Hijras Attack Nurse: హిజ్రాలు రెచ్చిపోతున్న ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోతున్నాయి. డబ్బును అడిగే స్థితి నుంచి డిమాండ్ చేసే స్థాయికి కొందరు హిజ్రాలు వెళ్లిపోయారు. ఈ క్రమంలో ప్రతిఘటించిన వారిపై భౌతిక దాడులకు తెగబడుతున్నారు. ఈ తరహా ఘటనలు ట్రాఫిక్ సిగ్నల్స్, షాపులు, రైళ్లు ఇలా చాలా చోట్ల చోటుచేసుకుంటున్నాయి. అయితే తాజాగా ఓ ఆస్పత్రిలోనూ హిజ్రాలు రెచ్చిపోవడం తీవ్ర చర్చకు తావిచ్చింది. ఒక నర్సుపై వారు విచక్షణారహితంగా దాడి చేసిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి.
అసలేం జరిగిందంటే?
ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కందుకూరులోని ఓ ఆస్పత్రిలోకి ప్రవేశించిన కొందరు హిజ్రాలు మామూళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే రిసెప్షన్ లో ఉన్న ఒక మహిళా నర్స్ వారికి డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించింది. అప్పటికే ఫుల్లుగా మద్యం మత్తులో ఉన్న హిజ్రాలు.. ఆమె తిరస్కరణను స్వీకరించలేకపోయారు. డబ్బు ఇవ్వాలని వాగ్వాదానికి దిగారు. అయితే తన దగ్గర డబ్బులు ఎందుకు ఉంటాయని.. ఇక్కడి నుంచి వెళ్లాలని ఆ నర్సు సున్నితంగానే నచ్చజెప్పే ప్రయత్నం చేసింది.
జట్టు పట్టుకొని ఈడ్చి.. బట్టలు చింపి..
దీంతో డబ్బు ఇవ్వకపోగా.. తమనే ప్రశ్నిస్తావా అంటూ నర్సుపై ఆరుగురు హిజ్రాలు దాడికి తెగబడ్డారు. రెసెప్షన్ క్యాబిన్ నుంచి బయటకు లాక్కొచ్చి భౌతిక దాడి చేశారు. టేబుల్ పైన ఉన్న ఫైళ్లను విసిరిపారేశారు. అంతటితో ఆగకుండా నర్సు జట్టుపట్టుకొని రోడ్డుపైకి ఈడ్జుకొచ్చారు. ఆమె బట్టలు చింపేసి సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరుగురు హిజ్రాలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
నెల్లూరు జిల్లా కందుకూరులో హిజ్రాల దౌర్జన్యం
దసరా మామూలు ఇవ్వలేదని నర్సును జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లి దారుణంగా కొట్టిన హిజ్రాలు.#Hijras #transgenders #Kandukur #Nelloredistrict #hijrasattacked #SwetchaDaily pic.twitter.com/ANCA3vuiRJ
— Swetcha Daily News (@SwetchaNews) September 24, 2025
Also Read: Accenture Campus: ఏపీకి గుడ్ న్యూస్.. 12వేల ఉద్యోగాలతో.. టాప్ గ్లోబల్ కంపెనీ వచ్చేస్తోంది!
రైల్వే ఇన్ స్పెక్టర్‌పై దాడి
యూపీలోనూ ఈ తరహాలోనే హిజ్రాలు రెచ్చిపోయారు. రైలులో దౌర్జన్యంగా డబ్బులు తీసుకోవద్దని హెచ్చరించినందుకు ఓ ఆర్పీఎఫ్ ఇన్ స్పెక్టర్ ను ఫ్లాట్ ఫామ్ పై పరిగెత్తించి మరీ కొట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సైతం నెట్టింట పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. యూపీలోని డియోరియా రైల్వే స్టేషన్ లో ఈ దాడి ఘటన చోటుచేసుకుంది. అస్సాం ఎక్స్ ప్రెస్ రైలులో తనిఖీలు చేస్తుండగా ఆర్పీఎఫ్ ఇన్ స్పెక్టర్ మహ్మద్ కు హిజ్రాల గురించి ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. దీంతో ఇన్ స్పెక్టర్ మహ్మద్ వారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మళ్లీ ఫ్టాట్ ఫామ్ పై హిజ్రాలు ఓ ప్రయాణికుడితో తప్పుగా ప్రవర్తించడంతో మహ్మద్ మళ్లీ ప్రశ్నించాడు. దీంతో హిజ్రాల కోపం కట్టలు తెచ్చుకుంది. రైల్వే పోలీసు అన్న జ్ఞానం కూడా లేకుండా విచక్షణారహితంగా మహ్మద్ పై దాడి చేశారు.