Bengaluru Stampede: ఐపీఎల్ 2025 టైటిల్ విజేత ఆర్సీబీ నిర్వహించిన విజయోత్సవ సందర్భంగా తొక్కిసలాట చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. బెంగళూరు చిన్న స్వామి స్టేడియం వెలుపల జరిగిన ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చకు తావివ్వడంతో ఈ మెుత్తం వ్యవహారంపై కర్ణాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. తాజాగా ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక విడుదల చేసింది. అందులో కీలక విషయాలను ప్రస్తావించింది. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పేరును సైతం నివేదికలో ప్రస్తానకు వచ్చింది.
తొక్కిసలాటకు వారిదే బాధ్యత
బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వెలుపల జూన్ 4న జరిగిన తొక్కిసలాటకు సంబంధించి జస్టిస్ (రిటైర్డ్) జాన్ మైఖేల్ డి’కున్హా (John Michael D’Cunha) నేతృత్వంలోని జ్యుడీషియల్ కమిషన్ నివేదికను రూపొందించింది. దానిని ప్రభుత్వం తాజాగా విడుదల చేయగా అందులో కీలక అంశాలు బయటపడ్డాయి. బెంగళూరు తొక్కిసలాటకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA), ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్ ప్రత్యక్షంగా బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. ఈ సంస్థలు అవసరమైన అనుమతులు పొందకుండా జనసమూహ నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించినట్లు నివేదిక ఆరోపించింది.
కోహ్లీ వీడియో ప్రస్తావన
కమిషన్ నివేదిక ప్రకారం.. RCB జూన్ 3న ఐపీఎల్ ఫైనల్ గెలిచిన తర్వాత జూన్ 4న విజయోత్సవ పరేడ్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విషయమపై పోలీసులకు సమాచారం ఇచ్చింది. కానీ చట్టపరమైన అనుమతుల కోసం నిర్దేశిత ఫార్మాట్‌లో ఏడు రోజుల ముందు అభ్యర్థన దాఖలు చేయలేదు. ఈ లోపం వల్ల పోలీసులు తగిన భద్రతా ఏర్పాట్లు చేయలేకపోయారని నివేదిక తెలిపింది. RCB తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ (@Rcbtweets) ద్వారా జూన్ 4 ఉదయం 8:55 గంటలకు విరాట్ కోహ్లీ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో బెంగళూరులో విజయోత్సవం జరుపుకోనున్నట్లు ప్రకటించింది. కోహ్లీ సైతం ఈ విజయాన్ని బెంగళూరు ప్రజలు, ఆర్సీబీ అభిమానులతో పంచుకోవాలని ఉందని పేర్కొన్నారు. ఈ పోస్టు కు 44 లక్షల మంది వీక్షించారని.. దీని వల్ల స్టేడియం వద్ద 3 లక్షలకు పైగా జనం గుమిగూడారని నివేదిక తెలిపింది. అయితే స్టేడియం సామర్థ్యం మాత్రం 35వేలు మాత్రమేనని గుర్తు చేసింది.
అందువల్లే తొక్కిసలాట
విజయోత్సవ సభకు ఉచిత ప్రవేశమని ఆర్సీబీ మేనేజ్ మెంట్ ప్రకటించడంతో స్టేడియం చుట్టూ 14 కి.మీ దూరం వరకూ ప్రజలు గూమికూడినట్లు నివేదిక పేర్కొంది. స్టేడియం నలువైపులా అభిమానులు పోటెత్తడంతో ఎంట్రీ పాస్ లు కావాలని నిర్వహకులు ఎక్స్ లో పోస్టులు పెట్టారు. దీంతో గందరగోళానికి గురైన అభిమానులు.. గేట్లు తెరిచే క్రమంలో ఒక్కసారిగా స్టేడియంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. స్టేడియం గేట్లను సరైన సమయానికి సమన్వయంతో తెరవకపోవడం, అక్కడ సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వల్ల జనసమూహం అదుపు తప్పింది. స్టేడియం సామర్థ్యానికి మించి జనం రావడంతో గేట్ల వద్ద తొక్కిసలాట జరిగిందని నివేదిక స్పష్టం చేసింది.
Also Read: Appache Helicopters: టార్గెట్ పాకిస్థాన్.. సైన్యంలోకి గేమ్ ఛేంజింగ్ యుద్ధ హెలికాఫ్టర్లు.. ఇక చుక్కలే!
చట్టపరమైన చర్యలు
తొక్కిసలాట ఘటనకు సంబంధించి కబ్బన్ పార్క్ పోలీసు స్టేషన్‌లో RCB, KSCA, DNA ఎంటర్టైన్మెంట్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS) కింద అనేక సెక్షన్లలో (105, 125, 132, 121, 190) ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇప్పటికే నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో RCB మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసలే కూడా ఉన్నారు. కర్ణాటక హైకోర్టు ఈ ఘటనపై సుమోటో కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది. కమిషన్ నివేదికకు సంబంధించిన కాపీలను RCB, KSCA, DNA ఎంటర్టైన్మెంట్‌లకు కూడా అందించాలని ఆదేశించింది. మరోవైపు మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారాన్ని కర్ణాటక ప్రభుత్వం గతంలో ప్రకటించింది. క్షతగాత్రుల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చింది. అటు ఆర్సీబీ సైతం మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించింది.