Delhi Woman: సాధారణంగా ఏదైనా ఒక కంపెనీ ఉద్యోగుల నియామకంలో అనుభవాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. ఉద్యోగానికి వచ్చిన వ్యక్తి.. వృత్తి నైపుణ్యాలు, పని పట్ల అంకింత భావం, సమర్థతను ఆధారంగా అతడికి ఉద్యోగం ఇవ్వడమా? లేదా? అన్నది సదరు కంపెనీ నిర్వాహకులు నిర్ణయం తీసుకుంటారు. అయితే తాజాగా ఓ మహిళ విషయంలో ఇలా జరగలేదు. మంచి నైపుణ్యాలు ఉన్నప్పటికీ ఆమెను ఓ కంపెనీ రిజెక్ట్ చేసింది. ఇందుకు గల కారణాలను వివరిస్తూ ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్.. ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
అసలేం జరిగిందంటే?
ఢిల్లీకి చెందిన ప్రగ్యా అనే మహిళ.. ఓ కంపెనీలో ఇంటర్వ్యూకు వెళ్లింది. అక్కడ తనకు ఎదురైన అనుభవాన్ని లింక్‌డ్ ఇన్ (Linkedin) వేదికగా పంచుకుంది. తాను చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ జాబ్ ఇంటర్వ్యూ కోసం వెళ్లానని సోషల్ మీడియా పోస్ట్ లో ఆమె తెలిపింది. సదరు కంపెనీకి చెందిన కన్జ్యూమర్ బ్రాండ్ ప్రమోటర్ తో 14 నిమిషాల పాటు ఇంటర్వ్యూ జరిగినట్లు చెప్పింది. తొలి 11 నిమిషాలు జాబ్ కెరీర్ గురించి అడిగారని.. మిగిలిన 3 నిమిషాలు వ్యక్తిగతమైన జీవితానికి సంబంధించి ప్రశ్నలు ఎదురయ్యాయని ప్రగ్యా చెప్పుకొచ్చారు.
వ్యక్తిగత జీవితంపై ప్రశ్నలు
వృత్తిపరమైన విజయాల గురించి అడిగే బదులు.. తన వ్యక్తిగత జీవితంపై బ్రాండ్ ప్రమోటర్ ఆసక్తి చూపించినట్లు ప్రగ్యా అన్నారు. ‘మీ కుటుంబ సభ్యులు ఎంత మంది? పిల్లలు ఉన్నారా? వారి వయస్సులు ఎంత? ఏ పాఠశాలలో చదువుకుంటున్నారు? మీరు లేనప్పుడు వారిని ఎవరు చూసుకుంటారు? మీ భర్త ఏ ఉద్యోగం చేస్తారు? జాబ్ వస్తే ఆఫీసుకు రావడానికి ఎలా ప్లాన్ చేసుకుంటారు?’ వంటి ప్రశ్నలు ఎదురైనట్లు ప్రగ్యా చెప్పుకొచ్చారు. ఇంటర్వ్యూ జరిగిన తీరుబట్టి తనకు ఉద్యోగం రాదని ఆ క్షణంలోనే అర్థమైపోయిందని ప్రగ్యా పేర్కొన్నారు.
Also Read: Rangareddy Murder Case: రాష్ట్రంలో ఘోరం.. ఫేమస్ కావాలని అక్కను చంపిన తమ్ముడు!
హెచ్‌ఆర్ ఏం చెప్పిందంటే?
మరుసటి రోజు సదరు కంపెనీ హెచ్‌ఆర్ తనను సంప్రదించినట్లు ప్రగ్యా తెలిపారు. మీకు ఉద్యోగం ఇవ్వలేమని చెప్పారని పేర్కొన్నారు. ఎందుకని ప్రశ్నించగా.. ‘మీకు చాలా చిన్న పిల్లలు ఉన్నారు’ అంటూ హెచ్‌ఆర్ చెప్పారని ప్రగ్యా చెప్పుకొచ్చారు. తనకు హెచ్ ఆర్ కు మధ్య జరిగిన మెసేజ్ సంభాషణను సైతం ఆమె లింక్‌డ్ ఇన్ లో పంచుకున్నారు. అయితే ఇదే తరహా అనుభవం తన స్నేహితులకు సైతం ఎదురైనట్లు ప్రగ్యా తెలిపారు. ‘నా ఫ్రెండ్స్‌లో చాలా మందికి ఇలాగే జరిగింది. వారి ప్రమోషన్లను కూడా పట్టించుకోలేదు. కనీసం జీతాలు కూడా పెంచలేదు’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మెుత్తంగా ప్రగ్యా పెట్టిన పోస్ట్.. కార్పోరేట్ సంస్థల్లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యను మరోమారు తెరపైకి తెచ్చినట్లైంది. లింక్‌డ్ ఇన్ యూజర్లు ప్రగ్యాకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.