Tirumala Updates: సమ్మర్ హాలిడేస్ వచ్చాయి. సమ్మర్ టూర్ ప్లాన్ చేసే సమయం ఆసన్నమైంది. అయితే చాలా వరకు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన శ్రీవారి భక్తులు ఎక్కడికి వెళతారో మనకు తెలిసిందే. అదేనండీ కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడు వెలసిన తిరుమల క్షేత్రానికి.
అందుకే తిరుమల క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఎందరో శ్రీవారి భక్తులకు మేలు చేకూరనుంది. ఆ నిర్ణయం ఏమిటో తెలుసుకుందాం.
సాధారణంగా తిరుమల క్షేత్రానికి నిత్యం భక్తులు వస్తుంటారు. కాస్త సెలవు రోజుల్లో అయితే ఇక చెప్పలేం. రోజూ సుమారు 70 వేల మంది వచ్చే భక్తులు ఒకొక్కసారి సెలవు రోజుల్లో సుమారు లక్ష వరకు రావచ్చు. అదే సమ్మర్ హాలిడేస్ లో అయితే ఇక భక్తుల రద్దీ ఊహించలేము.
ప్రస్తుతం ఆ రోజులు రానే వచ్చాయి. ఇప్పటికే సమ్మర్ హాలిడేస్ ప్రారంభం కావడంతో తిరుమల క్షేత్రం లో భక్తుల రద్దీ కనిపిస్తోంది. ఎటుచూసినా గోవిందా నామస్మరణ వినిపిస్తోంది. తిరుమల మాడవీధులు నిత్యం శ్రీవారి భక్తులతో నిండి కనిపిస్తున్నాయి.
ఇదే విషయాన్ని పరిగణలోకి తీసుకున్న టీటీడీ, సామాన్య భక్తుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా తిరుమల శ్రీవారిని వీఐపీ బ్రేక్ దర్శనాల సమయంలో వీఐపీలు దర్శించుకుంటారు. ప్రస్తుతం ఆ దర్శనాలను కుదించి సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని టీటీడీ నిర్ణయించింది. ఇటీవల నిర్వహించిన టీటీడీ పాలకమండలి సమావేశంలో ఛైర్మన్ బిఆర్ నాయుడు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
సమ్మర్ హాలిడేస్ సమయంలో శ్రీవారి దర్శనార్థం వచ్చే ఏ సామాన్య భక్తునికి ఇబ్బందులు కలగకూడదన్నది టీటీడీ అభిప్రాయం. అందుకే తాజాగా ఆ నిర్ణయాన్ని అమలుచేసేలా టీటీడీ అడుగులు వేసింది. మే 1వ తేదీ నుండి పరిశీలనాత్మకంగా వీఐపీ బ్రేకు దర్శనాల సమయంలో మార్పులు చేసింది.
ఉ 6 గంటల నుండి విఐపీ బ్రేక్ దర్శనాలు ప్రారంభం కానున్నట్లు, వేసవి సెలవుల రద్దీ దృష్ట్యా శ్రీవారి దర్శనానికి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపి లకు మాత్రమే బ్రేక్ దర్శనం పరిమితం చేశారు. ఈ నిర్ణయంతో సామాన్య భక్తులకు అధిక సమయం కేటాయించే వీలు కలుగుతుంది. మే 01 నుండి జూలై 15వ తేదీ వరకు ఈ నిర్ణయం అమలు కానుంది.
Also Read: Gold Rates: గోల్డ్ లవర్స్ కి భారీ గుడ్ న్యూస్.. ఏంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
వేసవి సెలవుల రద్దీ నేపథ్యంలో శ్రీవారి దర్శనం కల్పించడంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ టీటీడీ ఈ నిర్ణయం తీసుకోవడం సామాన్య భక్తులకు ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. మరేందుకు ఆలస్యం.. మీకోసమే టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళండి. ఆ వేంకటేశ్వర స్వామి కరుణకటాక్షం పొందండి.