Air Pollution: దేశ రాజధాని ఢిల్లీలో ఈ రోజు ఉదయం మళ్లీ దట్టమైన పొగమంచు, దుమ్ముతో నిండిపోయింది. నగర గాలి నాణ్యత తీవ్రంగా పడిపోగా, ఏక్యూఐ (Air Quality Index) చాలా దారుణమైన కేటగిరీలోకి చేరింది. ఏక్యూఐ స్థితి భయంకరంగా ఉంది. ఎయిర్ క్వాలిటీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ (EWS) ప్రకారం, ఉదయం 9 గంటలకు ఢిల్లీలో మొత్తం ఏక్యూఐ 316గా నమోదైంది, ఇది అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉంది. మరోవైపు, AQI.in అనే ప్రైవేట్ ఫోరకాస్టర్ 242గా రికార్డు చేసినా, అది కూడా చాలా దారుణమైన కేటగిరీకే చెందింది. ఆ సంస్థ తెలిపినదాని ప్రకారం, ప్రస్తుతం ఢిల్లీలో గాలి పీల్చడం అంటే రోజుకు 7.8 సిగరెట్లు తాగినంత హానికరం అని వెల్లడించింది.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రమాణాల కంటే 11 రెట్లు ఎక్కువ కాలుష్యం నమోదైంది. ఈ లెక్కలు PM2.5 స్థాయుల ఆధారంగా లెక్కించబడ్డాయి. ఢిల్లీలో సోమవారం PM2.5 స్థాయి 168 µg/m³గా నమోదైంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సిఫారసు చేసిన పరిమితి (15 µg/m³) కంటే 11 రెట్లు ఎక్కువ. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం, దీర్ఘకాలికంగా ఇలాంటి కాలుష్యానికి గురైతే స్ట్రోక్, ఊపిరితిత్తుల క్యాన్సర్, COPD వంటి శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంది.
అత్యంత కాలుష్యం ఉన్న ప్రాంతాలు..
రాజధానిలో కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది:
హోలంబీ ఖుర్ద్ గ్రామం – 561
గౌతంపురి – 408
ముస్తఫాబాద్ – 380
మహారం మొహల్లా – 344
షహదరా – 312
ఈ ప్రాంతాల నివాసితులు కళ్ల మండడం, గొంతు రాపిడి, శ్వాసలో ఇబ్బంది వంటి లక్షణాలతో బాధపడుతున్నట్లు తెలిపారు.
పక్కనగరాలు కూడా కాలుష్యంలో ఊపిరాడక అవస్థలు
కేవలం ఢిల్లీ మాత్రమే కాదు, ఎన్సీఆర్ ప్రాంతమంతా ఈ విషగాలిలో కమ్ముకుంది.
గాజియాబాద్ – 360
గ్రేటర్ నోయిడా – 306
నోయిడా – 289
గురుగ్రామ్ – 201
ఈ నగరాలన్నీ కూడా “అనారోగ్యకర గాలి” కేటగిరీలోకి చేరాయి.
Also Read: Gadwal Crime: పోలీసుల అదుపులో మోసాలకు పాల్పడుతున్న బంగారం వ్యాపారి.. మరో ఘటనలో బంగారం కోసం మహిళ హత్య
ఏక్యూఐ స్థాయి ఎలా ఉందంటే?
0–50: మంచి గాలి
51–100: తృప్తికరంగా
101–200: మోస్తరు కాలుష్యం
201–300: దారుణం
301–400: చాలా దారుణం
401–500: తీవ్రమైన ప్రమాదం
300కు మించి ఉన్న స్థాయిల్లో గాలి ఆరోగ్యవంతులకే చాలా ప్రమాదకరం, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, శ్వాస సమస్యలున్న వారికి మరింత హానికరమని చెప్పాలి.
