American Woman: ప్రపంచంలో వెలకట్టలేని బంధంగా ప్రేమను చెబుతారు. అది ఎప్పుడు, ఎవరిపై పుడుతుందో చెప్పడం చాలా కష్టం. కులం, మతం, ప్రాంతం, వయసులను ప్రేమికులు లెక్కచేయరు. ఇష్టపడిన వారి కోసం ఎంతదూరమైన వెళ్లేందుకు వెనకాడరు. దీనిని రుజువు చేస్తూ తాజాగా ఒక ఆసక్తికర ఘటన జరిగింది. అమెరికాకు చెందిన ఓ మహిళ.. తను ప్రేమించిన వ్యక్తి కోసం ఏకంగా పాకిస్థాన్ కు వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆ జంట ప్రేమకథ ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఫేస్ బుక్‌లో పరిచయం
అమెరికాలోని చికాగో (Chicago)కు చెందిన 47 ఏళ్ల మిండీ రాస్ముస్సేన్ (Mindy Rasmussen).. పాక్ కు చెందిన 31 ఏళ్ల సాజిద్ జెబ్ ఖాన్ (Sajid Zeb Khan)ను ప్రేమించింది. ఏడాది క్రితం ఆన్ లైన్ లో మెుదలైన పరిచయం.. ప్రేమగా మారడంతో అతడ్ని వెతుక్కుంటూ పాక్ లోని ఉషెరాయ్ దారా (Usherai Dara) అనే మారుమూల గ్రామానికి ఆమె వెళ్లింది. పాక్ పత్రిక డాన్ కథనం ప్రకారం (Dawn report).. ఫేస్ బుక్ మాద్యమం ద్వారా వారిద్దరికి పరిచయం ఏర్పడింది. తొలుత చాటింగ్ చేసుకున్న ఆ జంట.. తర్వాత క్రమంగా వీడియో కాల్స్ చేసుకోవడం ప్రారంభించారు. అలా చివరికి ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఇద్దరి వయస్సుల మధ్య వ్యత్యాసం 16 ఏళ్లు ఉన్నప్పటికీ దానిని వారు ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం.
పాక్‌లో ఘన స్వాగతం
అయితే పెళ్లి ప్రస్తావన ముందుగా రాస్ముస్సేన్ తీసుకొచ్చినట్లు పాక్ పత్రిక తెలిపింది. ఇరు కుటుంబాలు అంగీకారం తెలపడంతో ఆమె పెళ్లి చేసుకునేందుకు పాక్ వచ్చిందని పేర్కొంది. ఈ నెల ప్రారంభంలోనే రాస్ముస్సేన్ అమెరికా నుంచి ఇస్లామాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి (Islamabad International Airport) వచ్చింది. ఆ తర్వాత నేరుగా ఆమె సాజిద్ జెబ్ ఖాన్ స్వగ్రామానికి వెళ్లారు. అక్కడ ప్రియుడు కుటుంబ సభ్యులు పూలతో రాస్ముస్సేన్ కు ఆహ్వానం పలికారు. అమెరికన్ అతిథిని తమ సంప్రదాయాలకు అనుగుణంగా ఆహ్వానించారు. ఆమె కుటుంబం, స్నేహితులకు కానుకలు అందజేశారు.
Also Read: MNS Workers on Shopkeeper: స్థానికులను అవమానిస్తావా.. రాజస్థాన్ వ్యాపారిపై దాడి.. వీడియో వైరల్!
పాక్ ప్రశాంత దేశం: యువతి
ఖాన్ ను వివాహం చేసుకోవడానికి 90 రోజుల వీసా గడువుతో రాస్ముస్సేన్ పాక్ లో అడుగుపెట్టారు. పెళ్లికి ముందు ఆమె ఇస్లాం మతంలోకి సైతం మారింది. తన పేరును ‘జులేఖ’గా మార్చుకుంది. అనంతరం గ్రామంలోని స్థానిక ఆచారాల ప్రకారం వారి వివాహం జరిగింది. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను రాస్ముస్సేన్ తన ఫేస్ బుక్ ఖాతాలో పంచుకుంది. ‘పాక్ లో నా తొలి పర్యటన. ఇది అందమైన, ప్రశాంతమైన దేశం’ అంటూ రాస్ముస్సేన్ స్థానిక మీడియాతో చెప్పినట్లు డాన్ పత్రిక పేర్కొంది. తాను ఊహించిన దాని కంటే దయ, ఆతిథ్యం, గౌరవం గొప్పగా ఉందంటూ ఆమె వ్యాఖ్యానించినట్లు చెప్పింది. అంతేకాదు తను మతం మార్చుకోవాలన్న అంశం.. పూర్తిగా రాస్ముస్సేన్ నిర్ణయమేనని పాక్ పత్రిక పేర్కొంది.