Viral News: సమాజంలో లైంగిక నేరాలు అంతకంతకూ పెరిగిపోతుండటం తీవ్ర ఆందోళనకు (Viral News) గురిచేస్తోంది. కఠిన చట్టాలు తీసుకొస్తున్నా అత్యాచారాల సంఖ్య నానాటికీ పెరుగుతుండడం తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. వ్యక్తుల ఆలోచనా విధానం, నియంత్రణ లోపం, సినిమాలు, సోషల్ మీడియా కంటెంట్ ప్రభావం, చట్టాల అమలులో లోపాలు ఇలా చాలా కారణాలు ఇందుకు మూలమవుతున్నాయి. పోలీసులు, ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అత్యాచారాల నియంత్రణలో పురోగతి కనిపించడం లేదు. ఇందుకు పరాకాష్ట లాంటి ఘటన ఒకటి బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది.
బెంగళూరులోని ఒక కాలేజీ విద్యార్థినిపై దారుణమైన లైంగిక దాడి జరిగింది. ఇద్దరు లెక్చరర్లు, వారి స్నేహితుడు విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇప్పటికే పలు మార్లు లైంగిక దాడికి పాల్పడిన వారి ముగ్గురిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ ముగ్గురూ బాధిత యువతిని బ్లాక్‌మెయిల్ కూడా చేశారు. నిందితుల పేర్లు నరేంద్ర (ఫిజిక్స్ లెక్చరర్), సందీప్ (బయాలజీ లెక్చరర్), అనూప్ (లెక్చరర్ల ఫ్రెండ్) అని పోలీసులు వెల్లడించారు. నిందితులు ముగ్గురూ ఒకే ప్రైవేట్ కాలేజీలో పనిచేస్తుండగా, బాధిత విద్యార్థిని కూడా అదే కాలేజీలో చదువుకుంటోంది.
Read Also- Shubhanshu Shukla: స్ప్లాష్‌డౌన్ సక్సెస్.. భూమికి తిరిగొచ్చిన శుభాన్షు శుక్లా
మొదలుపెట్టింది ఫిజిక్స్ లెక్చరర్
బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కీలక విషయాలు బయటపడ్డాయి. ఫిజిక్స్ లెక్చరర్ నరేంద్ర స్టడీ నోట్స్ ఇస్తానంటూ తొలుత తనను సంప్రదించాడని, తరచూ మెసేజ్‌లు పంపిస్తూ స్నేహంగా మెలగడం ప్రారంభించాడని వివరించింది. ఆ తర్వాత నగరంలోనే ఉన్న నిందితుల్లో ఒకరైన అనూప్ గదికి రావాలని పిలిచాడని, అక్కడికి వెళ్లిన తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని వివరించింది. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించినట్టు ఫిర్యాదులో బాధితురాలు వాపోయింది. కొన్ని రోజుల తర్వాత సందీప్ (బయాలజీ లెక్చరర్) కూడా వేధింపులు మొదలుపెట్టాడని, తాను నిరాకరించడంతో నరేంద్రతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు తన వద్ద ఉన్నాయంటూ బెదిరించి, అతడు కూడా అనూప్ గదిలోనే లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలిపింది. ఆ తర్వాత అనూప్ కూడా, ‘ నువ్వు నా గదిలోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజీ చూపించి బెదిరించి, లైంగిక దాడికి పాల్పడ్డాడు’ అని బాధితురాలు తనకు ఎదురైన పరిస్థితిని వివరించింది.
Read Also- Nimisha Priya: యెమెన్‌లో భారతీయ నర్సుకు మరణశిక్షలో కీలక పరిణామం
తల్లిదండ్రులకు చెప్పిన బాధితురాలు
ముగ్గురు వ్యక్తుల చేతిలో అఘాయిత్యానికి బాధితురాలు మానసికంగా తీవ్రంగా దెబ్బతిన్నది. ఎవరికీ చెప్పకుండా మనసులోనే బాధను దాచుకుంది. అయితే, తన తల్లిదండ్రులు బెంగళూరుకు వచ్చినప్పుడు వారితో జరిగిన విషయాల్ని వివరంగా వెల్లడించింది. తల్లిదండ్రులు వెంటనే కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్‌ను సంప్రదించారు. ఆ తర్వాత మరథహల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా నిందితులు నరేంద్ర, సందీప్, అనూప్‌లను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. దారుణమైన ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
Read Also- Wife And Husband: వామ్మో తెలంగాణలో ఘోరం.. భార్యభర్తల పంచాయితీలో ఇద్దరు దారుణ హత్య