MNS Workers on Shopkeeper: రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్తలు మరోసారి వివాదాస్పద చర్యలకు పాల్పడ్డారు. ముంబయిలో ఒక రాజస్థానీ దుకాణదారుడిపై దాడికి తెగబడ్డారు. మరాఠీ సమాజాన్ని కించపరిచేలా అతడు వాట్సప్ స్టేటస్ పెట్టాడంటూ ఆరోపించారు. దుకాణాదురుడిపై భౌతికంగా దాడి చేయడమే కాకుండా అతడి చేత బలవంతంగా మరాఠీ సమాజానికి క్షమాపణలు చెప్పించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే..
ముంబయి విఖ్రోలీ ప్రాంతంలోని తగోర్ నగర్ లో రాజస్థాన్ కు చెందిన వ్యక్తి దుకాణం పెట్టుకొని జీవిస్తున్నాడు. అయితే ఇటీవల ఆ దుకాణాదారుడు పెట్టిన వాట్సప్ స్టేటస్ స్థానికంగా కలకలం రేపింది. ‘రాజస్థానీ శక్తిని చూశారా? మహారాష్ట్రలో మరాఠీలను ఢీకొట్టి నిలబడ్డాం. మేము మార్వాడీలం.. మా ముందు ఎవరూ నిలబడలేరు’ అని అతడు స్టేటస్ పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరాఠీ ప్రజలపై మార్వాడీల ఆధిపత్యాన్ని గొప్పగా చెప్పుకునే ఈ రెచ్చగొట్టే సందేశం.. స్థానిక MNS కార్యకర్తలలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. దీంతో వారు రాజస్థాన్ వ్యక్తి దుకాణం వద్దకు వెళ్లి.. అతడిపై దాడి చేశారు.
తీవ్ర హెచ్చరిక
వైరల్ అవుతున్న వీడియోలో బాధితుడు రెండు చేతులు జోడించి క్షమాపణలు చెప్పాడు. ‘నేను అలాంటి తప్పును మళ్లీ చేయను’ అని చెవులు పట్టుకొని ప్రాధేయపడ్డాడు. అయినప్పటికీ ఎంఎన్ఎస్ కార్యకర్తలు అతడ్ని బెదిరించడం కొనసాగించారు. మరోమారు ఆ విధంగా నడుచుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అయితే ఈ దాడికి సంబంధించిన వీడియోను ఎంఎన్ఎస్ కార్యకర్తలు తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా వైరల్ చేస్తున్నారు. ‘మరాఠీ ప్రజలకు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడినా, రాసినా వారి పట్ల ఇలాగే వ్యవహరిస్తాం’ అంటూ ఆ వీడియోకు క్యాప్షన్ పెట్టి లోకల్ గా వైరల్ చేస్తున్నారు.
వారి బహిష్కరించాలని పిలుపు
దాడి అనంతరం సదరు దుకాణాదారుడ్ని స్థానిక పోలీసు స్టేషన్ వద్దకు లాకెళ్లిన ఎంఎన్ఎస్ కార్యకర్తలు.. అతడిపై ఫిర్యాదు చేశారు. మరోవైపు స్థానిక ఎంఎన్ఎస్ నాయకుడు విశ్వజిత్ ధోలం.. బాధిత వ్యక్తి వ్యాపారాన్ని బహిష్కరించాలని స్థానికులకు పిలుపునిచ్చారు. మరాఠీని ద్వేషించే వ్యాపారుల వద్ద వస్తువులను కొనుగోలు చేయవద్దని కోరారు. ఎంఎన్ఎస్ అగ్రనేత రాజ్ థాకరే.. ఈ తరహా దాడులకు తెగబడవద్దని ఇటీవల కార్యకర్తలకు సూచించినప్పటికీ మళ్లీ అదే తరహా ఘటన జరగడం ప్రస్తుతం మహారాష్ట్రలో ఆసక్తికరంగా మారింది.
तुम्ही इथे येऊन अशी भाषा वापराल तर तुम्हाला त्याच भाषेत उत्तर मिळणार. तुला कोलला ! pic.twitter.com/xSGFk201Ts
— MNS Videos (@mnsvideos) July 16, 2025
Also Read: Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాటపై సంచలన నివేదిక.. చిక్కుల్లో కోహ్లీ, ఆర్సీబీ!
గతంలోనూ ఇంతే..
అయితే ఈ తరహా ఘటన జులై 1న థానేలో కూడా జరిగింది. మరాఠీ మాట్లాడటానికి నిరాకరించినందుకు ఓ వీధి వ్యాపారిపై ఎంఎన్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. మరాఠీయేతర వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఈ దాడికి పాల్పడిన ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఘటనలో విరార్ రైల్వే స్టేషన్ సమీపంలో యూపీకి చెందిన ఆటో డ్రైవర్ పై దాడి చేశారు. తాను హిందీలోనే మాట్లాడతానని అతడు చెప్పడాన్ని ఎంఎన్ఎస్ కార్యకర్తలు తట్టుకోలేకపోయారు. మరాఠీ భాషను అవమానించారంటూ అతడిపైనా దాడికి తెగబడ్డారు.