Hospital Diet Contractors: మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని హాస్పిటల్ డైట్ కాంట్రాక్టర్లకు బిల్లులు అందక ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 8 నెలల నుంచి ప్రభుత్వం నుంచి బిల్లులు రాలేదని వారు చెబుతున్నారు. ఈ ఏడాది మార్చి నుంచి సెప్టెంబర్ వరకు డీఎంఈ(DME) హాస్పిటల్స్‌లో దాదాపు రూ.8 కోట్ల 29 లక్షల వరకు బకాయిలు ఉన్నట్లు కాంట్రాక్టర్లు వెల్లడించారు. టీవీవీపీలో దాదాపుగా 3 నెలల నుంచి రూ.కోటి 50 లక్షలు పెండింగ్ ఉన్నట్లు వివరించారు. డీఎంఈ, టీవీవీపీ కమిషనర్‌తో పాటు ప్రభుత్వానికి వినతి పత్రాలు అందజేసినట్లు తెలిపారు. బిల్లులు చెల్లించకపోతే డైట్ సప్లై చేయడం కష్టం అవుతుందని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు.
సప్లై చైన్‌కు బ్రేకులు?
8 నెలలుగా ఒక్క రూపాయి కూడా విడుదల కాకపోవడంతో కాంట్రాక్టర్ల నుంచి నిత్యావసరాలు, సరుకులు, గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసే వ్యాపారులకు, కూలీలకు చెల్లింపులు ఆగిపోయాయి. అప్పులు చేసి, వడ్డీలు కట్టలేక తాము ఆర్థికంగా చితికిపోయామని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. దీంతో ఇకపై డైట్ సరఫరాకు అవసరమైన సరుకులు, కూరగాయలు, పాలు, గుడ్లు వంటి వాటిని అప్పు చేసి మరీ కొనలేని పరిస్థితి ఉన్నదని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే పలు ఆసుపత్రుల్లో డైట్ నాణ్యత తగ్గిపోవడం లేదా కొన్నిచోట్ల సరఫరాలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు పేర్కొంటున్నారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక భరోసా లేకపోవడంతో పేద ప్రజలు అధికంగా ఆధారపడే ప్రభుత్వ ఆసుపత్రుల్లో, వేలాది మంది రోగులు, గర్భిణీలు, చిన్నపిల్లలకు సరైన సమయంలో, నాణ్యమైన ఆహారం అందడం గగనమవుతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. డయాలసిస్, ఆపరేషన్లు జరిగిన రోగులకు తప్పనిసరిగా అందించాల్సిన ప్రత్యేక ఆహారం సైతం సక్రమంగా అందించలేని దుస్థితి నెలకొన్నదని అధికారులూ ఆఫ్ ది రికార్డులో వెల్లడించారు.
Also Read: GHMC: బల్దియాలో ఏడాదిగా కీలక పదవి ఖాళీ.. హాట్ కేకులా మారిన పోస్ట్
వెంటనే బిల్లులు చెల్లించాలి: డైట్ కాంట్రాక్టర్ల అసోసియేషన్
పదే పదే అధికారులకు మోర పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందని కాంట్రాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధి ఒకరు తెలిపారు. 8 నెలలుగా బిల్లులు రాకపోవడంతో, సరుకుల సరఫరాదారులు అప్పులివ్వడానికి నిరాకరిస్తున్నారని చెప్పారు. పేషెంట్లకు సకాలంలో సరైన ఆహారం అందించాలంటే సరైన సమయంలో బిల్లులు ఇవ్వాలని కోరుతున్నారు. పండుగ సందర్భంలోనూ బిల్లులు రాకపోవడంతో గోల్డ్ లోన్ పెట్టి మరీ తమ సిబ్బందికి జీతాలు, మెయింటనెన్స్ ఖర్చులు పెట్టినట్లు డైట్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ ముఖ్య నేత వివరించారు.
Also Read: Diwali Outside India: దీపావళి ఇండియాలోనే కాదు… మరికొన్ని దేశాల్లోనూ అదుర్స్.. అవేంటంటే?
