Karisma Kapoor: బాలీవుడ్ లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ మాజీ భర్త, వ్యాపారి సంజయ్ కపూర్ (Sunjay Kapur) గత నెల జూన్ 12న అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే సంజయ్ కపూర్ ఆస్తులకు సంబంధించి కుటుంబంలో వివాదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. సంజయ్ ఇంగ్లాండ్ లో పోలో ఆడుతూ గుండెపోటుతో మరణించారు. అతడి మృతి తర్వాత సంజయ్ వ్యాపార సంస్థ సోనా కామ్ స్టార్ (Sona Comstar) ఆస్తులపై ప్రస్తుతం వివాదం తలెత్తింది.
రూ.30వేల కోట్ల ఆస్తులకు డిమాండ్!
సంజయ్ తల్లి రాణి కపూర్.. సోనా గ్రూప్ లో తనకు ఎక్కువ వాటా ఉందని కుటుంబ ఆస్తులకు తానే వారసురాలినని పేర్కొన్నట్లు సమాచారం. అయితే కరిష్మా కపూర్ కూడా ఈ ఆస్తుల్లో తనకూ వాటా ఉన్నట్లు దావా వేయబోతున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు పేర్కొంటున్నాయి. భర్త సంజయ్ కపూర్ కుటుంబానికి సంబంధించి.. రూ.30,000 కోట్ల విలువైన ఆస్తుల వాటాను ఆమె డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై కరిష్మా కపూర్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
సంజయ్ తల్లి రియాక్షన్
ఇండియా. కామ్ (India.com) నివేదిక ప్రకారం.. సోనా కామ్ స్టార్ వార్షిక సర్వ సభ్య సమావేశంలో సంజయ్ తల్లి రాణి కపూర్.. తనను తాను వారసురాలినని ప్రకటించుకున్నారు. కొందరు వ్యక్తులు కుటుంబ వారసత్వాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. తాను ఎవరినీ గ్రూప్ ప్రతినిధిగా నియమించలేదని స్పష్టం చేశారు. దైనిక్ జాగరణ్ నివేదిక ప్రకారం.. సంజయ్ కపూర్ ను పెళ్లి చేసుకున్న కరిష్మా కపూర్.. తన మాజీ భర్త కుటుంబానికి సంబంధించి గణనీయమైన వాటా (రూ.30,000 కోట్ల విలువైన ఆస్తులు) కోరుకుంటున్నట్లు తెలుస్తోంది.
Also Read: Viral News: మహిళ జాకెట్‌లో రెండు తాబేళ్లు.. అవాక్కైన అధికారులు.. పెద్ద ప్లానే ఇది!
సంజయ్ మృతిపై అనుమానాలు
సంజయ్ తల్లి రాణి కపూర్ (Rani Kapur).. తన బిడ్డ అకస్మిక మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు. గుండెపోటుతో తన కొడుకు మరణించాడన్న రిపోర్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘సంజయ్ గుండెపోటుతో మరణించాడని ధ్రువీకరణకు రావడం చాలా బాధాకరం. ఆధారాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. అసలు నిజాలు బయటకు వచ్చే వరకూ ఆమె (రాణి కపూర్) మౌనంగా ఉండదు’ అంటూ రాణి కపూర్ న్యాయ సలహాదారు సీనియర్ న్యాయవాది వైభవ్ గగ్గర్ అన్నారు. మరోవైపు కుమారుడు చనిపోయిన కొద్దిసేపటికే తనపై కొన్ని పత్రాలపై సంతకాలు చేయించారని రాణి కపూర్ ఆరోపించారు. సోనా గ్రూప్ వార్షిక సర్వ సభ్య సమావేశంలో వాటిని రద్దు చేయాలని అభ్యర్థించారు. అదే సమయంలో కొత్త డైరెక్టర్ల నియామకం కూడా జరగకూడదని అన్నారు.
కరిష్మా, సంజయ్ వైవాహిక బంధం
కరిష్మా, సంజయ్‌లు 2003లో వివాహం చేసుకుని 2016లో విడాకులు తీసుకున్నారు. వారికి సమైరా, కియాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. విడాకుల సమయంలో కరిష్మాకు ముంబైలోని సంజయ్ తండ్రి యాజమాన్యంలోని ఒక ఇల్లు అలాగే పిల్లల కోసం రూ. 14 కోట్ల రూపాయల విలువైన బాండ్లు అందాయి. ఇవి వారికి నెలవారీ రూ.10 లక్షల ఆదాయాన్ని అందిస్తున్నాయి.