Venkaiah Naidu: నేటి రాజకీయాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన కామెంట్స్ చేశారు. ఏ ఎన్నికల్లో నైనా గెలిచిన పార్టీ తరపున ఉండాలని, లేకుంటే ఆ పార్టీకి రాజీనామా చేసి మళ్లీ తమ సత్తా చాటుకోవాలన్నారు. అంతేకాకుండా జమిలి ఎన్నికల పై సైతం వెంకయ్య నాయుడు చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.
తిరుపతిలో జరిగిన ఒకే దేశం – ఒకే ఎన్నిక సదస్సులో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకే దేశం – ఒకే ఎన్నికపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోందని, దేశంలో ఒకేసారి నాలుగు సార్లు గతంలో ఎన్నికలు జరిగాయన్నారు.
పెరిగిన టెక్నాలజీ తో ఒకేసారి లోక్ సభ, శాసనసభ ఎన్నికలు జరపడం సులభతరమేనంటూ అభిప్రాయపడ్డ వెంకయ్య నాయుడు, రాజకీయ కారణాలవల్ల కొంతమంది దీనిని వ్యతిరేకిస్తున్నారన్నారు. అయితే ఈ విధానంతో ప్రాంతీయ పార్టీలకు ముప్పు అంటున్నారని, ఇందులో ముప్పు ఏమిటో కనిపించడం లేదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నవారికి జమిలి ఎన్నికలు ఉపయోగకరంగా ఉంటాయన్న మాటలో నిజం లేదని, గతంలో కేంద్రంలో జాతీయ పార్టీలు, రాష్ట్రాలలో స్థానిక పార్టీలు విజయం సాధించాయన్నారు.
1984లో దేశవ్యాప్తంగా ఇందిరా గాంధీ మరణం తర్వాత కాంగ్రెస్ విజయం సాధిస్తే రాష్ట్రంలో టిడిపి విజయాన్ని అందుకుందన్నారు. ఓటర్లు తమకు ఏ పార్టీ అవసరమో ఆ పార్టీకి మద్దతు ఇస్తారని, జమిలి ఎన్నికలలో ఓటింగ్ శాతం పెరుగుతుందన్నారు. జాతీయ పార్టీలతో ధీటుగా ప్రాంతీయ పార్టీలు ఆర్థికంగా బలోపేతంగా ఉన్నాయని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పని చేయాలని సూచించారు.
రాజకీయ పార్టీలకు అధికారం కోల్పోతే ఓపిక తగ్గిపోతుందని, ఐదు సంవత్సరాల పాటు ఎదురు చూసే ఓపిక సైతం కనిపించడం లేదన్నారు. చర్చలు జరగకుండా సభను కూడా జరగనివ్వడం లేదని, రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కోల్పోతున్నారని వెంకయ్య నాయుడు అన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించడం లేదు, కొంతమంది బుల్లెట్ ద్వారా అధికారం సాగించాలని అభిప్రాయపడుతున్నారని, అటువంటి వాటికంటే ఓటు అనే ఆయుధం చాలా శక్తివంతమైనదని ఆయన తెలిపారు.
Also Read: Sri Rama Navami: కోదండరాముడికి కళ్లు చెదిరే కానుక.. ఏమిటంటే?
గెలిచిన పార్టీ తరఫున ఉండాలి, లేకుంటే రాజీనామా చేయాలి, అంతేకానీ ఇతర పార్టీలోకి వెళ్లడం కరెక్ట్ కాదన్నారు. పార్టీ ఫిరాయింపు చట్టంలో మార్పు తీసుకురావాలని, పార్టీ మారినప్పుడు ఖచ్చితంగా పదవికి రాజీనామా చేయాలన్న నిబంధన ఉండాలన్నారు. శాసనసభలో బూతులు మాట్లాడుతూ.. పేపర్లు చించి చొక్కాలు మడిచి బయటకు రా.. తేల్చుకుందాం అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారని, బూతులు మాట్లాడే సంస్కృతి సైతం సభకు వచ్చిందన్నారు. ఇలా బూతులు మాట్లాడే వారికి గత ఎన్నికల్లో బుద్ధి చెప్పారని, పరోక్షంగా వైసీపీని ఉద్దేశించి వెంకయ్య నాయుడు అన్నారు. వెంకయ్య నాయుడు చేసిన కామెంట్స్ ప్రస్తుతం ఏపీలో వైరల్ గా మారాయి.