Crematorium reel: ఈ మధ్యకాలంలో వైరల్ కావాలనే కోరిక కొందరిలో ఒక వ్యసనంలా మారిపోయింది. సోషల్ మీడియాలో గుర్తింపు కోసం తెగ ఆరాటపడుతున్నారు. జీవితాలు, ప్రాణాలను సైతం రిస్కులో పెడుతున్నవారు చాలామందే కనిపిస్తున్నారు. పబ్లిసిటీ కోసం నానావిధాలుగా పాకులాడుతున్నారు. సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్, ఫాలోవర్స్ కోసం ఇదంతా చేస్తున్నారు. ఇలాంటివారి కోవకే చెందిన మరో యువతి వెలుగులోకి వచ్చింది. వ్యూస్ కోసం మరింత దిగజారిన సదరు యువతి శ్మశానవాటికలో శవం కాలుతుండగా (Crematorium reel) అక్కడ డ్యాన్స్ వేసి వీడియో రికార్డు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.
శ్మశానంలో శవం కాలుతుండగా…
వీడియోలో సదరు యువతి చీరకట్టులో కనిపించింది. ఆమె ఆనందంగా డ్యాన్స్ వేస్తుండగా, ఆమెకు బ్యాక్‌గ్రౌండ్‌లో శవం కాలుతోంది. రీల్స్ కోసమే చిత్రీకరించినట్టు వీడియోను చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది. సోనీకపూర్ (@ShoneeKapoor) అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటికే వేలాది మంది వీక్షించారు. చాలామంది నెటిజన్లు సదరు యువతిపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఈ చర్యను మృతి చెందిన వారికి, ఆ వ్యక్తి కుటుంబ సభ్యుల భావోద్వేగాలకు అవమానకరమైదని చాలామంది అభివర్ణిస్తున్నారు. రీల్స్ కోసం జనాలు సిగ్గు, శరం లేకుండా, ఎక్కడ ఉన్నామన్నది కూడా చూసుకోవడం లేదని, అర్థంపర్థం లేకుండా వ్యవహరిస్తున్నారని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో ట్రెండింగ్ కోసం ఎంతటి దిగజారుడు స్థాయికైనా వెళ్లడానికి సిద్ధంగా ఉన్న కొందరు యువతకు ఈ వీడియో ఒక ప్రతిబింబమని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానించారు. రీల్స్ కోసం మొదట్లో పెళ్లిళ్లు, పుట్టినరోజులు, షాపింగ్ మాల్స్, ప్రకృతి సుందర ప్రదేశాల్లో వీడియోలు తీసేవారని, కానీ ప్రస్తుతం శ్మశానాల్లోకి కూడా కెమెరాలు తీసుకెళుతున్నారని, ఈ పరిణామం చాలా బాధాకరమని ఓ వ్యక్తి వ్యాఖ్యానించాడు.
Read Also- Viral Polyandry: ఒకే స్త్రీని పెళ్లి చేసుకోవడంపై తొలిసారి స్పందించిన అన్నదమ్ముళ్లు
మానవత్వాన్ని విస్మరించడమే..
కాలుతున్న శవం ముందు డ్యాన్స్ చేసిన యువతిపై ఓ నెటిజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది కంటెంట్ క్రియేషన్ కాదని, మానవత్వాన్ని విస్మరించడానికి ఉదాహరణ అని ఓ నెటిజన్ మండిపడ్డాడు. మరికొందరైతే, సదరు యువతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమె సిగ్గుపడే విధంగా చర్యలు ఉండాలని, ఆ యువతిని పోలీసులకు అప్పగించాలంటూ కొందరు కామెంట్లు పెట్టారు. ఈ ఘటన నేటి సమాజంలో సోషల్ మీడియా కల్చర్‌కు అద్దం పడుతోందని నెటిజన్లు కొందరు పేర్కొన్నారు. వ్యూస్ కోసం ప్రదేశాల పట్ల గౌరవాన్ని మరచిపోతున్నారని మండిపడ్డారు. ఇది ఆందోళనకరమైన ట్రెండ్ అని, కట్టడి చేయాల్సిన అవసరం కూడా ఉందని కొందరు పేర్కొన్నారు.
కాగా, సోషల్ మీడియాలో గుర్తింపు పొందడం, ట్రెండింగ్ కావడం తాత్కాలికంగా ఆనందాన్ని కలిగించవచ్చు. కానీ, దీర్ఘకాలికంగా చూస్తే మానసిక సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రీల్స్ కోసం తీసే వీడియోల విషయంలో విచక్షణ ఉండాలని, లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని సూచనలు ఇచ్చారు.
Kuch bolunga to vivad ho jayega pic.twitter.com/4dHsPaIk7P
— ShoneeKapoor (@ShoneeKapoor) August 7, 2025
Read Also- COVID new variant: గుబులు పుట్టిస్తున్న కరోనా కొత్త వేరియెంట్.. లక్షణాలు ఇవే!