Human Bridge: పంజాబ్ లో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కొన్ని చోట్ల వరద ప్రవాహానికి రోడ్లు కొట్టుకుపోయిన పరిస్థితులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ గ్రామంలో రోడ్డు కొట్టుకుపోగా.. స్కూలుకు వెళ్లిన విద్యార్థులు రోడ్డుకు అవతల చిక్కుకుపోయారు. అయితే వారిని ఇద్దరు వ్యక్తులు.. తోటి గ్రామస్థుల సాయంతో క్షేమంగా రోడ్డు దాటించిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి.
వివరాల్లోకి వెళ్తే..
పంజాబ్ లోని మోగా జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు మల్లెయన్ గ్రామంలోని ఓ రోడ్డు 5 అడుగులు మేర కొట్టుకుపోయింది. మోకాళ్ల లోతు వరకూ గుంత ఏర్పడటంతో దాని గుండా నీరు వేగంగా ప్రవహించడం మెుదలైంది. అయితే ఉదయాన్నే ఆ మార్గం గుండా స్కూలుకు వెళ్లిన విద్యార్థులు.. ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో ఇళ్లకు తిరుగుముఖం పట్టారు. ఈ క్రమంలో రోడ్డుకు అడ్డంగా వేగంగా ప్రవహిస్తున్న నీరు చూసి దాదాపు 35 మంది విద్యార్థులు అవాక్కయ్యారు. రోడ్డు దాటుకొని ఇంటికి ఎలా వెళ్లాలా అని మదనపడిపోయారు.
విద్యార్థులకు సాయం
రోడ్డుకు అవతల నిలబడి ఏం చేయాలో తోచని స్థితిలో ఉండిపోయిన విద్యార్థులను చూసి సుఖ్బిందర్, గగన్ దీప్ అనే ఇద్దరు వ్యక్తులు చలించిపోయారు. రోడ్డుకు అవతల ఉన్న వారిని క్షేమంగా ఇటు వైపునకు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. రోడ్డుకు అడ్డంగా ప్రవహిస్తున్న నీటిలోకి దిగి.. మానవ నిర్మిత బ్రిడ్జిలాగా ఏర్పడ్డారు. తమ వీపు మీద నుంచి విద్యార్థులను సురక్షితంగా అవతలి వైపునకు తరలించారు. మిగిలిన గ్రామస్తులు ఆ పిల్లలను వారిపైకి ఎక్కించి, దించడంలో సాయం చేశారు. వారితో పాటు మరికొందరు పెద్దవారిని సైతం క్షేమంగా రోడ్డును దాటించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read: Hulk Hogan Dies: లెజెండరీ రెజ్లర్ కన్నుమూత.. ఆయన గురించి ఈ విషయాలు తెలుసా?
యువకులపై ప్రశంసలు
ఇద్దరు యువకులు చూపించిన ధైర్య సాహసాలపై గ్రామస్థులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కోతకు గురైన రోడ్డు మల్లెయన్, రసూల్ పూర్ గ్రామాలను కలుపుతుందని గ్రామ పంచాయతీ సభ్యుడు ఇంగ్రేస్ సింగ్ తెలిపారు. యువకులు తమ సాహసంతో 30 మంది విద్యార్థులు, 10 మంది ఇతర వ్యక్తులను కాపాడారని ఆయన తెలిపారు. గగన్ దీప్ తన మేనల్లుడ్ని స్కూల్ నుంచి తీసుకువచ్చేందుకు వచ్చారని.. సుఖ్బిందర్ ఇచ్చిన సలహాతో రంగంలోకి దిగాడని పేర్కొన్నారు. అయితే కోతకు గురైన రోడ్డును మరమ్మత్తులు చేసేందుకు అధికారులు ఇప్పటివరకూ చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు పనికి, పిల్లలు పాఠశాలలకు వెళ్లేందుకు ఏకైక మార్గం అదే అయినందున త్వరితగతిన రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
2 Men Form Human Bridge, Help 35 Children Cross Flooded Field In Punjab https://t.co/AaORe2URhT pic.twitter.com/HuCOA7czSU
— NDTV (@ndtv) July 24, 2025