Shubhanshu Shukla: భారతదేశపు అంతరిక్ష పరిశోధనలో చారిత్రాత్మక ఘట్టం నమోదయింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 18 రోజులపాటు వివిధ రకాల పరిశోధనలు చేసిన భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) మంగళవారం సురక్షితంగా, విజయవంతంగా భూమికి తిరిగి వచ్చారు. గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా, మరో ముగ్గురు వ్యోమగాములతో సోమవారం సాయంత్రం బయలుదేరిన స్పేస్‌ఎక్స్ క్రూ క్యాప్సూల్ ‘గ్రేస్’, భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 3:01 గంటల సమయంలో కాలిఫోర్నియాలోని శాన్ డియెగో తీరంలో విజయవంతంగా ల్యాండింగ్ అయింది. డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ నుంచి డ్రోగ్ ప్యారాచూట్లు తెరుచుకున్న కొన్ని క్షణాల్లో క్రూ క్యాప్సూల్ ‘గ్రేస్’ సముద్రంలో సురక్షితంగా స్ప్లాష్ డౌన్ అయింది. దీంతో, ఐఎస్ఎస్‌లో పరిశోధనలు చేసి భారత మొట్టమొదటి అంతరిక్షయాత్రికుడిగా గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా ఘనత సాధించాయి. శుభాన్షు శుక్లా సురక్షితంగా భూమికి చేరుకోవడంతో భారతదేశంలో ఆనందాలు వెల్లివిరిశాయి. యాక్సియమ్ సంస్థ చేపట్టిన ‘ఏక్స్-4’ మిషన్‌లో వ్యోమగాములు నలుగురూ ప్రయోగాలు చేపట్టారు.
తీవ్ర వేడిని తట్టుకుంటూ..
స్పేస్‌ఎక్స్ క్రూ క్యాప్సూల్ ‘గ్రేస్’ భూవాతావరణంలో ప్రవేశించేటప్పుడు గంటకు 27,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. తీవ్ర వేడిని తట్టుకుంటూ ప్రయాణించి, వేగం తగ్గింపు ప్రక్రియలో భాగంగా ప్యారాచూట్లు సాఫీగా తెరుచుకోవడంతో క్యాపుల్స్ సముద్రపు నీటిలో మృదువుగా ల్యాండింగ్ అయింది. దీంతో, 1984లో రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ భారతీయుడిగా, ఐఎస్ఎస్‌లో కక్ష్యలోకి వెళ్లిన మొట్టమొదటి భారతీయుడిగా ఘనత సాధించారు.
Read Also- New York Floods: ఫ్లాష్ ఫ్లడ్స్.. ఈశాన్య అమెరికా అతలాకుతలం
యాక్సియమ్-4 మిషన్ పూర్తిగా కమర్షియల్ ప్రాజెక్ట్. పలు దేశాలు సహకారంతో చేపట్టాయి. అయినప్పటికీ భారత్ చేపట్టనున్న గగనయాన్ మిషన్‌లో ఇది చాలా కీలకమైనది. శుక్లా రోదసియానంలో జీవశాస్త్రం, మెటీరియల్స్ సైన్స్, కృత్రిమ మేధస్సు వంటి రంగాల్లో అనేక ప్రయోగాలు చేపట్టారు. స్ప్రౌర్ట్స్ ప్రాజెక్ట్ పేరుతో శూన్య గురుత్వాకర్షణలో మొక్కల ఎదుగుదలపై పరిశోధన చేశారు. భవిష్యత్తులో అంతరిక్ష వ్యవసాయం దిశగా కీలకంగా మారనుంది. అంతరిక్షంలో మనిషి కణాల ఆరోగ్యం, కండరాలతో పాటు రోబోటిక్స్ వంటి అంశాలపై కూడా కీలక ప్రయోగాలు చేశారు. భవిష్యత్తు అంతరిక్ష మిషన్లు, భూమిపై శాస్త్రీయ పరిశోధనలకు ఈ ప్రయోగాలు ఉపయోగపడనున్నాయి.
ఈ మిషన్ ఇస్రోకు (ISRO) ఎంతో కీలకమైనది. అందుకే, ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా రూ.550 కోట్లు ఖర్చు చేసింది. ఈ మిషన్ ద్వారా మైక్రోగ్రావిటీ పరిస్థితులు, స్పేస్‌ఫ్లైట్ ఆపరేషన్స్, ఆరోగ్య పరీక్షలు, మానసికంగా భద్రత వంటి అనేక అంశాలపై ఇస్రో శాస్త్రవేత్తలు, డాక్టర్లు, ఇంజనీర్లకు ప్రాక్టికల్ అవగాహన లభించింది. కాగా, శుభాన్షు శుక్లా క్యాప్సుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. భూమి గురుత్వాకర్షణ శక్తికి ఆయన తిరిగి అలవాటు పడేందుకు ఒక వారంపాటు సమయం పడుతుంది. ఇందుకోసం ఆయనకు పునరావాస కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత ఆయన భారత్‌కు చేరుకునే షెడ్యూల్ ఖరారవుతుంది.
హార్ధిక స్వాగతం: ప్రధాని మోదీ
శుభాన్షు శుక్లా విజయవంతంగా రోదసి యాత్ర పూర్తి చేసుకొని భూమికి చేరుకోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన, ‘‘గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా భూమికి విజయవంతంగా తిరిగివచ్చిన సందర్భంలో, దేశ ప్రజలతో కలిసి నేను కూడా ఆయనకు హృదయపూర్వక స్వాగతం చెబుతున్నారు. అంకితభావం, ధైర్యంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన భారతదేశపు తొలి వ్యోమగామిగా, కోట్లాది మంది భారతీయుల కలలకు ప్రేరణ, స్ఫూర్తినిచ్చారు. మన దేశం చేపట్టబోయే మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగనయాన్’ దిశగా మరో కీలక మైలురాయి’’ అని మోదీ పేర్కొన్నారు.