Telangana Govt: పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టి, పర్యావరణాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ‘వేస్ట్ టు ఎనర్జీ’(చెత్త నుంచి విద్యుత్) ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నది. ఇటీవల జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో ఏర్పాటు చేసిన ‘నెట్ జీరో స్టాల్’ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని గ్రీన్ ఎనర్జీ రంగంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుడుతోంది. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసింది. 2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో కేవలం సౌర విద్యుత్ మాత్రమే కాకుండా, విండ్ మిల్స్, వ్యర్థాల ద్వారా విద్యుత్ తయారీపై దృష్టి సారించింది. ముఖ్యంగా నివాస ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేసుకోగలిగే ‘చిన్న స్థాయి విండ్ మిల్స్’ ద్వారా విద్యుదుత్పత్తి చేసే సాంకేతికతకు భవిష్యత్తులో డిమాండ్ పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళికలు
నగరాల్లో అతిపెద్ద సమస్యగా మారిన ఘన వ్యర్థాల(సాలిడ్ వేస్ట్) నుంచి ఇప్పటికే విద్యుత్ తయారీ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. జీహెచ్‌ఎంసీ పరిధితో పాటు గ్రేటర్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే పలు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు పని చేస్తున్నాయి. జవహర్ నగర్ వంటి ప్రాంతాల్లో చెత్తను రీసైకిల్ చేసి విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా అటు కాలుష్యం తగ్గడంతో పాటు ఇటు ఇంధన అవసరాలు తీరుతున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న ప్లాంట్ల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, మరిన్ని కొత్త ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వెలువడే వ్యర్థాలను సమర్థవంతంగా వినియోగించుకుని, రాష్ట్రాన్ని ‘నెట్ జీరో’ దిశగా తీసుకెళ్లడమే ఈ ప్రాజెక్టుల ప్రధాన ఉద్దేశ్యం. భవిష్యత్ అంతా హరిత ఇంధనానిదేనని, ఈ రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Telangana Govt: రికార్డ్ స్థాయిలో ధాన్యం సేకరణ.. కొనుగోళ్లు మరింత స్పీడప్!
గ్లోబల్ సమ్మిట్‌లో ప్రత్యేక ఆకర్షణగా జీరో స్టాల్
తెలంగాణ భవిష్యత్ ప్రణాళికను ఆవిష్కరించిన తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్‌లో ఇంధన శాఖ ఏర్పాటు చేసిన నెట్ జీరో స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పర్యావరణ హితమైన, స్వచ్ఛమైన ఇంధన వనరుల వినియోగాన్ని ప్రదర్శిస్తూ ఏర్పాటు చేసిన ఈ స్టాల్, దేశీయ, విదేశీ ప్రతినిధులు, సందర్శకుల దృష్టిని ఆకర్షించింది. ఇందులో ప్రదర్శించిన 500 వాట్ల సామర్థ్యం కలిగిన విండ్ మిల్(పవన విద్యుత్ మర), వేస్ట్-టు-ఎనర్జీ (చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి) జనరేషన్ ప్లాంట్ నమూనా, రాష్ట్ర ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన రంగంలో సాధిస్తున్న ప్రగతిని, భవిష్యత్ లక్ష్యాలను కళ్లకు కట్టినట్లు చూపింది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 ద్వారా 2030 నాటికి 20,000 మెగావాట్ల గ్రీన్ పవర్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా, ఇప్పటికే ఉన్న, కొత్త వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లపై ప్రత్యేక దృష్టి సారించింది.
ఎనర్జీ ప్లాంట్ సామర్థ్యం విస్తరించడమే లక్ష్యం
రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ సామర్థ్యాన్ని విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా హైదరాబాద్‌లోని జవహర్‌నగర్ వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్ సామర్థ్యాన్ని పెంచే పనులు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ఉన్న 19.8 మెగావాట్ల సామర్థ్యాన్ని 48 మెగావాట్లకు పెంచే ప్రక్రియలో భాగంగా ఈ ఏడాది ఆగస్టులో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఈ ప్లాంట్ ద్వారా రోజుకు సుమారు 1300 నుంచి 1500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు.
ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో ఐదు కొత్త ప్లాంట్ల ఏర్పాటు ద్వారా మొత్తం ఉత్పత్తి సామర్థ్యాన్ని 101 మెగావాట్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దుండిగల్‌లో 15 మెగావాట్ల ప్లాంట్, మెదక్ జిల్లాలో ప్యారానగర్‌లో 15 మెగావాట్ల ప్లాంట్, యాచారంలో 12 మెగావాట్ల ప్లాంట్, బీబీనగర్ వద్ద 11 మెగావాట్ల ప్లాంట్‌ను ఏర్పాటుచేయనున్నారు. ఇదిలా ఉండగా ఈ గ్రీన్ ఎనర్జీ పాలసీ ద్వారా సుమారు రూ.1.98 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని, తద్వారా 1.14 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.
Also Read: Telangana Govt: పాత పద్ధతిలోనే యూనిఫాంలు.. ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదనలు!

