Telangana Govt: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 2025 – 26 విద్యా సంవత్సరానికి సంబంధించి యూనిఫాంల రూపకల్పనలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నది. గతేడాది ప్రవేశపెట్టిన ‘కార్పొరేట్ లుక్’ డిజైన్లను పక్కన పెట్టి పాత మోడళ్లకే విద్య శాఖ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తున్నది. విద్యార్థులకు సకాలంలో యూనిఫాంలను పంపిణీ చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. విద్యార్థులకు సకాలంలో యూనిఫాంలు అందించడం ప్రతి సంవత్సరం సమస్యగా మారుతున్నది. సరఫరా కొరత, టైలర్ల సంఖ్య తక్కువగా ఉండడం వంటి కారణాల వల్ల యూనిఫాంలు అందజేయడంలో ఆలస్యం జరుగుతున్నది. ఈ సమస్యను అధిగమించేందుకు, గతేడాది ప్రవేశపెట్టిన అదనపు డిజైన్లు, ప్యాటర్న్‌లతో కూడిన కొత్త మోడళ్లను కొనసాగించడం వల్ల మళ్లీ జాప్యం జరిగే అవకాశం ఉన్నదని అధికారులు భావిస్తున్నారు. అందుకే, తక్కువ సమయంలో ఎక్కువ యూనిఫాంలను కుట్టడానికి వీలుగా పాత, సరళమైన ఫార్మాట్‌కే తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
Also Read: Telangana Govt: రికార్డ్ స్థాయిలో ధాన్యం సేకరణ.. కొనుగోళ్లు మరింత స్పీడప్!
20 లక్షల మందికి రెండు యూనిఫాంలు
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 20 లక్షల మంది విద్యార్థులకు రెండు యూనిఫాంలకు సరిపడేలా క్లాత్‌ను కొనుగోలు చేసేందుకు ఇండెంట్‌ను విద్యాశాఖ సిద్ధం చేసినట్లు సమాచారం. తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ద్వారా క్లాత్ కొనుగోలుకు ఇప్పటికే ఇండెంట్ ఇచ్చినట్లు సమాచారం. ఈ క్లాత్ రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలకు వచ్చే ఏడాది జనవరి 31 నాటికి చేరుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తున్నది.
సకాలంలో క్లాత్ మండల కేంద్రాలకు చేరుకుంటేనే వాటిని వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి కుట్టు పనులు పూర్తిచేసి అందించే ఆస్కారముంటుంది. లేదంటే మళ్లీ జాప్యం తప్పదు. ప్రతి ఏటా స్కూళ్లు పునఃప్రారంభమయ్యే సమయానికి విద్యార్థులకు యూనిఫాంలు అందించాలని భావిస్తున్నా ఏదో ఒక కారణం వల్ల ఆలస్యమవుతూ వస్తున్నది. అందుకే వచ్చే విద్యా సంవత్సరంలో అయినా జాప్యం జరగకూడదని విద్యాశాఖ భావిస్తున్నది.
మహిళా స్వయం సహాయక సంఘాలకు బాధ్యతలు
గత సంవత్సరం మాదిరిగానే, ఈసారి కూడా మహిళా స్వయం సహాయక సంఘాలకు యూనిఫాంల కుట్టు బాధ్యతలను అప్పగించే అవకాశమున్నది. అయితే, వారికి చెల్లించే గౌరవ వేతనం ఏమాత్రం చాలడం లేదనే వాదన ఉన్నది. దీనిపై సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాల్సి ఉంది. గతంలో ఒకటో తరగతి నుంచి 7వ తరగతి వరకు అబ్బాయిలకు నిక్కర్లు అందించేవారు. విద్యార్థుల అభ్యంతరాల మేరకు వాటి స్థానంలో ఫుల్ ప్యాంట్లు సరఫరా చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే యూనిఫాంలలో మార్పులు చేశారు. 1వ తరగతి నుంచి 5 వరకు నిక్కర్లు, 6 నుంచి ఆపై తరగతుల బాలురకు ప్యాంట్లు అందిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం కూడా ఇదే విధానం కొనసాగనున్నది. యూనిఫాంల పంపిణీలో ప్రతీసారి ఎదురయ్యే జాప్యాన్ని నివారించేందుకు విద్యాశాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. మరి, ఈసారైనా నిర్దేశించుకున్న సమయంలో విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు అందజేస్తారా లేదా అనేది చూద్దాం.
Also Read: Telangana Govt: కొలువుల కేరాఫ్‌గా తెలంగాణ.. 61,379 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ!

