MM Keeravani: ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణి (MM Keeravani) ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి శివశక్తి దత్తా (92) కన్నుమూశారు. మణికొండలోని నివాసంలో సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. రాజమౌళి తండ్రి, ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్‌కు సోదరుడు అయిన శివశక్తి.. పలు చిత్రాలకు పాటలు రాశారు.
ఫ్యామిలీ నేపథ్యం
శివ శక్తి దత్తా (Siva Shakthi Datta) ఫ్యామిలీ విషయానికి వస్తే ఆయనకు ముగ్గురు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు కీరవాణి కాగా, రెండో కుమారుడు కల్యాణి మాలిక్ (Kalyan Malik) సైతం పలు చిత్రాలకు సంగీతం అందించారు. మూడో కుమారుడు శివశ్రీ కంచి.. హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అమృతం సీరియల్, సై, మర్యాదరామన్న తదితర చిత్రాల్లో అతడు పోషించిన పాత్రకు మంచి పేరు వచ్చింది. అలాగే శివదత్తాకు అన్న, అక్కతో పాటు నలుగురు తమ్ముళ్లు ఉన్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. శివదత్తాకు తమ్ముడు అవుతారు. ప్రముఖ గాయని సంగీత దర్శకురాలు ఎం.ఎం. శ్రీలేఖకు శివశక్తి దత్తా పెద్దనాన్న అవుతారు.
కళలు, సంగీతంపై పట్టు
శివశక్తి దత్తా వ్యక్తిగత విషయాలకు వస్తే.. ఆయన అసలు పేరు కోడూరి సుబ్బారావు. రాజమండ్రి సమీపంలోని కొవ్వూరు ప్రాంతంలో 1932 అక్టోబరు 8న శివ శక్తి దత్తా జన్మించారు. కళలపై ఆసక్తితో ముంబయిలోని ఓ ఆర్ట్స్ కాలేజీలో శివశక్తి దత్తా చేరారు. అనంతరం సంగీంతంపై ఆసక్తితో గిటార్, సితార్ హార్మోనియం నేర్చుకొని వాటిపై పట్టు సాధించారు. అంతేకాదు కమలేశ్ అనే కలం పేరుతో చిత్రకారుడిగానూ ఆయన పనిచేశారు.
Also Read: Srikalahasti: శ్రీకాళహస్తిలో గ్యాంగ్ వార్.. నడిరోడ్డుపై చచ్చేలా కొట్టుకున్న రెండు గ్రూపులు!
సూపర్ హిట్ సాంగ్స్‌కు రచయిత
ఈ క్రమంలో సోదరుడు విజయేంద్ర ప్రసాద్ సాయంతో శివశక్తి దత్తా.. సినీ రంగంలోకి ప్రవేశించారు. 1988లో వచ్చిన జానకి రాముడు సినిమాకు ఆయన స్క్రీన్ రైటర్ గా పనిచేశారు. ఆ సినిమా సక్సెస్ తో శివశక్తి దత్తాకు ఇండస్ట్రీలో మంచిపేరు వచ్చింది. ఆ తర్వాత పాటల రచయితగా మారిన శివశక్తి దత్తా.. రాజమౌళి సినిమాల్లో పలు సూపర్ హిట్ చిత్రాలకు లిరిక్స్ అందించారు. రాజన్న (అమ్మా అవని), ఛత్రపతి (మన్నేలా తింటివిరా), సై (నల్లా నల్లాని కళ్ల), ఆర్ఆర్ఆర్ (రామం రాఘవన్), బాహుబలి (మమతల తల్లి, ధీవర), బాహుబలి 2 (సాహోరే బాహుబలి) చిత్రాలకు ఆయన పాటల రచయితగా వర్క్ చేశారు.