Telangana News: చలి తీవత్ర నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలల టైమింగ్స్‌ను మారుస్తూ విద్యాశాఖ (Telangana News) నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఆయా జిల్లాల డీఈవోలు సమయాన్ని మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో తీవ్రమైన చలిగాలులు, ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిన నేపథ్యంలో విద్యార్థుల భద్రత, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేపట్టారు. సాధారణంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు ఉన్న పాఠశాలల పనివేళలు, ఇకపై ఉదయం 9:40 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు కొనసాగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ, లోకల్ బాడీ, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, మోడల్ స్కూళ్లు, ప్రైవేట్ యాజమాన్య పాఠశాలలకు వర్తిస్తాయని పేర్కొన్నారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ సవరించిన సమయాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత 6 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ గా నమోదవుతోంది. విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కొంత ఉపశమనం కలిగించనుంది.
కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో కూడా..
పాఠశాలలో టైమింగ్ మార్పు కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఉంది. ఉదయం 9.40 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు సమయాన్ని నిర్దేశిస్తూ కలెక్టర్ వెంకటేష్ దోత్రే ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఈ జిల్లాలో కూడా నమోదవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read Also- Gin Movie: టికెట్ డబ్బులకు సరిపడా వినోదం పక్కా అందిస్తాం..‘జిన్’ చిత్ర దర్శకుడు చిన్మయ్ రామ్
కాగా, తెలంగాణలో ప్రస్తుతం తీవ్రమైన కోల్డ్ వేవ్ కొనసాగుతోంది. ఈ ప్రభావంతో గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో నాలుగైదు రోజులపాటు ఇవే పరిస్థితులు కొనసాగుతాయనే వాతావరణ అంచనా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో విద్యాశాఖ నిబంధనల ప్రకారం జిల్లా కలెక్టర్లకు స్కూల్ పనివేళలను మార్చే అధికారం ఉంటుంది.

