Uttam Kumar Reddy: హైదరాబాద్ ఇండస్ట్రీయల్ ట్రాన్స్‌ఫర్ పాలసీపై (HILT) మంగళవారం నాడు అసెంబ్లీ వేదికగా చర్చ జరిగింది. ఈ అంశంపై రాష్ట్ర ఇరిగేషన్, సివిల్ సప్లయ్స్ శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) మాట్లాడుతూ, ప్రభుత్వ వివరణ ఇచ్చారు. హిల్ట్ పాలసీ హైదరాబాద్ నగర భవిష్యత్‌కు అత్యుత్తమమైనదంటూ సమర్థించారు. హైదరాబాద్ నగరాన్ని మరింత ఆవాసయోగ్యంగా మార్చేందుకు, తెలంగాణ సుస్థిరాభివృద్ధికి ఈ పాలసీ అనివార్యమని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంతో పాటురాష్ట్రానికి మంచి చేసే హిల్ట్ పాలసీ రూపకల్పనలో కీలక పాత్ర పోషించామని, ఈ పాలసీ ఉత్తమమైనదని నిజాయితీగా చెబుతున్నానని అన్నారు. పర్యావరణం మెరుగుపడడంతో పాటు హైదరాబాద్‌ను గ్లోబల్ మెట్రోపాలిటన్ నగరంగా మార్చివేస్తుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
తప్పనిసరి కాదు.. వాలంటరీ
హిల్ట్ పాలసీపై విపక్ష బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న ఆరోపణలకు అసెంబ్లీ వేదికగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్లు ఇచ్చారు. హిల్ట్ పాలసీ తప్పనిసరిది కాదని, ఇది వాలంటరీ పాలసీగా ఉంటుందని స్పష్టం చేశారు. హిల్ట్ పాలసీ విషయంలో బీఆర్ఎస్, బీజేపీ తమ వైఖరి ఏంటో స్పష్టం తెలియజేయాలంటూ సవాలు విసిరారు. కాలుష్య కారకాలుగా ఉన్న పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్ వెలుపలకు తరలించాలంటారా?, వద్దంటారా? చెప్పాలంటూ ప్రశ్నించారు. హిల్ట్ పాలసీపై ఇవ్వాలనుకుంటున్న సలహా ఏంటో బహిరంగంగా చెప్పాలని సవాలు విసిరారు. పాలసీ వాలంటరీగా అమలు చేయడాన్ని తప్పుబడుతున్నారా?, లేక తప్పనిసరి చేయకపోవడాన్ని తప్పుబడుతున్నారా? అని బీఆర్ఎస్, బీజేపీలను నిలదీశారు. అన్ని ఆలోచించిన తర్వాతే ప్రభుత్వం హిల్ట్ పాలసీని స్వచ్ఛంగా కొనసాగించాలని నిర్ణయించిందని క్లారిటీ ఇచ్చారు.
కేవలం పూర్తి యాజమాన్య హక్కులు ఉన్న భూములను మాత్రమే బదిలీకి పరిగణనలోకి తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. హిల్ట్ పాలసీ రూపంలో 9,000 ఎకరాల భూమి, రూ.5 లక్షల కోట్ల మేర అవినీతి జరిగిందంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి నైరాశ్యం వ్యక్తం చేశారు. విమర్శలు చేయాలనే ఉద్దేశం కాకపోతే మరేంటి ? అని ఆయన ప్రశ్నించారు. దశాబ్దాలుగా పారిశ్రామిక, నివాస ప్రాంతాలు నివాసానికి పనికిరాకుండా పోయాయని, తిరిగి నగరాన్ని నివాసయోగ్యంగా మార్చడమే తమ విధానమని అన్నారు.
హైదరాబాద్ నగరంతో వ్యక్తిగతంగా తనకు భావోద్వేగ బంధం ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో తనకు వ్యవసాయ భూమి ఉండేదని చెప్పారు. మియాపూర్ లాంటి ప్రాంతాలలో బోర్‌వెల్ నీళ్లు కాస్తా గోధుమ రంగులోకి మారిపోయాయని, కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలను తరలించాల్సిన అవసరాన్ని ఇలాంటి ఉదాహరణలు చాటిచెబుతున్నాయని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. పరిశ్రమలు నగరం నుంచి బయటకు తరలి వెళ్లాలంటే వారికి తగిన మద్దతు, ప్రోత్సాహకాలు అవసరమని, ఈ విషయంలో పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పనితీరును ప్రశంసిస్తున్నట్టుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also- TVK – congress: డీఎంకే ముందు కాంగ్రెస్ కీలక డిమాండ్.. విజయ్ పార్టీ వైపు హస్తం పార్టీ చూస్తోందా?

