TVK – congress: అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్నా కొద్దీ తమిళనాడులో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. పొత్తులు, సీట్ల పంపకాలు ముందుగానే మొదలయ్యాయి. అగ్ర నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రయత్నిస్తోందంటూ కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో, మరో ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ సైతం టీవీకే పార్టీ వైపు చూడవచ్చంటూ (TVK – congress) విశ్లేషణలు ఊపందుకున్నాయి. ఇదే విషయమై అగ్రనేత రాహుల్ గాంధీని ఒప్పించేందుకు తమిళనాడు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారంటూ కథనాలు వెలువడుతున్నాయి.
టీవీకే పార్టీకి కాంగ్రెస్ ‘సహజ మిత్ర’ పార్టీ అంటూ విజయ్ రెండు రోజులక్రితం అభివర్ణించిన నేపథ్యంలో ఈ ఊహాగానాలు తెరపైకివచ్చాయి. కేవలం మద్దతు ఇవ్వడం వరకే పరిమితం కాకుండా, ఈసారి అధికారంలో కూడా భాగస్వామిగా ఉండాలని తమిళనాడు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగా అధిష్ఠానం వద్ద తమ ఆలోచనలను పంచుకుంటున్నారు. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ వ్యహాత్మకంగా వ్యవహరించాలని, అధికారంలో కూడా భాగం కావాలని చెబుతున్నట్టుగా ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
డీఎంకే వద్ద 40 సీట్ల డిమాండ్
మరోవైపు, అధికార పార్టీగా ఉన్న మిత్ర పక్షం డీఎంకే (DMK) వద్ద అసెంబ్లీ ఎన్నికల సీట్ల పంపకానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రాతిపాదనను కూడా చేసినట్టు సమాచారం. 40 సీట్లు కేటాయించాలని అంతర్గతంగా డీఎంకేని కోరినట్టుగా తెలుస్తోంది. అయితే, డీకేఎం మాత్రం 32 సీట్లతో సరిపెట్టుకోవాలని కోరినట్టు కథనాలు వెలువడుతున్నాయి. డీఎంకే స్పందన చూసిన తర్వాత, హస్తం పార్టీ తన డిమాండ్‌ను 38 సీట్లకు తగ్గించుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఏదైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించి, ఆ తర్వాత ప్రభుత్వంలో కూడా కీలకంగా వ్యవహరించాలని భావిస్తున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.
సీట్లు మాత్రమే కాదు.. అధికారం కావాలి: మాణిక్కం ఠాగూర్
కాంగ్రెస్ ఎంపీ, ఆ పార్టీ సీనియర్ నేత మాణిక్క ఠాగూర్ ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ కేవలం కూటమి కట్టి, సీట్ల వరకే పరిమితం కాబోదని, కూటమి గెలిస్తే అధికారంలో కూడా భాగస్వామ్యం కావాలని భావిస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉందని, ఎన్నికలు సమీపించడంతో ఈ ఒత్తిడి మరింత పెరిగిందని చెప్పారు. టీవీకే అధినేత విజయ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి. లౌకిక విధానాన్ని పాటించే కాంగ్రెస్ పార్టీ ‘సహజ మిత్ర పార్టీ’ అని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో, ఈ రెండు పార్టీల మధ్య పొత్తు పొడుస్తుందా? అనే విశ్లేషణలు జోరందుకున్నాయి. ఈ పరిణామంపై టీవీకే అధికార ప్రతినిధి ఫెలిక్స్ గెరాల్డ్ స్పందిస్తూ, విజయ్, రాహుల్ గాంధీ ఇద్దరూ మిత్రులని అన్నారు.
కాంగ్రెస్ పార్టీతో పొత్తుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అయితే, తమిళనాడు కాంగ్రెస్‌లో నాయకత్వ ప్రయోజనాల దృష్ట్యా ఇరు పార్టీల మధ్య చర్చలు కొంత ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయని ఫెలిక్స్ గెరాల్డ్ విశ్లేషించారు. ఇక, టీవీకే పార్టీకే చెందిన నిర్మల్ కుమార్ అనే నాయకుడు స్పందిస్తూ, పొత్తులకు సంబంధించిన తుది నిర్ణయం తమ పార్టీ అధినేత విజయ్ చేతిలో ఉంటుందన్నారు. ఎన్నికలకు చాలా రోజులు గడువు ఉండడంతో అప్పుడే కంగారు పడాల్సింది ఏమీ లేదని, కూటమి విషయమై చర్చలు జరిగితే విజయ్ ప్రకటిస్తారని చెప్పారు. మొత్తంగా తమిళనాడులో టీవీకే కేంద్రంగా పార్టీల పొత్తు ఎత్తు కొనసాగుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Read Also- Gongidi Sunitha: మేము కన్నెర్ర చేస్తే గ్రామాల్లో తిరగలేవు జాగ్రత్త: గొంగిడి సునీత ఫైర్..!

