Wife And Husband: తెలంగాణలో ఘోరాతి ఘోరమైన ఘటన జరిగింది. ఇద్దరు యువకులను అతి కిరాతంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. ఇప్పుడీ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్నది. పూర్తి వివరాల్లోకెళితే.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లిలో భార్యాభర్తల పంచాయితీ జరుగుతోంది. పెద్దమనుషులు కూర్చొని పంచాయితీ చేస్తుండగా అనుకోకుండా ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. మాటామాట పెరిగి వివాదం కాస్త ముదిరింది. దీంతో ఇరువర్గీయులు కత్తులతో దాడులకు తెగబడేంత దాకా వెళ్లింది. ఈ కత్తుల దాడిలో మోటం మల్లేశ్, గాండ్ల గణేష్ అనే యువకులకు తీవ్రంగా గాయపడి, రక్తస్రావం కావటంతో స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలోనే మృతిచెందారు. గణేష్ పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌కు చెందిన యువకుడు కాగా, మల్లేష్ ఓదెలకు చెందిన యువకుడు.
Read Also- Dheeraj Kumar: బ్రేకింగ్.. ప్రముఖ నటుడు ధీరజ్ కుమార్ మృతి
ముగ్గురి పరిస్థితి విషమం
ఈ కత్తుల దాడిలో మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని అంబులెన్సులో స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మధునయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ ఆసుపత్రికి కుటుంబీకులు తరలించారు. అయితే అమ్మాయి వర్గం సుపారీ ముఠాను తీసుకొచ్చిందని యువకుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ దాడి అనంతరం నిందితులు అక్కడ్నుంచి పరారయ్యారు. ఘర్షణ తర్వాత అబ్బాయి వర్గం, పెద్దమనుషులు అక్కడే ఉన్నప్పటికీ, అమ్మాయి.. వారి తరఫున మనుషులంతా కనిపించకుండా పోవడంతో ఈ వాదనలకు మరింత బలం చేకూరినట్లు అయ్యింది. అయితే అమ్మాయి తరఫు వారిని అస్సలు వదిలిపెట్టొద్దని పోలీసులను అబ్బాయి వర్గం కోరుతోంది. అయితే అమ్మాయి తరఫున వచ్చిన వాళ్లెవరు? ఏ ప్రాంతానికి చెందిన వారు? ఎక్కడికి పారిపోయారు? అనేది తేల్చి వారిని కఠినంగా శిక్షించాలని మృతుల కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు.
పోలీసులు ఏం చేస్తారో?
అమ్మాయి వర్గం సుపారీ ముఠాను తీసుకొచ్చిందన్న ఆరోపణలు తీవ్రమైనవి. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి, నిందితులను వెంటనే పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అబ్బాయి వర్గం డిమాండ్ చేస్తోంది. మరోవైపు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడటం చాలా అవశ్యమని స్థానికులు కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో పోలీసులు ఏం చేయబోతున్నారు? ఎవరిపైన చర్యలు తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసుకొని ముందుకెళ్లడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటి వరకూ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలుస్తున్నది. ఈ ఘటనను పోలీసులు సీరియస్ తీసుకునే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇద్దరు హత్యకు గురికావడం, మరికొందరు చావు బతుకుల మధ్య ఉండటం అంటే అంత ఆషామాషీ విషయమేమీ కాదు.
Read Also- Health News: రాత్రిపూట స్మార్ట్ ఫోన్లు వాడితే మీ పని గోవిందా.. ఎందుకో రండి చెబుతా!