Jogulamba Temple: తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రాల్లో జోగులాంబ ఆలయం ఒకటి. జోగులాంబ గద్వాల్ జిల్లాలోని ఆలంపూర్ లో కొలువైన జోగులాంబ (శక్తి స్వరూపం)ను దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. దేశంలోని 18 మహా శక్తి పీఠాలలో జోగులాంబను 5వ శక్తి పీఠంగా చెబుతుంటారు. ప్రస్తుతం దసరా శరన్నవరాత్రులు జరుగుతున్న క్రమంలో పెద్ద ఎత్తున భక్తులు ఈ ఆలయానికి పోటెత్తుతున్నారు. దీంతో జోగులాంబ ఆలయం పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ టెంపుల్ కు సంబంధించిన చరిత్ర, స్థలపురాణం, అమ్మవారి నిజరూప దర్శనం వంటి విశేషాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
ఆలయ చరిత్ర..
జోగులాంబ ఆలయాన్ని.. 7వ శతాబ్దంలో బాదామి చాళుక్యులు నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఇక్కడ సతీ దేవి దంతాలు పడినట్లు పురాణాలు పేర్కొన్నాయి. దక్ష యాగం సందర్భంగా సతీ ఆత్మాహుతి చేసుకున్న తర్వాత ఆమె శరీర భాగాలు వివిధ ప్రదేశాలలో పడి 18 శక్తి పీఠాలు ఏర్పడ్డాయి. అలా జోగులాంబ కూడా ఒక శక్తిపీఠంగా మారింది. చాళుక్యులు నిర్మించిన ఈ ఆలయాన్ని 14వ శతాబ్దంలో బహమనీ సుల్తాన్లు ధ్వంసం చేశారు. అయితే 2005లో అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఆలయాన్ని పునః నిర్మించింది.
ఆలయ ప్రత్యేకతలు
జోగులాంబ ఆలయం శక్తి సాధనకు ప్రసిద్ధి. ఆలయం పక్కనే 9 శివ ఆలయాలు (స్వర్గబ్రహ్మ, పద్మబ్రహ్మ, విశ్వబ్రహ్మ, అర్కబ్రహ్మ, బాలబ్రహ్మ, గరుడబ్రహ్మ, తారకబ్రహ్మ మొదలైనవి) ఉన్నాయి. కృష్ణ-తుంగభద్రా నదుల సంగమంలో జోగులాంబ ఆలయం ఉండటం విశేషం. మహా శివరాత్రి, జోగులాంబ బ్రహ్మోత్సవాలను ఈ ఆలయంలో ఘనంగా నిర్వహిస్తారు. ఆర్థిక సమస్యలు ఉన్నవారు, సంతానం కోసం పరితపించేవారు ఈ అమ్మవారి దర్శనం చేసుకుంటే తప్పక కోరికలు నెరవేరతాయని భక్తుల విశ్వాసం.
జోగులాంబ అమ్మవారి రూపం రహస్యం
జోగులాంబ అమ్మవారి రూపం అత్యంత భయంకరంగా ఉంటుంది. జోగులాంబ తల్లి.. శవం (మృతదేహం)పై కూర్చుని ఉంటుంది. నగ్న రూపంలో, నాలుక బయటకు చాసి, తలపై సర్పం, దోడ, పిప్పలి, మిరియాలు ఉంటాయి. యోగులు, తాంత్రికులు మాత్రమే ఆమె నిజ రూపాన్ని నేరుగా చూసి తట్టుకోగలరని.. సామాన్య భక్తులు అమ్మవారిని దర్శించుకోవడం కష్టమని అంటుంటారు. అందుకే అమ్మవారి విగ్రహాన్ని పూర్తిగా కప్పి ఉంచి.. కేవలం ముఖం మాత్రమే కనిపించే స్థితిలో సామాన్య భక్తులకు దర్శనం కల్పిస్తారు. అందుకే జోగులాంబ అమ్మవారి విగ్రహం ఎల్లప్పుడూ పూర్తి వస్త్రం (ముఖం మినహా)తో కప్పబడి ఉంటుంది. పూజారులు మాత్రమే నిర్దిష్ట సమయాల్లో నియమాలకు అనుగుణంగా అమ్మవారి నిజరూప దర్శనం చేసుకుంటూ ఉంటారు.
Also Read: Hijras Attack Nurse: హిజ్రాల రౌడీయిజం.. డబ్బు ఇవ్వలేదని.. నర్సు బట్టలు చించి వీరంగం!
చేరుకునే మార్గాలు
ఆలంపూర్ హైదరాబాద్‌కు సుమారు 215-220 కి.మీ. దూరంలో ఉంది. NH44 (హైదరాబాద్-బెంగళూరు రహదారి) ద్వారా సులభంగా చేరుకోవచ్చు. ప్రయాణ సమయం 3-5 గంటలు (ట్రాఫిక్ ఆధారంగా). హైదరాబాద్ నుంచి నేరుగా బస్సు సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి. రైలు మార్గంలో వెళ్లదలిచిన వారు.. ఆలయానికి సమీప రైల్వే స్టేషన్లు అయిన కర్నూలు (27 కి.మీ), గద్వాల్ (50కి.మీ) చేరుకోవచ్చు. అక్కడి నుంచి బస్సు, ప్రైవేటు వాహనాల్లో ఆలయానికి వెళ్లవచ్చు. ఇక హైదరాబాద్ నుంచి విమానంలో వెళ్లాలని భావించినవారు కర్నూలు విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి బస్సు/కారులో ఆలయానికి చేరుకోవచ్చు. ఆలయం టైమింగ్స్ విషయానికి వస్తే ఉదయం 7:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు, మధ్యాహ్నం 2:00 నుండి సాయంత్రం 8:30 వరకు ప్రతీ రోజు దర్శనం ఉంటుంది.