Bizarre Incident: సాంకేతిక సమస్యల కారణంగా విమానాలు ఆలస్యం కావడం ఇటీవల కాలంలో సర్వసాధారణంగా మారిపోయింది. అయితే తాజాగా ఓ ఇండిగో విమానం (Indigo Flight) మాత్రం.. ఎలాంటి టెక్నికల్ ఇష్యూ లేకుండానే నిలిచిపోయింది. గంటపాటు ప్రయాణికులు ఫ్లైట్ లోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. అయితే విమానం ఆగిపోవడానికి గల కారణం ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది.
మ్యాటర్ ఏంటంటే..
గుజరాత్ లోని సూరత్ నుంచి రాజస్థాన్ లోని జైపూర్ కు వెళ్లాల్సిన ఇండిగో విమానానికి ఊహించని సమస్య ఎదురైంది. ఇండిగో ఎయిర్ బస్ A320 ఎయిర్ క్రాఫ్ట్ (Airbus A320 aircraft) షెడ్యూల్ ప్రకారం సోమవారం సా.4.20 బయలుదేరాల్సి ఉంది. దీంతో ప్రయాణికులు చెప్పిన టైమ్ ప్రకారం.. ఫ్లైట్ లోకి వచ్చి కూర్చున్నారు. ఈ క్రమంలో ప్రయాణికుల బ్యాగులను ఫ్లైట్ లోని లగేజ్ రూమ్ లో పెట్టేందుకు సిబ్బంది యత్నించగా వారికి ఆశ్చర్యకర దృశ్యాలు కనిపించాయి. లగేజ్ రూమ్ డోర్ వద్ద పెద్ద సంఖ్యలో తేనెటీగల గుంపు వారికి దర్శనమిచ్చాయి.
Also Read: Viral Video: ఇదేం పైత్యం.. మామిడి పండ్ల కోసం.. ఇంత కక్కుర్తి అవసరమా?
పొగపెట్టినా.. వర్కౌట్ కాలేదు
అయితే తేనెటీగలను చెదరగొట్టేందుకు విమాన సిబ్బంది.. పొగపెట్టారు. అది వర్కౌట్ కాకపోగా.. సిబ్బందిని తేనేటీగలు గాయపరిచాయి. విమాన ప్రయాణానికి మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తుండటంతో ఎయిర్ పోర్ట్ సిబ్బంది.. వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది.. ఫైరింజన్లతో రన్ వే వద్దకు చేరుకున్నారు. లగేజీ తలుపులపై పైపులతో నీరు చల్లడంతో తేనెటీగలు చెల్లాచెదురయ్యాయి. విమానాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాయి. ఈ ప్రక్రియ అంతా ముగిసి ఫ్లైట్ బయలుదేరే సరికి సాయంత్రం 5.26 గంటలు అయ్యింది.