Son after 10 Daughters: మగ సంతానం లేకపోతే వారసత్వం ముగిసిపోతుందనే అపోహ దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతోంది. మహిళల ప్రాణాలను సైతం ముప్పులోకి నెట్టే ఈ మూస ఆలోచనపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నా.. ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్నా ఏదో ఒక మూలన ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా, హర్యానాలోని జింద్ జిల్లాలో ఇలాంటి ఘటన వెలుగుచూసింది. ఓ కుటుంబం మగ పిల్లాడి కోసం ఏకంగా 10 కాన్పులు ఎదురుచూసింది. ఎట్టకేలకు 11వ సంతానంలో వారి కోరిక నెరవేసి మగ శిశువు (Son after 10 Daughters) జన్మించాడు. దీంతో, శిశువు తండ్రి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.
భార్య ప్రాణాలను తీవ్ర ముప్పులోకి నెట్టిన ఆ ప్రబుద్ధుడు, అబ్బే తాను మగపిల్లాడి కోసం పట్టుబట్టలేదని చెబుతున్నాడు. 37 ఏళ్ల వయసున్న ఓ మహిళ హర్యానాలోని జింద్ జిల్లాలో ఉన్న ఓజాస్ హాస్పిటల్‌లో ఆదివారం నాడు మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు చాలా చిన్న వయసులోనే పెళ్లైంది. అయితే, వరుసగా 10 మంది ఆడపిల్లలు జన్మించారు. 11వ సంతానం అత్యంత రిస్క్ అయినప్పటికీ, వైద్యులు హెచ్చరించినప్పటికీ మగబిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ కాన్పు హైరిస్క్ కేటగిరీకి చెందుతుందని ఓజాస్ హాస్పిటల్ వైద్యుడు డా.నర్వీర్ షెరోన్ చెప్పారు. తల్లికి మూడు యూనిట్ల రక్తం అవసరం అయ్యిందని వెల్లడించారు. అయితే, అదృష్టం కొద్దీ తల్లీబిడ్డల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వివరించారు. జనవరి 3న గర్భవతిని హాస్పిటల్‌లో చేర్పించారు. ఆ మరుసటి రోజున ఆమెకు డెలివరీ అయ్యింది. అంతా సజావుగా జరగడంతో ఆమెను తక్కువ సమయంలోనే డిశ్చార్జ్ చేశారు.
నేను, నా కూతుళ్లు పిల్లాడి కోసం చూశాం
11వ సంతానంగా కొడుకు జన్మించడంపై తండ్రి సంజయ్ కుమార్ పట్టరాన్ని సంతోషాన్ని వ్యక్తం చేశాడు. తాను, తన పెద్ద కూతుళ్లు మగపిల్లాడు కావాలని ఆశించామని తెలిపాడు. 2007లో తనకు పెళ్లైందని వెల్లడించారు. 10 మంది కూతుళ్లలో ఎక్కువ మంది ప్రస్తుతం చదువుకుంటున్నారని, తాను రోజు కూలీనే అయినప్పటికీ, ఉన్నదాంట్లోనే పెంచుకుంటున్నట్టు వివరించాడు. పెద్ద కూతురు 12వ తరగతి చదువుతోందని తెలిపాడు. తన ఆదాయం అంతంత మాత్రమే అయినప్పటికీ, అందరికి విద్య అందించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పాడు. ఏం జరిగినా అది దేవుడి చిత్తమని, తాను సంతోషంగా ఉన్నానని సంజయ్ కుమార్ స్పష్టం చేశాడు. మగపిల్లాడు కావాలంటూ తన కుటుంబ సభ్యుల తరపున ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పారు. ఈ రోజుల్లో బాలికలు అన్ని రంగాల్లో విజయవంతంగా రాణిస్తున్నారని ఆశాభావం వ్యక్తం చేశాడు.
కాగా, 11వ డెలివరీ కావడం, అందునా పిల్లాడి కోసం ఎదురుచూడడంతో ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో కూడా చక్కర్లు కొడుతోంది. పది మంది కూతుళ్ల పేర్లను గుర్తుచేసుకోవడంతో ఇబ్బంది పడుతుంటానని తండ్రి సంజయ్ కుమార్ చెప్పడం ఆ వీడియోలో ఉంది. కాగా, హర్యానా స్త్రీ, పురుష నిష్పత్తి.. జాతీయ సగటు నిష్పత్తి కంటే తక్కువగా ఉంది. 2025 నాటి లెక్కల ప్రకారం, ఆ రాష్ట్రంలో 1000 మంది అబ్బాయిలకు 923 మంది బాలికలు మాత్రమే ఉన్నారు.

