఈ ప్రక్రియ సిలికాన్ లోపాలను తగ్గిస్తుందని భావించారు. తొలి ప్రయత్నంలో కొన్ని కక్ష్యల వరకూ స్ఫష్టమైన చిత్రాలు వచ్చాయని.. 55వ కక్ష్యలోకి రాగానే మళ్లీ సమస్యలు మెుదలయ్యాయని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో ఇంజనీర్లు హీటర్ ను గరిష్ట స్థాయికి పెంచి అన్నీలింగ్ చేశారని ఇది మళ్లీ విజయవంతమైందని అన్నారు. డిసెంబర్ 30, 2023లో జూనో.. ఐయో ఉపరితలం నుండి 930 మైళ్ల (1,500 కిలోమీటర్లు) దూరంలో ఉన్నప్పుడు స్పష్టమైన చిత్రాలను తీసిందని.. అందులో ఐయో ఉత్తర ధ్రువ ప్రాంతంలో సల్ఫర్ డై ఆక్సైడ్ తో కప్పబడిన పర్వతాలు, అగ్నిపర్వతాలను కొత్తగా గుర్తించామని అన్నారు.
Also Read: Vijay and Rashmika: బిగ్ షాక్.. పెళ్లి చేసుకున్న రష్మిక, విజయ్ దేవరకొండ? ఫోటోలు వైరల్
భవిష్యత్ మిషన్లపై ప్రభావం
అన్నీలింగ్ టెక్నిక్ ను ఉపయోగించి జూనో అంతరిక్ష నౌకకు చెందిన ఇతర పరికరాలు, సబ్ సిస్టమ్ లను కూడా పరీక్షించినట్లు నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. అంతరిక్షంలో ఉండే కఠిన పరిస్థితులను ఉపగ్రహాలు ఎక్కువ కాలం తట్టుకునేలా చేయడంలో అన్నీలింగ్ టెక్నిక్ ఆదర్శంగా నిలవబోతున్నట్లు నాసా శాస్త్రవేత్తలు చెప్పారు. ‘జూనో మనకు రేడియేషన్‌ను తట్టుకునే ఉపగ్రహాలను ఎలా తయారు చేయాలో, నిర్వహించాలో నేర్పుతోంది; అని జూనో ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ స్కాట్ బోల్టన్ తెలిపారు. ఈ టెక్నిక్ భవిష్యత్ మిషన్‌లకు, ముఖ్యంగా భూమి చుట్టూ ఉన్న ఉపగ్రహాలు, ఇతర నాసా మిషన్‌లకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే 74వ కక్ష్యనాటికి జూనో కామ్ మళ్లీ ఇమేజ్ నాయిస్ కనిపించిందని.. వాటిని పరిష్కరించేందుకు తాము కృషి చేస్తున్నట్లు వివరించారు.