WWII: రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న 102 ఏళ్ల హెరాల్డ్ టెరెన్స్ (Harold Terens) ఆగస్టు 6న 103వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నారు. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఆయన తాను ఈ మైలురాయి కోసం ఎదురుచూడటం లేదని స్పష్టం చేశారు. అయితే యుక్త వయస్సులో స్వీకరించే.. బార్ మిట్జ్వా (యూదుల ఆచారం)ను తన తదుపరి పుట్టినరోజు సందర్భంగా స్వీకరించాలని భావిస్తున్నట్లు చెప్పారు. యుక్త వయస్సులో ఉన్నప్పుడు చేయలేకపోయానని తన 103వ ఏటా ఆ కోరికను నెరవేర్చుకోవాలని ఉవ్విళ్లు ఊరుతున్నట్లు చెప్పారు.
తల్లి యూదురాలు కావడంతో..
‘నా తల్లి పోలాండ్ నుండి వచ్చింది. నా తండ్రి రష్యా నుండి వచ్చారు. నా తల్లి మతపరంగా యూదురాలు. నా తండ్రి మత వ్యతిరేకి. అయితే మేము ఇద్దరు సంతానం. నా సోదరుడు తల్లి మతవిశ్వాసాలను అనుసరిస్తూ యుక్త వయస్సులోనే బార్ మిట్జ్వా (Bar Mitzvah)ను స్వీకరించారు. నేను మాత్రం నా తండ్రిని దృష్టిలో ఉంచుకొని రాజీ పడాల్సి వచ్చింది’ అంటూ హెరాల్డ్ టెరెన్స్ అంతర్జాతీయ మీడియాతో చెప్పుకొచ్చారు. అప్పుడు నెరవేర్చుకోలేకపోయిన కలను.. ఇన్నాళ్ల తర్వాత తన 103 ఏట బార్ మిట్జ్వా పొందాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
యుద్ధంలో ఏం చేశారో తెలుసా?
రెండో ప్రపంచ యుద్ధంలో టెరెన్స్ సేవల విషయానికి వస్తే.. అతడు 1944లో అమెరికా ఆధ్వర్యంలో నిర్వహించి డి డే మిషన్ లో పాల్గొన్నాడు. అప్పుడు అతడి వయసు 21 సంవత్సరాలు. డి డేలో భాగంగా.. ఫ్రాన్స్ నుంచి వచ్చిన విమానాలను రిపేర్ చేసి.. అవి తిరిగి యుద్ధంలో పాల్గొనెలా టెరెన్స్ సహాయపడ్డాడు. అదే సమయంలో పట్టుబడ్డ జర్మన్ ఖైదీలను, అమెరికా యుద్ధ ఖైదీలను ఇంగ్లాండ్ కు తరలించడంలో సాయం చేశారు. తల్లి దండ్రులు విభిన్నమైన మత విశ్వాసాలు కలిగినవారు కావడంతో చిన్నతనంలో యూదు ఆచారాన్ని జరుపుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆగస్టు 6న వాషింగ్టన్ డీసీ (Washington DC)లోని పెంటగన్ (Pentagon)లో అతడి బార్ మిట్జ్వా జరగనుంది.
Also Read: Viral News: మహిళ జాకెట్‌లో రెండు తాబేళ్లు.. అవాక్కైన అధికారులు.. పెద్ద ప్లానే ఇది!
బార్ మిట్జ్వా అంటే ఏంటీ?
బార్ మిట్జ్వా అనేది యూదు సంప్రదాయంలో ఒక ముఖ్యమైన ఆచారం. ఇది 13 ఏళ్ల వయసు వచ్చిన యూదు బాలుడు తన మతపరమైన నైతిక బాధ్యతలను స్వీకరించే సందర్భాన్ని సూచిస్తుంది. ఈ వయస్సులో, బాలుడు యూదు మత చట్టాలను (హలాఖా) పాటించేందుకు బాధ్యత వహిస్తానని హామీ ఇస్తాడు. సాధారణంగా ‘మిట్జ్వోట్’ అంటే ‘మత ఆజ్ఞలు’ అని అర్థం. ‘బార్’ అనే హీబ్రూ పదానికి అర్థం ‘కుమారుడు’. సాధారణంగా బార్ మిట్జ్వా వేడుకలో బాలుడు సినగాగ్‌లో తోరా (యూదు మత గ్రంథం) నుండి ఒక భాగాన్ని చదువుతాడు లేదా హాఫ్తారా (ప్రవక్తల గ్రంథాల నుండి ఒక భాగం) పఠిస్తాడు. ఈ సందర్భం బాలుడు సమాజంలో పెద్దవాడిగా గుర్తింపు పొందే సందర్భంగా జరుపుకుంటారు.