Hulk Hogan Dies: ప్రముఖ రెజ్లింగ్ ఐకాన్.. హల్క్ హోగన్ కన్నుమూశారు. ఫ్లోరిడాలోని ఆయన నివాసంలో గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. క్లియర్ వాటర్ లోని నివాసంలో 71 ఏళ్ల హోగన్ తొలుత అస్వస్థతకు గురికాగా.. వైద్య బృందాలు హుటాహుటీన అక్కడకు చేరుకున్నాయి. అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించగా.. మార్గం మధ్యలోనే హల్క్ హోగన్ ప్రాణాలు విడిచినట్లు వైద్య బృందాలు నిర్ధారించాయి. ఈ వార్తతో రెజ్లింగ్ లోకం శోక సంద్రంలో మునిగిపోయింది. ఆయన అభిమానులు.. కన్నీరు మున్నీరు అవుతున్నారు.
డబ్ల్యూడబ్ల్యూఈ స్పందన ఇదే
హల్క్ హోగన్.. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (WWE) రెజ్లర్ గా యావత్ ప్రపంచాన్ని ఆకర్షించారు. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయన మరణవార్తపై.. డబ్ల్యూడబ్ల్యూఈ స్పందించింది. ‘డబ్ల్యూడబ్ల్యూఈ హాల్ ఆఫ్ ఫేమర్ హల్క్ మరణవార్త తీవ్ర విచారకరం. పాప్ సంస్కృతిలో అత్యంత గుర్తింపు పొందిన వ్యక్తులలో హోగన్ ఒకరు. 1980ల్లో డబ్ల్యూడబ్ల్యూఈ ప్రపంచ వ్యాప్త గుర్తింపు సాధించడంలో ఆయన సహాయపడ్డారు. హోగన్ కుటుంబం, స్నేహితులు, అభిమానులకు డబ్ల్యూడబ్ల్యూఈ తరుపున సంతాపం తెలియజేస్తున్నాం’ అంటూ ఎక్స్ (Twitter) ఖాతాలో పోస్ట్ పెట్టింది.
WWE is saddened to learn WWE Hall of Famer Hulk Hogan has passed away.
One of pop culture’s most recognizable figures, Hogan helped WWE achieve global recognition in the 1980s.
WWE extends its condolences to Hogan’s family, friends, and fans.
— WWE (@WWE) July 24, 2025
హోగన్స్ రెజ్లింగ్ కెరీర్
హల్క్ హోగన్ వ్యక్తిగత విషయాలకు వస్తే ఆయన అసలు పేరు టెర్రీ బోలియా. అమెరికాలోని జార్జియాలో 1953 ఆగస్టు 11న జన్మించారు. హోగన్.. 1977లో తన ప్రొఫెషనల్ రెజ్లింగ్ కెరీర్‌ను ప్రారంభించారు. 1980లలో WWF (ప్రస్తుతం WWE)లో చేరిన తర్వాత ఆయన ‘హల్కమేనియా’ పేరుతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఆయన ఆరు సార్లు WWE ఛాంపియన్‌గా.. ఆరు సార్లు WCW వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌గా నిలిచారు. 1987లో రెసిల్‌మేనియా – IIIలో ఆండ్రీ ది జయంట్‌ను బాడీ స్లామ్ చేసిన సంఘటన రెజ్లింగ్ చరిత్రలో అత్యంత గుర్తుండిపోయే క్షణాలలో ఒకటిగా నిలిచింది.
Also Read: PM Modi Record: చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ.. ఇందిరా గాంధీ రికార్డ్ బద్దలు!
సినిమాలు.. వివాదాలు
హోగన్.. రెజ్లింగ్ తో పాటు హాలీవుడ్‌లో కూడా తన ప్రభావం చూపించారు. ‘రాకీ III’ (1982) చిత్రంలో థండర్‌లిప్స్ పాత్రలో అదరగొట్టాడు. అలాగే ‘నో హోల్డ్స్ బార్డ్’, ‘మిస్టర్ నానీ’, ‘హోగన్ నోస్ బెస్ట్’ వంటి రియాలిటీ షోలలోనూ ఆయన కనిపించాడు. మరోవైపు హోగన్స్ జీవితంలో వివాదాలు కూడా ఉన్నాయి. 2015లో జాతి వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేసినందుకు WWE ఆయనను తాత్కాలికంగా తొలగించింది. కానీ 2018లో మళ్లీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చేర్చింది. 2024లో రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు మద్దతుగా హోగన్ మాట్లాడారు.