TGSRTC: అన్ని రంగాలను ప్రభావితం చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ను విస్తృతంగా వినియోగించాలని ఆర్టీసీ(RTC) నిర్ణయించింది. ఉత్పాదకత పెంపు, సిబ్బంది పనితీరు, ఆరోగ్య పర్యవేక్షణ, ఖర్చుల తగ్గింపు, రద్దీకి అనుగుణంగా సర్వీసుల ఏర్పాటుతో పాటు సేవలను మరింత ప్రజానుకూలంగా తీర్చిదిద్దడమే ప్రధాన ఉద్దేశం. దేశంలోనే తొలిసారిగా ఏఐ(AI) వినియోగించిన ప్రజా రవాణా సంస్థగా ఆర్టీసీ నిలిచింది. ఏఐ ప్రాజెక్టు అమలుకు హన్స ఈక్విటీ పార్టనర్స్ ఎల్ఎల్‌పీ(LLP) అనే సంస్థ ఆర్టీసీకి తోడ్పాటును అందిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం, ప్రణాళికాబద్ధమైన అమలు వ్యూహాలను అందించి, అన్ని డిపోల్లో సులభంగా అమలు జరిగేలా ఆ సంస్థ సహకరిస్తోంది. సంస్థలో ఏఐ వినియోగం కోసం ఒక ప్రత్యేక టీంను యాజమాన్యం ఏర్పాటు చేసింది. సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి, అవగాహన ఉన్న అధికారులను గుర్తించి.. ఆ టీంలో ప్రాధాన్యం ఇచ్చింది. ఏఐ వాడకంపై ఆ టీంకు హన్స ఈక్విటీ పార్ట్‌నర్స్ శిక్షణ ఇస్తోంది.
ఆటోమెటిక్ షెడ్యూలింగ్‌ను..
ఏఐ ప్రాజెక్టులో భాగంగా మొదటగా 40 వేల మంది సిబ్బంది ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తున్నారు. గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ లో భాగంగా ఉద్యోగులకు చేసిన వైద్య పరీక్షల ఆధా రంగా ఆరోగ్య పరిస్థితిన ఏఐ, మెషిన్ లెర్నింగ్ సహకారంతో అంచనా వేస్తున్నారు. మొదట పైలట్ ప్రాజెక్ట్‌గా 6 డిపోల్లో అమలు చేయగా మంచి ఫలితాలు వచ్చాయి. ప్రస్తుతం అన్ని డిపోల్లోనూ ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. త్వరలోనే ఏఐ ద్వారా ఆటోమెటిక్ షెడ్యూలింగ్‌ను సంస్థ ప్లాన్ చేస్తోంది.
రోజు, తిథి, పండుగులు, వారాల్లో ఏఐ, మెషిన్ లెర్నింగ్ సహకారంతో ప్రయాణికుల రద్దీని అంచనా వేసి ఆ మేరకు బస్సులను సంస్థ ఏర్పాటు చేయనుంది. ఏఐ ప్రాజెక్ట్ అమలు తీరుపై సచివాలయంలో ఇటీవల రవాణా, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం(Min Ponnam Prabakar) ప్రభాకర్ కి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో వివరించారు. ఆధునిక రవాణా అవసరాలకు అనుగుణంగా, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు సంస్థను ఆర్థికంగా, సాంకేతికంగా బలోపేతం చేయడం కోసం 2021 నుంచే అమలు చేస్తున్న స్ట్రాటజిక్ డిప్లాయ్‌మెంట్ ప్లాన్ (ఎస్డీపీ) కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి నెలా ఎస్‌డీపీ సమీక్ష సమావేశాలను నిర్వహిస్తూ, స్వల్పకాలిక – దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటి అమలులో సంస్థ చురుకైన చర్యలు తీసుకుంటున్నదని అధికారులు తెలిపారు.
ఏఐ ప్రభావితం చేయని రంగమే లేదు: మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రపంచంలో ప్రస్తుతం ఏఐ ప్రభావితం చేయని రంగమే లేదు. రవాణా వ్యవస్థలో మార్పులను గుర్తించి ప్రజల రవాణా అవసరాలకు అనుగుణంగా ఏఐని వినియోగించుకోవాలని భావించడం మంచి విషయం. ఈ ఏఐ ప్రాజెక్ట్ అమలుకు సమష్టిగా పనిచేసి ఆర్టీసీ మరింత అభివృద్ధి సాధించేలా అధికారులందరూ కృషి చేయాలి.
ఆర్టీసీ బలోపేతం కోసం ఏఐ అమలు: ఎండీ వీసీ సజ్జనర్
ఆర్టీసీ సంస్థను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా బలోపేతం చేయడం కోసమే ఏఐ ప్రాజెక్ట్‌ను అమలు చేస్తున్నాం. ఏఐ వినియోగంతో సేవల్లో మరింతవేగం, కచ్చితత్వం, స్పష్టత ఉంటుంది. ప్రయాణికుల అవసరాలు, ట్రాఫిక్ పరిస్థితులను బట్టి స్మార్ట్ షెడ్యూలింగ్ సాధ్యమవుతుంది. ప్రజా రవాణా రంగంలో సాంకేతికతను వినియోగించి దేశంలోనే తొలి మోడల్‌గా ఆర్టీసీ నిలవడం గర్వకారణం.
Also Read: Jogulamba Temple: జోగులాంబ ఆలయ మిస్టరీ.. అమ్మవారిని నేరుగా ఎందుకు దర్శించుకోరో తెలుసా?