Mahabubabad District: పుట్టినరోజు కుటుంబ సభ్యులతో ఆనందంగా వేడుకలను నిర్వహించుకోవలసిన వివాహిత అనంత లోకాలకు వెళ్ళింది. అది తెలంగాణ సాంప్రదాయ బద్ధమైన బతకమ్మ(Bathukamma) ప్రారంభ రోజు ఎంగిలిపూల అనంతలోకాలకు.. ఎంచగూడెంలో పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్(Mahabubabad) జిల్లా కొత్తగూడ మండలం ఎంచగూడెం(Enchagudem) గ్రామం, కొత్తగూడ మండల జనంసాక్షి విలేఖరి శెట్టి పరశురాం భార్య శెట్టి మౌనిక(36) ఉదయం నుండి ఇద్దరు కూతుర్లు, కుమారునితో కలిసి ఎంతో ఆనందంతో తీరొక్క పూలను తెంపుకొచ్చి ఆ..పూలతో బతుకమ్మను పేర్చింది. సాయంకాలం సమయంలో స్థానిక దేవాలయానికి బతుకమ్మ పట్టుకుని వెళ్ళింది.
కోలాటం ఆడుతున్న క్రమంలో..
ఎంగిలిపూల బతుకమ్మ సంబరాల్లో పాల్గొని మహిళలతో పాటలు పాడుతూ కోలాటాలు వేస్తూ.. బతుకమ్మల చుట్టూ తిరుగుతూ సంతోషంగా ఉంది. పండుగ సందడిలో మహిళలంతా ఉత్సాహంగా ఆడి.. పాడుతున్న క్రమంలో బతుకమ్మ ల చుట్టూ తిరుగుతూ కోలాటం ఆడుతున్న క్రమంలోనే మౌనిక ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో.. అంతసేపు ఆనందంగా ఉన్న మహిళలు హఠాన్మరణంతో అయోమయానికి గురయ్యారు. వెంటనే తేరుకున్న స్థానికులు కొందరు మౌనిక పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందింది. దీంతో పండగ పూట ఆ..కుటుంబంలో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బతుకమ్మ వేడుకకు ఆనందంగా వచ్చి.., బతుకమ్మ ఆడుతునే ప్రాణం విడిచిన మౌనికను తలుచుకుంటూ మహిళలు, గ్రామస్తులు కన్నీరు పెట్టారు.
పండుగ హుషారులో..
ఆనందంగా ఉన్న అమ్మ. తమను తయారు చేసుకొని, వెంటబెట్టుకొని బతుకమ్మను పట్టుకొని వచ్చిన అమ్మ ఒక్కసారిగా కుప్పకూలి మరణించడంతో ఆ..ముగ్గురు చిన్నారుల అమ్మా…లే…అమ్మా అంటూ చేస్తున్న రోదనలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తున్నాయి. కొత్తగూడ మండల జనంసాక్షి(janam sakshi) విలేకరి, టియుడబ్ల్యూజే(ఐజేయు) మండలనాయకులు పరుశురాం సతీమణి మౌనిక ఆకస్మిక మరణం పట్ల టియుడబ్ల్యూజే (ఐజేయు) మహబూబాబాద్ జిల్లాఅద్యక్షులు సిహెచ్ శ్రీనివాస్, జిల్లాప్రధానకార్యదర్శి గాడిపల్లి శ్రీహరి ప్రగాడసంతాపాన్ని తెలిపారు. ఆనందంగా బతుకమ్మ ఆడుకుంటూ మౌనిక మరణించడం హృదయాన్ని కలిచివేసిందని, పరుశురాం కుటుంబానికి జరిగిన నష్టం పూడ్చలేనిదన్నారు.
Also Read: Viral News: అసభ్యకర వీడియోలు చూస్తూ డ్రైవింగ్.. చివరికి ఏం జరిగిందంటే