Tirumala Crime: తిరుమలలో భక్తులను మోసగించే కేటుగాళ్ల భరతం పడుతున్నారు తిరుమల పోలీసులు. నిన్న ఏకంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పేరిట వాట్సాప్ ప్రొఫైల్ పిక్చర్ తో భక్తులను మోసం చేసిన కేటుగాడిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో మోసగాడిని తిరుమల పోలీసులు అరెస్ట్ చేయడంతో.. ఇలా కూడా నేరాలు జరిగే అవకాశం ఉందా అంటూ పోలీసులు సైతం ఆశ్చర్యానికి లోనయ్యారు.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం రోజూ వేల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. వీరిలో అమాయక భక్తులే టార్గెట్ చేసుకొని మోసాలకు పాల్పడే మోసగాళ్లు అధికమయ్యారు. ఇలాంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే శ్రీవారి దర్శన వివరాలను తెలుసుకునేందుకు భక్తులు, శ్రీవారి అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించడం సర్వసాధారణమే.
అదే అదునుగా భావించిన బోయ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏకంగా టిటిడి అఫీషియల్ మెయిల్ ను పోలినట్లు, డూప్లికేట్ మెయిల్ ద్వారా భక్తులను మోసం చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఏకంగా తన డూప్లికేట్ జిమెయిల్ ఐడి ttdeotot@gamil.com అనే పేరుతో ఏర్పాటు చేసుకుని, గూగుల్ కు డబ్బులు చెల్లించి.. తిరుమల ఈవో, జేఈవో, అడిషనల్ ఈవో ల వివరాలను సెర్చ్ చేసిన సమయంలో తన మెయిల్ కనిపించే విధంగా ఏర్పాట్లు చేసుకున్నాడు. అలా కనిపించిన మెయిల్ కు భక్తులు వీఐపీ దర్శనం కోసం మెయిల్ చేసే వారు.
తిరుమల శ్రీవారి విఐపి దర్శనానికి సంబంధించిన రిక్వెస్ట్ లెటర్లను పవన్ కళ్యాణ్ తన డూప్లికేట్ మెయిల్ ద్వారా టిటిడి అధికారులకు పంపగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. శ్రీవారి భక్తులను మోసగించడమే పనిగా ఎంచుకున్న పవన్ కళ్యాణ్, భక్తులకు ఫోన్ చేసి మరీ శ్రీవారి దర్శనం టికెట్లు ఏర్పాటు చేస్తానని తెలిపి పలువురి వద్ద రూ. 90 వేలు తీసుకొని మోసం చేశాడు.
Also Read: IPL 2025: చిన్నస్వామికి మళ్లీ నీటి వివాదం.. ఐపీఎల్ కు ఆ కష్టాలే!
భక్తుల ద్వారా ఫిర్యాదు స్వీకరించిన తిరుమల టూ టౌన్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద సెల్‌ఫోన్‌తో పాటు, ఐదు బ్యాంక్ అకౌంట్లను సైతం గుర్తించారు. నిందితుడికి గత నేరచరిత్ర ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. శ్రీ సత్యసాయి జిల్లా, కొత్తచెరువు పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్: 215/2021 u/s 354, 323 r/w 34 IPC, తమిళనాడు రాష్ట్రం, రామనాథపురం పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 06/2025 u/s 318 (4) BNS & Sec 66D ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
Also Read: Ostriches: రాళ్లు తినే వింత పక్షి.. అసలు రహస్యం ఇదే!
తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఎవరైనా ఇటువంటి మోసాలకు పాల్పడితే తమకు సమాచారం అందించాలని, అలాగే టిటిడి టోల్ ఫ్రీ నెంబర్ 1800-4254141 లేదా 155257 నెంబర్లకు ఫోన్ చేసి దర్శనానికి సంబంధించిన వివరాలను తెలుసుకోవాలని పోలీసులు సూచించారు. శ్రీవారి భక్తులారా తస్మాత్ జాగ్రత్త.. ఇలాంటి కేటుగాళ్లను నమ్మవద్దు సుమా!